Thursday 14 May 2015

మన తర్వాత...ఆస్తులు సరే,...మరి వీటి సంగతేంటి? by Sujatha [Blogger]

Courtesy: http://manishi-manasulomaata.blogspot.in/search/label/%E0%B0%AA%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81%2F%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82

[This Blog is for invited readers only], Thanks to Sujatha garu.



ఎంతో కొంత ఆస్తులూ పాస్తులూ సంపాదించిన వాళ్ళందరికీ వాటిని పంచుకోడానికి పిల్లలో చుట్టాలో ఉంటారు. నగలూ,డబ్బూ,స్థలాలూ పొలాలూ వీటన్నింటినీ క్లెయిం చేసుకునే వాళ్ళుంటారు. ఇంకా ఇంట్లో వస్తువులు తీసుకునే వాళ్ళుంటారు. మరి మనం పోగేసిన పుస్తకాలెవరు తీసుకుంటారు? ఎవరికి కావాలవి?

మా ఇంట్లో చిన్నప్పుడు ఎప్పటెప్పటివీ మాస పత్రికలూ(విజయ,యువ,జ్యోతి, వనిత, మహిళ మొదలైనవి)పాత నవలలూ,ఎప్పటివో డెబ్భైల్లోని వారపత్రికలూ, భారతులూ కట్టలు కట్టలు ఉండేవి.అప్పట్లో వాటి విలువ తెలీదు. తెలిసే సరికి అవి పర హస్త గతమైపోయాయి. మా అమ్మకు మరీ మొహమాటమెక్కువ!

నా సంగతే కాదు, మంచి పుస్తకాలు సేకరించి మంచి గ్రంథాలయాలు సొంతంగా ఏర్పాటు చేసుకున్నవాళ్ళంతా ఈ సంగతి ఆలోచిస్తారంటారా? "నా తర్వాత నా లైబ్రరీ సంగతేంటి, ఎవరు చూస్తారు దాన్ని? ఈ పుస్తకాలన్నీ ఎవరు భద్ర పరుస్తారు?ఏం చేస్తారు వీటిని" అని మీలో ఉన్న పుస్తక ప్రియులంతా ఆలోచిస్తుంటారా?

అప్పుడప్పుడు ఈ ఆలోచన వస్తుంటుంది నాకు. మా పాప తెలుగు చదవగలిగినా ,నా పుస్తకాలన్నింటినీ తనూ అంతే శ్రద్ధతో ప్రేమతో కాపాడుతుందని నాకేం నమ్మకం లేదు. నాలాంటి సందేహం మనలో చాలామందికి ఉండొచ్చు!




ఆ మధ్య విజయవాడ వెళ్ళినపుడు వంశీ బుక్ స్టోర్స్ (వంశీ ప్రాచీనాంధ్ర గ్రంథమాల ) జగన్మోహన రావు(నాగేశ్వర రావు)గారితో మాట్లాడుతుంటే ఈ విషయమే ప్రస్తావించారు ఆయన. "కొంతమంది శోత్రియ బ్రాహ్మణ కుటుంబాల్లో ఎంతో అద్భుతమైన ప్రాచీన సంప్రదాయ సాహిత్యం ఉంటుందమ్మా! కానీ వాటిని అన్నాళ్ళూ కాపాడిన వ్యక్తులు పోయిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళకి వాటి విలువ తెలీక ఎవరడిగితే వాళ్ళకిస్తారు. లేదా పాత పేపర్ల వాళ్ళకి కిలోల్లెక్కన అమ్మేస్తారు. లేదా "నాన్న గుర్తు" అనో "తాతయ్య జ్ఞాపకం" అనో దాన్ని చెదలు పట్టేదాకా దాచి, పొడి పొడిగా రాలిపోయాక చింతించి బయట పారేస్తారు తప్ప వాటిని అందరికీ అందుబాటులోకి తెద్దామనే ఆలోచన ఉండదు. ఆ ఆలోచన రావడానికి వాటి విలువ వాళ్ళకు తెలీదు" అన్నారు.


అలాంటి విలువైన పుస్తకాలెన్నో "స్క్రాప్" కింద రాజమండ్రి పేపర్ ఫాక్టరీకి తరలి పోతున్నాయని బాధపడ్డారు ఆయన. అందుకే పాత పేపర్లు కొనే హోల్ సేల్ వ్యాపారుల వద్దకు ఆయన తన కుర్రాళ్ళని పంపిస్తూ ఉంటారట...వాటిలో కల్సి విలువైన పుస్తకాలేమైనా తుక్కు కింద కలిసిపోతున్నాయేమో అని! ఈయన్ని చూసినపుడల్లా ఆశ్చర్యానికి గురైపోతుంటాను నేను,.

ఒక పాత పుస్తకాల వ్యాపారి దృక్పథం కంటే ఒక కళా ఖండాల సేకరణ కర్త ధోరణి కనిపిస్తుంది. ఎంతో మంది రచయితలతో పరిచయాలు. ఎన్నెన్నో పుస్తకాల గురించి అపారమైన అవగాహన, అభిరుచి! కేవలం పుస్తకాలు అమ్మడం, వాటి వివరాలు దగ్గర పెట్టుకోవడమే కాదు,శ్రద్ధగా చదువుతారు కూడానూ! మొన్నొకసారి నేనొక పుస్తకం అడిగితే "ఉందమ్మా నా దగ్గర, నేను చదువుతున్నాను,. వచ్చేవారం రండి" అని చెప్పారు.


అక్కడే ఉన్న మరి కొన్ని షాపుల వాళ్ళు కేవలం తమ దగ్గర ఉన్న పుస్తకాలు అమ్మడం తప్ప, ఆ పుస్తకం తాలూకు గత చరిత్ర,రచయిత తాలూకు వర్తమానం ఇవేవీ తెలుసుకోవాలనుకోరు. నిజానికి ఆ అవసరం వాళ్ళకి లేదు కూడానూ!

అలాగే వచ్చిన పుస్తకాలు వచ్చినట్లు కట్టలు కట్టలుగా పడేసి ఉంచడమే తప్ప,వాటిని బైండ్ చేసి, చక్కని ఫ్లోరసెంట్ ఆకుపచ్చ కాగితం అంటించి,దాని మీద పుస్తకం పేరు,రచయిత వివరాలు రాసి ఉంచడం, సబ్జెక్టుల వారీగా సర్ది ఉంచడం ఇవన్నీ జగన్మోహనరావుగారు చేసినట్లు ఇంకే షాపు వాళ్ళూ చేయడం గమనించలేదు. ఏ పుస్తకం ఎన్ని ఎడిషన్లు పడిందీ,ఏ ఎడిషన్లలో ఎక్కువ తప్పులున్నాయి,ఇలాంటి వివరాలు కూడా అలవోగ్గా చెప్పేస్తుంటారాయన!

చాలా మంది రచయితలు రాసేయడమే తప్ప వాటిని భద్రపరుచుకోరు. (కొ.కు,దాసరి సుబ్రహ్మణ్యం,ఆరుద్ర ఇంకా అనేక మంది రచయితలు ఈ కోవలోకి వస్తారు)రచయితల వద్ద కూడా లేని వారి వారి పుస్తకాల జాడ జగన్మోహనరావు గారి దగ్గర ఉంటుంది. రచయితలే ఫోన్ చేసి "నా ఫలానా పుస్తకం మీ దగ్గరుందా" అని అడగడం నాకు తెలుసు.


తన దగ్గరకు పుస్తకాల కోసం వచ్చేవారిని చూసి వారి అనుభవాలేమిటో గ్రంథస్థం చేయాలనీ కోరికతో "గ్రంథ సేకరణ" చేసేవారి అనుభవాలను రికార్డ్ చేయడానికి ఒక పెద్ద పుస్తకం తయారు చేశారు. అందులో ఆయన దగ్గరికొచ్చేవారు తాము ఫలానా పుస్తకం కోసం ఎంత శ్రమపడిందీ,గ్రంథ సేకరణలో వారి అనుభవాలేమిటీ ఇలాంటి ఆసక్తికర విషయాలు రాస్తుంటారు.

ఇటీవల జగన్మోహనరావుగారికి మరొక ఆలోచన వచ్చింది.పుస్తక ప్రేమికులు వందల సంఖ్యలో పోగేసిన పుస్తకాల భవిష్యత్తు ఏమిటి? వీరి తర్వాత ఆ పుస్తకాలనెలా కాపాడాలి? అందుకే తన వద్దకొచ్చే వారి నుంచి మరికొన్ని వివరాలు సేకరించడం మొదలుపెట్టారు.ఇప్పటివరకూ వారి వద్ద ఎన్ని పుస్తకాలున్నాయి?ఏ యే పుస్తకాలు ఇంకా సేకరించాల్సి ఉంది? ఇంకా మొత్తం ఎన్ని పుస్తకాలు కొనే ఆలోచన ఉంది? మీ తర్వాత ఆ పుస్తకాలను ఏదైనా గ్రంథాలయానికి ఇచ్చే ఆలోచన ఉందా?

అరుదైన పుస్తక సంపద కొందరి వద్దనే కేంద్రీకృతమైపోగూడదనీ, అది పుస్తక ప్రేమికులందరికీ అందుబాటులో ఉంచాలని ఆయన ఆకాంక్ష! అందుకే కథా నిలయం లాగా, ఒక పెద్ద గ్రంథాలయాన్ని స్థాపించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు!

ఇంతటి శ్రద్ధ ఉండబట్టే కాబోలు గ్రంథాలయ ఉద్యమ సారథి వెలగా వెంకటప్పయ్య గారి అవార్డ్ ఆయనకు ఇటీవల ఇచ్చారు.

ఇలాంటి గ్రంథాలయం స్థాపించే ఆలోచన ఎవరికైనా ఉంటే నా వీలునామాలో ఆస్థీ పాస్తీ,కొంపా గోడూ,పొలమూ పుట్రా,నగలూ గిగలూ ఎవరికి రాసినా పుస్తకాలు మాత్రం వాళ్ళకే రాస్తా! పుస్తకాలు అందరికీ అందుబాటులో ఉండాలి! వాటికి మరణం ఉండకూడదు. మరణించే పరిస్థితిలో ఉంటే,తిరిగి ముద్రించే అవకాశం లేకపోయినా వాటిని డిజిటలైజ్ చేసి అందరికీ అందించాలి.

మహా రచయితలు,కవుల పిల్లలకు ఎంతో కొంత సాహితీ సువాసనలు అబ్బి ఉంటాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ తండ్రుల గ్రంథాలయాలను కొంత వరకూ కాపాడతారనుకుందాం! మరి వాళ్ళ పిల్లలు?
ఆ పిల్లల పిల్లలు?
ఆ తర్వాత తరం?
చెప్పలేం? ఏం చేస్తారో ఆ పుస్తకాలని!

అందుకే ఇంటి గ్రంథాలయాల వారసత్వాన్ని కాపాడి,అరుదైన పుస్తకాలను భద్రపరిచి ముందు తరాలకు అందుబాటులో ఉంచాలంటే జగన్మోహనరావు గారి మెదడులో మొలిచిన ఆలోచనకు ప్రాణం పోయాలి.అటువంటి లైబ్రరీ ఒకటి ఉండాలి.

ఇంతకీ మీ మీ లైబ్రరీల గురించి మీరేం ఆలోచిస్తున్నారు?

సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్

 సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్   ప్రగతి ప్రచురణాలయం, మాస్కో, యూ.యస్.యస్.ఆర్, తెలుగు విభాగపు మాజీ అధిపతి ***...