Thursday, 14 May 2015

అలీస్క!ఎక్కడైనా కనపడిందా మీకు? by Sujatha[Blogger]

Courtesy: http://manishi-manasulomaata.blogspot.in/2009/06/blog-post.html

[Above Blog is for invited readers only], Thanks to Sujatha garu.

స్కూలు తెరిచే రోజులు దగ్గర పడ్డాయి కదాని నిన్న సంకీర్తన పుస్తకాల షెల్ఫ్ సర్దుతోంటే పైనుంచి జారి పడిందొక పసుపు పచ్చ అట్ట పుస్తకం! తిప్పి చూసి ఎంత ఆనందాశ్చర్యాల్లో మునిగానంటే ఆ పుస్తకం ఎవరికో ఇచ్చి మర్చిపోయాననో, ఎక్కడో పోగొట్టుకున్నాననో అనుకుంటున్నా ఇన్ని రోజులనుంచీ! మాస్కో "రాదుగ ప్రచురణాలయం" వాళ్ళు 1987 లో ప్రచురించిన "అలీస్క"! 

ఈ "రాదుగ" వాళ్ళ పిల్లల పుస్తకాలంటే చాలా ఇష్టం నాకు! వాటిల్లో రష్యన్ నుంచి "ఆర్వియార్" అనువదించినవే  ఎక్కువనుకుంటాను. ముఖ్యంగా ఈ పుస్తకాల్లో కథల సంగతి అలా ఉంచి ..వాటిలో బొమ్మలు....మంచుతో నిండిన మాస్కో వీధులూ,వాళ్ళ ఫర్ కోట్లూ,ఆకులు రాల్చే చెట్లూ, ఎర్రటి యాపిల్స్ తో నిండిన తోటలూ, వెడల్పాటి కిటికీలు, ఫైర్ ప్లేసులూ,పెద్ద పెద్ద టీ పాట్ లూ ఇవన్నీ భలే ఉంటాయి. ఒక్కసారిగా పుస్తకంలోంచి వెళ్ళి రష్యాలో వాలిపోవాలనిపించేంతగా! రాదుగ వాళ్ళు వేసిన అనేక పుస్తకాలు ఇప్పటికీ భద్రంగా అన్నయ్య దగ్గర ఉంటాయి.  అక్కడికి వెళ్ళినపుడు చిన్నపిల్లలమైపోయి చదువుకోవాల్సిందే గానీ తెచ్చుకుని, మరీ తరచుగా పిల్లకాయలమైపోవడం కుదరదు... వాడు ఇవ్వడు!

"అలీస్క" ఒక  గుంటనక్క పిల్ల కథ! పెంపుడు జంతువులతో ఉండే అనుబంధం గురించి ఆర్మీలో పని చేసే ఒక నర్సు ద్రూనినా ఆలిస్ తన స్వీయానుభవాలతో రాసిన చిన్న పుస్తకం ఇది. 

అసలు మొదటిసారి నేను చలం "బుజ్జిగాడు" చదివినపుడు ఒక పక్షితో ఇంత అనుబంధం ఎలా పెంచుకున్నారా అని చాలా ఆశ్చర్యపోయాను. దానితో మాట్లాడ్డం, దాని మనసులో భావాలను చదవడం,దాన్ని ఇంట్లో ఒక మనిషిలా చూడ్డం, దాని గురించి ఇంట్లో అందరూ మాట్లాడుకోవడం, కంప్లయింట్స్ చేసుకోవడం చాలా తమాషాగా అనిపించింది.

సరే, అలీస్క విషయానికొస్తే...

ద్రునినా అనే ఒక నర్సు తన పదహారేళ్ల కూతురు అల్యోనాతో కలిసి పెంపుడు జంతువులమ్మే సంత లాంటి ప్రదేశానికి వెళ్తుంది, ఒక కుక్కను తెచ్చుకుందామనే ఉద్దేశంతో! అక్కడ వాళ్ళకు ఒక మూలగా నాగరిక ప్రపంచాన్ని చూసి భయంతో వణుకుతూ కూచున్న ఒక గుంటనక్క పిల్ల కనపడుతుంది. ఎవ్వరూ దాన్ని కొనడానికి ముందుకురారు. అల్యోనా ఒక అల్సేషియన్ కుక్కతో పాటు దాని కూడా ఇంటికి తీసుకెళదామని గొడవ చేయడంతో ద్రూనినా ఆ నక్క పిల్లను కొంటుంది.దానికి అక్కడే "అలీస్క" అని పేరు పెట్టేస్తారు .


 ఇంటికొచ్చాక ఇక కష్టాలు మొదలవుతాయి. అది అడవి జంతువు కావడంతో వీళ్ళనెవ్వరినీ "యాక్సెప్ట్" చెయ్యదు. దానిష్టం వచ్చినట్లు అది ఉంటానంటుంది, తింటానంటుంది.అర్థ రాత్రి (నక్క కదా మరి) నానా అల్లరీ చేసి ఆడుకుంటానంటుంది.బాత్ రూములో పెట్టి తలుపేస్తే అక్కడి సకల వస్తువులూ కింద పడేసి సర్వనాశనం చేస్తుంది.అల్సేషియన్ కుక్క "వినీ" తో శతృత్వం ఒకటీ! అలీస్క ఆ ఇంట్లో ద్రునినా ని మాత్రమే విపరీతంగా ప్రేమిస్తుంది. మిగతా వారిని దగ్గరకు కూడా రానివ్వదు.


ఇంటిల్లిపాదీ దానికి తిండిపెట్టడం, స్నానం చేయించడం,జ్వరం వస్తే దానికి తెలీకుండా దానికి మందులివ్వడం,అది పాడు చేసిన వస్తువుల్ని విసుక్కోకుండా సర్దుకోడం ఇవన్నీ ఇష్టంగా ప్రాక్టీస్ చేస్తారు.

ఇక ఇరుగుపొరుగులు వీళ్ళను వింతగా చూడ్డం మొదలుపెడతారు.అడవి జంతువుని, అందునా నక్కను పెంచుతున్నందుకు. అదీగాక దాని ఘాటైన "జూ" వాసన ఇంట్లో అందరికీ పట్టుకుని,  బయటికెళ్ళినా వీళ్ళకు ఒక వింత "గుర్తింపు"తెచ్చిపెడుతుంది. భారతీయ  మిత్రులెవరో బహుమతిగా ఇచ్చిన అగరొత్తుల్ని ఇంట్లో వెలిగించి కొంత తెరిపిన పడతారు. వాటికి ద్రునినా భర్త "యాంటీ ఫాక్సిన్" (నక్క వాసనకు విరుగుడు) అని పేరుపెడతాడు కూడా!ఇరుగుపొరుగులు అలీస్క గురించి పూర్తినిరసన వ్యక్తం చెయ్యకముందే,  అదృష్టవశాత్తూ, వసంత కాలం రావడంతో పల్లెటూళ్ళో ఇల్లు తీసుకుని కొన్నాళ్ళు గడపడానికి ద్రునినా కుటుంబం వెళుతుంది.

అక్కడ అలీస్క కు పూర్తి స్వేచ్ఛ దొరుకుతుంది. పెద్ద ఇల్లు, చుట్టూ చెట్లూ ఇలాంటి వాతావరణంలో అదీ వినీ స్నేహితులైపోతాయి.అక్కడికి వచ్చే ప్రతి చిన్న జంతువుతోనూ అలీస్క స్నేహం చేయాలనే ప్రయత్నిస్తుంది.  ద్రునినా తో షికార్లు చేస్తుంది. హాయిగా గడిపేస్తుంది.


ఇంతలో, ద్రునినా కుటుంబం పని మీద వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తుంది.ఇంతకుముందు జరిగిన అనుభవాల దృష్ట్యా అలీస్కను తీసికెళ్ళే విషయమై  ఆలోచనలో పడుతుంది ద్రునినా! చివరికి ఆ ఇల్లుగల ముసలావిడ పాషా మామ్మ సంరక్షణలో అలీస్కను వదిలి  ప్రయాణమవుతారు.బోలెడు జాగ్రత్తలు చెపుతారు కూడా!  

మూడువారాల తర్వాత తిరిగి వచ్చి చూస్తే అలీస్క ఉండే చిన్న గది ఖాళీ!

"పారిపోయింది జిత్తులమారి నక్క! అబ్బ, ఎంత యాతన పడ్డారు  దానితో? అదేమిటీ ఏడుస్తున్నారూ పీడా విరగడైందని సంతోషించక" ఈ ధోరణిలో పాషా మాటలు! 

ద్రునినా నిర్ఘాంత పడి, బాధపడి,దుఃఖ పడి, ఏమీ చేయలేక తిరిగి వెళ్ళిపోతుంది. తర్వాతి వసంత కాలంలో మళ్ళీ పల్లెటూరికి వెళ్ళినపుడు అలీస్క తిరిగి వస్తుందేమో అని ఆశతో చూస్తారు గానీ అలీస్క ఇంకెప్పటికీ తిరిగి రాదు.     

పుస్తకం పూర్తయ్యాక అలీస్క ఎక్కడికిపోయిందా అని చాలా సేపు ఆలోచించబుద్ధేస్తుంది. 

ద్రునినా ఆ గుంటనక్క పిల్ల మీద ఎంత ప్రేమ పెంచుకుందో వర్ణించే వాక్యాలు పుస్తకం నిండా  ఎక్కడబడితే అక్కడ కనపడతాయి. 

తన కూతురు అల్యోనా ని అలీస్క దగ్గరికి కూడా  రానివ్వకపోవడం చూసి "ఏమో, అల్యోనా వల్ల దానికేమి కష్టం కలిగిందో!అది పచ్చికబయళ్ళలో తిరుగుతున్నపుడు "ఇలాగే ఉండే ఏ పిల్ల అయినా దానిపట్ల కౄరంగా ప్రవర్తించిందేమో"అనుకుంటుంది.

రోగులకు సేవ చేసి అలసి సొలసి ఇల్లు చేరినపుడు, అడుగుల చప్పుడు వినడంతోనే 


ఎగిరి తన వొళ్ళోకి దూకి ప్రేమతో చికాకుపెట్టినపుడు ఆమెలో సంతోషం ఉరకలు వేస్తుంది. 

గర్వం, స్వాతిశయం, తన మీద తనకు అదుపు, స్వతంత్ర భావన ..ఇవన్నీ అలీస్కలో ద్రునినాకు కనపడతాయి.  

అలీస్క కనపడకుండా పోయాక,ఒక తెల్లవారుజామున మంచులో  కనపడిన నక్క అడుగుజాడలు చూసి అలీస్క అడుగులేమో  అనుకోడానికి కూడా ఆమె మనసు ఒప్పుకోదు.

 "అది వేరే జంతువే అయి ఉండాలి.అంతే కావాలి. అంతులేని వొంటరితనంతో చుట్టుపక్కలనే తచ్చాడుతూ ఉండే జంతువుని గురించి ఊహించుకుంటే భయంకరంగా ఉంటుంది. నాకు తప్ప ఎవళ్ళకీ అక్కర్లేని జంతువు. నేను స్నేహం చేసుకోవడం వల్ల,నా బాధ్యత కిందికి వచ్చి,నేను  కాపాడలేకపోయిన జంతువు ఒంటరిగా ఉండిపోయిందనే ఊహే భయంకరంగా ఉంటుంది.అలీస్క..ఎక్కడినుంచి వచ్చిందో తెలీదు. ఎక్కడికి పోయిందో తెలీదు.మార్చి నెలలో ఆ మంచులో పడిన అడుగు జాడలెవరివో నాకెప్పటికీ తెలీదు" అని తనను తాను నమ్మించుకోడానికి ప్రయత్నిస్తుంది.  

ఈ పుస్తకం విశాలాంధ్రలో దొరుకుతుందనుకుంటాను ఇప్పటికీ!


Gogol "Over coat" book release - 4 Nov 2018

నికొలాయ్ గొగోల్ - ఓవర్ కోట్ : అకాకి అకాకియెవిచ్ నూట డెబ్బైయారు సంవత్సరాలక్రితం గొగోల్ కలం నుంచి పుట్టాడు. జార్ చక్రవర్తుల భూస్వామ్య వ్యవస్థ...