Thursday 24 August 2023

సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్

 సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు

- స్వేత్లానా ద్జేంత్

  ప్రగతి ప్రచురణాలయం, మాస్కో, యూ.యస్.యస్.ఆర్, తెలుగు విభాగపు మాజీ అధిపతి

***

ప్రగతి ప్రచురణాలయంలో (పూర్వం విదేశీ భాషా ప్రచురణాలయం) తెలుగు విభాగం 1956 డిసెంబర్లో ప్రారంభం అయింది. అప్పటికే నేను ప్రచురణాలయపు ఇంగ్లిష్ విభాగంలో పని చేస్తున్నాను. 1953 నుంచి హిందీ, ఉర్దూ, బెంగాలీ భాషల్లో పుస్తకాల ప్రచురణ మొదలైంది. తెలుగు గాని, తమిళం గాని నేర్చుకొమ్మని నన్నడిగినప్పుడు "ఆ భాష మాతృభాష అయినవారు ఇక్కడ ఎవరున్నారు" అని నేనడిగాను. నా ఎంపికకి కారణం ఇది.

డిసెంబర్ 1956లో మేం ముగ్గురం కొలచల సీతారామయ్య గారి స్నేహం చేసుకున్నాం. ఆయన రసాయన శాస్త్రంలో పేరున్న శాస్త్రవేత్త. అమెరికాలో పి.హెచ్.డి. చేసిన తర్వాత సోషలిజం నిర్మించడంలో పాల్గొనేందుకు ఆయన 1923లో సోవియట్ యూనియన్ కి వచ్చారు. 40 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చినప్పుడు మాతృభూమి ఆయనకి సాదరంగా స్వాగతం చెప్పింది. ఆయన మాకు ఆదివారాల్లో రెండు, మూడు గంటలు తెలుగు బోధించేవారు. మిగతా సమయంలో మేం స్వయంగా నేర్చుకొనేవాళ్లం. 20వ శతాబ్దం ప్రారంభంలో ప్రచురణ అయిన ఆర్డ్న్ 'తెలుగు వ్యాకరణం', శంకరనారాయణ 'తెలుగు ఇంగ్లిష్ నిఘంటువు' మా లైబ్రరీలో ఉండేవి. అప్పట్లో మాకు ఏ ఇతర తెలుగు పుస్తకాలు అందుబాటులో లేవు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ గురించి తెలియదు. ఒక్క నవల మాత్రం మాకు అందుబాటులో ఉండేది. దానిని ఉపయోగించుకున్నాం.

.

గిడుతూరి సూర్యం, జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి (విజయవాడలో అధ్యాపకుడు) 1957 డిసెంబర్(చాలా ఎక్కువ చలి ఉండే నెల)లో వచ్చారు. గిడుతూరి సూర్యం కవిత్వం బాగా అనువాదం చేయగలరు. సుతయేవ్ రచించిన "ఎవరు మ్యాన్ అన్నారు?" మేం ప్రచురించిన మొదటి తెలుగు పుస్తకం. తర్వాత, మరికొన్ని పిల్లలు పుస్తకాలని ప్రచురించాం. నాకు తెలిసినంతలో అవి ఆంధ్రప్రదేశ్ లో ఆదరణ పొందాయి. ఇద్దరు అనువాదకులకీ కూడా సాహిత్యం, రాజకీయాలు అలవాటు లేని కొత్త విషయాలు. రెండేళ్లలో ఇద్దరూ తిరిగి వెళ్లిపోయారు. 1958లో మా అనువాదకునిగా పని చేయడానికి వుప్పల లక్ష్మణరావు గారిని సీతారామయ్య గారు ఆహ్వానించారు. అప్పట్లో లక్ష్మణరావు జర్మనీలో ఉన్నారు. ఆయన దాదాపు 12 ఏళ్లు మాతో ఎంతో పని చేశారు. ఆయన మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ల రచనలే కాక ఎన్నో నవలల్నీ కథల్నీ అనువదించారు. అప్పట్లో మా తెలుగు పాఠకుల అభిరుచుల గురించి మాకు ఏమీ తెలియదు. ఈ కారణం వల్ల బహుశా కొన్ని ప్రచురణలు వారికి రుచించి ఉండకపోవచ్చును. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ తో మాకు సంబంధాలు, వ్యాపార భాగస్వామ్యం 1969ల నుంచి ఏర్పడినాయి. వుప్పల లక్ష్మణరావు మాతో 1970 వరకు పని చేశారు. ఈ 12 ఏళ్లలో అనువాదాలు చేయడంతో బాటు ఆయన మాకు తెలుగు నేర్చారు. తెలుగు సాహిత్యాన్ని గురించిన తన జ్ఞానాన్ని మాకు పంచి పెట్టారు. మాస్కోలో చదువుకొంటున్న తెలుగు విద్యార్థుల్ని, మాస్కో వచ్చే తెలుగు అతిధులని మాకు పరిచయం చేసేవారు. ఉగాది వంటి పండుగలు జరుపుకోవడానికి మమ్మల్ని పిలిచేవారు. మాస్కోలో చదువుకొంటున్న తెలుగు విద్యార్థులు మాకు చాలా సహాయపడే వారు, వారిలో ముఖ్యంగా చట్టి శ్రీనివాసరావు పేరును జ్ఞాపకం చేసుకొంటున్నాను. మాస్కోలో వుప్పల లక్ష్మణరావు గారి భార్య మిల్లీ సోలింగర్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం విషాదసంఘటన ఐనా ఆయన తిరిగి వెళ్లిపోకుండా 1970 దాకా మాతో పనిచేస్తూనే ఉన్నారు. భారతదేశానికి తిరిగి చేరాక ఆయన తన సృజనాత్మక కృషి కొనసాగించి 'మా మెల్లీ','బతుకు పుస్తకం', 'గెరిల్లా' లాంటి రచనలు చేశారు. స్థానిక సాహితీ సంస్థ (మనం మనం బరంపురం) కి అధ్యక్షులుగా ఉన్నారు. నేను ఆయనతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేదాన్ని. 1976 లో భారతదేశానికి వచ్చినప్పుడు బరంపురం వెళ్లి ఆయనని చూసి వచ్చాను.

.

1969లో నేను తొలిసారి భారతదేశానికి వచ్చినప్పుడు ప్రొద్దుటూరులో రారా (రాచమల్లు రామచంద్రారెడ్డి) గారిని కలుసుకున్నాను. ఆయన రచయిత, విమర్శకుడు, 'సంవేదన' పత్రిక ప్రచురణకర్త, సంపాదకుడు. రారా మాస్కో రావడానికి అంగీకరించారు. 1970లో మాస్కోలో వారికి స్వాగతం చెప్పాము. ఆయన 1974 వరకు మా ప్రచురణాలయంలో పని చేశారు. ఆయన మాకు తెలుగు కూడా నేర్పేవారు. అప్పటికి మాకు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ నుంచి చాలా తెలుగు పుస్తకాలు రాసాగాయి. తెలుగు రచయితల కథలని మేం రష్యన్లోకి అనువదించనారంభించాము. ఈ పనిలో కూడా మాకు మా అనువాదకుల సహాయం లభించేది. మాకు విశాలాంధ్ర దినపత్రిక కూడా 1963 నుంచి రావడంతో దానిని చదవసాగాము. ఆంధ్రప్రదేశ్లో సంఘటనల గురించి తెలుసుకొనే సదవకాశం మాకు లభించింది. 

.

విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చొరవ కారణంగా కొండేపూడి లక్ష్మీనారాయణ, నిడమర్తి ఉమారాజేశ్వరరావు మా అనువాదకులుగా పని చేయడానికి 1974లో మాస్కోకి వచ్చారు. ఇద్దరూ అనుభవం ఉన్న అనువాదకులే. కొండేపూడి లక్ష్మినారాయణ రచయితా, అనువాదకులు. జీవితంలో ఎక్కువ భాగాన్ని అనువాదాలు చేయడానికి ముందు ఆయనకి సోవియట్ భూమితో సహా వివిధ పత్రికలలో పనిచేసిన అనుభవం ఉన్నది. మాస్కోలో ఆయన మార్క్స్, లెనిన్, గోర్కీ, తుర్గెనీవ్ ల రచనలని అనువదించారు. ఆ రోజుల్లో 'రష్యన్ - తెలుగు నిఘంటువు' పనిని ప్రారంభించాను. కొండేపూడి ఎంతో చురుకుగా దీని సంపాదకుడిగా కృషి చేశారు. తరచు వారి ఇంటికి వెళ్లేవాళ్లం. ఆయన భార్య రాధ మమ్మల్ని అప్యాయంగా ఆహ్వానించి తెలుగు భోజనం పెట్టేవారు. ఆయన ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమె ఆయనకి చాలా సేవ చేసేవారు. లక్ష్మీనారాయణ 1975లో తిరిగి వెళ్లిపోయారు. కాని ఈ తర్వాత చివరిక్షణం దాకా పనిచేశారు. తమిళకవి సుబ్రహ్మణ్య భారతి, బ్రెక్ట్ ల రచనలు అనువదించారు. నేను కొన్నాళ్లపాటు ఆయనకీ, రాధ గారికి ఉత్తరాలు రాసేదాన్ని.

.

నిడమర్తి ఉమారాజేశ్వరరావు ప్రగతి ప్రచుణాలయంలో 12 ఏళ్లకి పైగా పనిచేశారు. ప్రచురణాలయం మూతపడి ఉండకపోతే నిస్సందేహంగా ఆయన మరికొంత కాలం పని చేసేవారు. ఆయన సుమారు 60 పుస్తకాలు అనువదించారు. నాతో బాటు 'రష్యన్ తెలుగు నిఘంటువు' నిర్మాణంలో పాలుపంచుకొని దానికి సంపాదకుడుగా కూడా ఉన్నారు. భారతదేశానికి తిరిగి వెళ్లాక ఆయన బెంగళూరులో స్థిరపడి వివిధ పత్రికలకి వ్యాసాలు రాస్తూ వచ్చారు. 2010లో మరణించాడు. 

.

ఉమారాజేశ్వరరావు తర్వాత కొన్నాళ్లకి ఆర్వీయార్ మాస్కో వచ్చారు. ఆయన పిల్లలు పుస్తకాలని, సృజనాత్మక సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించాడు. ఆయన అనువాదాలలో అలెక్సేయెవ్ రచన 'రష్యన్ చరిత్ర, కథలూ గాథలూ' (1887) బాగా అమ్ముడైంది. ఇది అక్టోబరు విప్లవ 70వ వార్షికోత్సవమూ, భారతదేశ 40వ స్వాతంత్రోత్సవాలని పురస్కరించుకొని జరిగిన భారత సోవియట్ సాంస్కృతికోత్సవ తరుణంలో ప్రచురణ అయింది. 1980లో 'ప్రగతి ప్రచురణాలయం' రెండుగా అంటే రాదుగ, ప్రగతి ప్రచురణ సంస్థలుగా విభజన అయింది. 'ప్రగతి ప్రచురణాలయం' రాజకీయ సామాజికశాస్త్ర గ్రంథాలను ప్రచురణ కొనసాగించింది. 'రాదుగా ప్రచురణాలయం' పిల్లల పుస్తకాలు, సృజనాత్మక సాహిత్య అనువాదాల ప్రచురణ చేసింది.  ఆర్వీయార్ రాదుగకి వెళ్లారు. మా గ్రూపు కూడా విభజన అయి ముగ్గురు రాదుగలోనూ పనిచేయసాగాం. ఉమారాజేశ్వరరావు 1991లో ప్రగతి ప్రచురణాలయం మూతపడేవరకు ఉన్నారు. రాదుగ మరి రెండు మూడు సంవత్సరాలు కొనసాగింది. మాస్కోలో ఉండి మా అనువాదకులందరగా చేసిన కృషి తెలుగు పాఠకుల మధ్య స్నేహ సంబంధాలు ఏర్పడడానికి నిలబడడానికి ఎంతగానో సహాయపడింది. తెలుగువారి జీవితం, సంప్రదాయాలు, పండుగలు, ఆహారపుటలవాట్ల గురించి మాకు తెలియజేస్తూ ఎన్నో విధాల వీరు మాకు ఉపాధ్యాయులుగా ఉన్నారు.

.

నాతోటి ఉద్యోగుల గురించి..

***

1964 కి పూర్వం సోవియట్ యూనియన్ లో తెలుగు అధ్యాపన లేదు. మాస్కో సెయింట్ పీటర్స్ బర్గ్ (1991కి పూర్వం దీనిపేరు లెనిన్ గ్రాడ్)లలో హిందీ, ఉర్దూ, బెంగాలీ భాషల అధ్యాపన అధ్యయనం చాలా కాలం నుంచి ఉన్నాయి. అందువల్ల ప్రగతి ప్రచురణాలయంలో నాతోటి ఉద్యోగులు తెలుగు స్వయంగా నేర్చుకొన్నారు. హైస్కూల్ చదువు పూర్తి చేసిన వారిని మేం ఆహ్వానించాం. వాళ్లు పని చేస్తూ తెలుగు నేర్చుకొన్నారు. సాధారణంగా, తెలుగు అక్షరాలు నేర్చుకోవడానికి వారికి ఒక నెల పట్టేది. అప్పుడు పని చేయడం ఆరంభించేవారు. అప్పటికి కంప్యూటర్లు లేవు కాబట్టి అనువాదకుల రాత ప్రతులకి కాపీలు రాసేవారు. సంపాదకుల పక్కన పని చేస్తూ ఈ కాపీని ప్రెస్ కి సిద్ధం చేసేవారు. ప్రూప్ కూడా సరి చేసేవారు. ఇవి అన్నీ ఏకాగ్రత, నిర్దిష్టత అవసరమైన పనులు. పని చేయడమే కాక వీరు యూనివర్సిటీల్లో చదువుకొనేవారు. తత్వశాస్త్రం, భూగోళ శాస్త్రం, సాహిత్యం పార్ట్ టైం అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థినులు వీరు. ఏలేరియా కోజ్లెన్ కో, నతాషా మిఖ్నేవిజ్, అన్నాసపొనోమరేవాలు ఒక్కొక్కరు 20 ఏళ్లకి పైగా మాతో పాటు పనిచేశారు. 1956లో సెయింట్ పీటర్స్ బర్గ్ యూనివర్సిటీ తొలి పట్టభద్రులు మాతో పని చేయడానికి వచ్చారు. తమారా కొవలోవా, తత్యానా చుగునోవా,

గర్మన్ యురాసోవ్ లు ఆచార్య నికితా గురెవ్ గారి విద్యార్థులు. తర్వాత ఆచార్య గురెవ్ శిష్యులు మరికొందరు మాతో పనిచేయడానికి వచ్చారు. ముందు ఓల్గా బరాన్నికోవా, ఆమీదట ఓల్గా స్మిస్నోవా వచ్చి చేరారు. వీరు రాదుగ, ప్రగతి ప్రచురణాలయాలలో అవి మూతపడే వరకు పనిచేశారు.  ఆంధ్రప్రదేశ్ కి వ్యాపారయాత్ర చేసిన మా సహోద్యోగులు స్వేత్లానా ద్జేనిత్, ఓల్గా బలాన్నికోవా, నతాషా మిఖ్నేవిచ్, అన్నాపొనొమరేవా, తమారా కొల్యొవా, ఓల్గా సిస్నోవా. వీరు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు, విజయవాడ బ్రాంచిలని సందర్శించారు. అక్కడ ప్రచురణ అవుతున్న పుస్తకాలతోనూ వారి ఉద్యోగులతోనూ పరిచయం చేసుకున్నారు. ప్రగతి, రాదుగ ప్రచురణాలయాలు మూతపడిన తర్వాత నా తోటి ఉద్యోగులు తెలుగుతో సంబంధం లేని వివిధ రంగాలలో పని చేస్తున్నారు. ప్రచురణ సంస్థలలో అనుభవం వారికి కొత్త చోట్లల్లో జయప్రదంగా పని చేయడానికి సహాయపడింది. మా అనువాదకులందరూ తమ ప్రధాన బాధ్యతతో పాటు నిఘంటువుల నిర్మాణంలో కూడా చురుకుగా పాల్గొన్నారు. న్వెల్లానా ద్జెనిత్, నికితా గురోవ్, బోర్యా పెత్రోనిచేవాలు కలిసి కూర్చిన తెలుగు - రష్యన్ నిఘంటువుకి (1972లో ప్రచురణ) వుప్పల లక్ష్మణరావు సంపాదకులుగా ఉన్నారు. స్వెత్లానా కూర్చిన రష్యన్ - తెలుగు నిఘంటువుకి (1988 ప్రచురణ) ఉమారాజేశ్వరరావు సంపాదకులుగా ఉన్నారు. ఆరియార్, ఓల్గా బరాన్నికోవాలు కలిసి తెలుగు - రష్యన్, రష్యన్ - తెలుగు సంభాషణ పుస్తకాన్ని సిద్ధం చేశారు. ఇది 1988లో ప్రచురణ అయ్యింది. వారి పనిని మాకు సహాయపడడంగా అభివర్ణించడం అసమంజసంగా ఉంటుంది. వారి కృషి లేకుండా ఈ నిఘంటువులు, పుస్తకాల ప్రచురణ సాధ్యపడేదికాదు.

.

వుప్పల లక్ష్మణరావు, కొండేపూడి లక్ష్మీనారాయణ, రా.రా, ఉమారాజ్, ఇటీవల ఆర్వియార్ గార్ల మరణ వార్తల్ని విని ఎంతో విషాదాన్ని అనుభవించాను. వీరు నా జీవితంలో భాగం. వీరందర్నీ నేను జీవించినంతకాలం జ్ఞాపకం పెట్టుకుంటాను. మాస్కోలో మా అనువాదకుల జీవితం, కృషికి సంబంధించిన మరొక పార్వాన్ని కూడా నేను ఇక్కడ చెప్పడం ఉచితంగా ఉంటుంది. వారి పని ఇరు ప్రాంతాల ప్రజల మధ్య స్నేహ, సహకారాన్ని పెంపొందించడంలో ప్రత్యక్షంగా సహాయపడడమే కాదు. వారు తమ కుటుంబాలతో రష్యాకి వచ్చారు. వారి పిల్లలు ముందు ఇక్కడ స్కూల్ విద్యార్థులు. తర్వాత మాస్కో విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. అక్కడ తెలివైన వృత్తి నిపుణులుగా ఎదిగారు. ఉదాహరణకి ఉమారాజేశ్వరరావు గారి అబ్బాయి మల్లికార్జునరావు రసాయన శాస్త్రంలో పి.హెచ్.డి పొందారు. రారా గారి కొడుకు మధు వైద్యశాస్త్ర పట్టభద్రుడు. ఆర్వీయార్ కొడుకు రాహుల్ వ్యవసాయ శాస్త్ర నిపుణుడయ్యాడు. వారి రష్యన్ భాషా పరిజ్ఞానం తమ రంగాలలో పని చేయడానికి ఉపయోగపడడమే కాక రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారాన్ని నిల్పడానికి కూడా ఉపయోగపడుతున్నది. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ సంపాదకులు తుమ్మల వెంకట్రామయ్య గారితో, మేనేజర్ మాన్యం గారితో సమావేశాలను ఆత్మీయంగా తలుచుకొంటాను. దురదృష్టవశాత్తూ వీరిరువురు కాలం చేశారు. 1976లో నేను ఆంధ్రప్రదేశ్ కి వెళ్లినప్పుడు ఆ ప్రాంతంతోనూ, సాహిత్యంతోనూ నా పరిచయం పెంచుకోడానికి పి.పి.సి.జోషి ఎంతగానో సాయం చేశారు. అప్పుడు మేం విశాఖపట్నం బ్రాంచి ప్రారంభానికి హాజరయ్యాం. ఇప్పటికి ఇంకా ఎక్కువ బ్రాంచిలుండి ఉంటాయని విశ్వసిస్తున్నాను. 60వ వార్షికోత్సవ సందర్భంగా విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, దానితో సంబంధమున్న వారందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను

.

 తాజాకలం - 2012

అన్నాపొనోమరేవా రాసిన విషయాలు

లండన్ ఇంపీరియల్ కాలేజీలో రష్యన్ అనువాదంలో లెక్చరర్, మాస్కో - లండన్

**

ప్రగతి ప్రచురణాలయంలో 1979లో చేరిన పిన్న వయస్సు వ్యక్తిగా నా సీనియర్ రాసిన కథనానికి కొన్ని వివరాలు జోడించదలచాను. ప్రగతి, రాదుగ ప్రచురణాలయాల తెలుగు విభాగాలలో పని చేసిన ఎవరమూ అనుభవాలనూ, భారతీయ సహోద్యోగుల స్నేహాన్నీ మరచిపోలేం. ఇప్పటికీ పరస్పర సంబంధాలను నిలుపుకుంటున్నాము. ఉదాహరణకి 2010 ఫిబ్రవరిలో హైదరాబాదుకి ఒక కాన్ఫరెన్స్ కు వెళ్లిన సందర్భంగా ఆర్వీయార్ గారింట్లో అతిధిగా ఉండి, ఉమారాజేశ్వరరావు గారితో ఫోన్లో మాట్లాడి ఎంతో ఆనందాన్ని అనుభవించాను. వర్తమాన కాలంలో కూడా రష్యన్ సాహిత్యం పట్ల ఎంతో ఆసక్తి ఉన్నట్లు ఈ ఇద్దరు అనువాదకులూ చెప్పారు. నేనూ నా సహచరులూ పాత్రధారులైన గొప్ప సాంస్కృతిక ప్రయోగం - మరొక సారి అనతి కాలంలో జరుగుతుందని ఆశిద్దాం. అనువాదంలోనూ, భిన్న సంస్కృతుల సంయోగంలోనూ నాకిది గొప్ప అప్రెంటిస్ షిప్ గా భావిస్తాను. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ 60వ వార్షికోత్సవం జయప్రదం కావాలని ఆకాంక్షిస్తున్నాను.

***

THANKS TO N. VENUGOPAL garu for providing this valuable document on Soviet Telugu translation history.










 


నన్ను రచయితగా మార్చిన సోవియట్ రాదుగా ప్రచురణలు - దేవులపల్లి కృష్ణమూర్తి

 ఈ క్రింది జ్ఞాపకంను దేవులపల్లి కృష్ణమూర్తి గారు నాకు నకిరెకెల్ లో వారి ఇంటికి వెళ్లినప్పుడు చెప్పారు. ఈ జ్ఞాపకం తప్పకుండా రాయండి సార్, అని పదేపదే గుర్తుచేసి రాయించాను. తరువాత దీన్ని నమస్తే తెలంగాణాకు పంపాను. వాళ్ళు10 మే 2015  ఆదివారం పుస్తకంలో ముద్రించారు. 

ఈ గొప్ప వ్యాసం రాసిన దేవులపల్లి కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు.

- అనిల్ బత్తుల

^^^


నన్ను రచయితగా మార్చిన సోవియట్ రాదుగా ప్రచురణలు

- దేవులపల్లి కృష్ణమూర్తి

***

నా పన్నెండవ ఏట సూర్యాపేటలో ఏడవ తరగతిలో జాయిన్ అయిన. మిడిల్ స్కూలుకు పోవాలంటే గాంధీపార్క్ ముందునుండే పోవాల్సి వుండేది. గాంధీపార్కు ముందు వున్న పెద్ద పెద్ద వేపచెట్ల క్రింద జనగామ, హైద్రాబాదుకు పోయే గవర్నమెంటు బస్సులు, అట్లే జగ్గయ్యపేట, మిర్యాలగూడకు పోయే బొగ్గు బస్సులు నిలబడి వుండేయి. ఆ చెట్లనీడనే ప్రయాణికులు నిలబడి ఉండేది. అక్కడే యన్.జి.రెడ్డి అనే అతను బస్త చింపులు పరచి యక్షగానాలు, బుర్రకథలు, సినిమా పాటలు, పంచాంగాలు, పెద్దబాలశిక్ష, సోవియట్ ల్యాండ్ తో పాటు కమ్యూనిస్టు పుస్తకాలు కూర్చొని అమ్ముతుండేవాడు. వచ్చిపోయే ప్రయాణికులు వాటిని తిరగేస్తూ నచ్చితే కొనుక్కుంటూ వుండేది. నేను వస్తూపోతూ కొద్దిసేపు నిలబడి ఆ పుస్తకాలను చూస్తూ ఉండేది.

.

నా ఏడవ తరగతి అయిపోయినది. హైస్కూలుకు పోవడానికి కూడా అదే దారి. ఆణాలు పోయి నయాపైసలు వచ్చినయి. మేము ఇల్లు మారి బొడ్డురాయి బజారుకొచ్చినం. మా ఇంటి ముందు పబ్లిక్ లైబ్రరీ వుండేది. రోజూ సాయంత్రం ఏడు గంటలకు వాచ్ మెన్ చంద్రయ్య లైబ్రరి ముందు వరండాలో చాపలు పరిచి ఆరోజు దినపత్రికలు, వారపత్రికలు, చందమామ, బాల, బాలమిత్ర, నవ్వులు పువ్వులు, కినిమా మొదలైన పత్రికలు పెట్టేశాడు. సాయంత్రం బడినుండి రాగానే వాటిని తిరగేయటం నాకెంతో ఇష్టం. ముఖ్యంగా బాల, చందమామ, బాలమిత్ర మరియు కినిమా పత్రికలు ఇష్టంగా చదువుతుంటి. నా ఈడు పిల్లలు వీటిని చదవడానికి పోటిపడుతుండేది. స్కూలు పుస్తకాలే కాక ఇతర పుస్తకాలు చదవటం అలా మొదలైంది.

.

నేను టెంత్ వచ్చేవరకు బొగ్గు బస్సులు తగ్గి సర్కారి బస్సులు వచ్చినయి. యన్.జి.రెడ్డి పుస్తకాల షాపు అట్లనే చెట్లకింద నడుస్తుంది. కొత్త కొత్త పుస్తకాలు వచ్చి చేరినయి. పిల్లల బొమ్మల పుస్తకాలు వాటిపై రంగు రంగు బొమ్మలతో ముద్దులొలుకుతూ వుండేయి, వాటి ధర ఎక్కవలో ఎక్కువగా ఇరవై పైసలు, పావలా ఉండేది. వాటిని ముట్టుకోబోతే "నువు కొనేదా పెట్టేదా వాటిని ముట్టుకోకు" అని కసిరించేవాడు. దానితో వాటిని రోజూ చూస్తూ వుండిపోయేవాణ్ణి. రెడ్డిగారు అలా కసిరి కొట్టడంలో పెద్దగా విచారించేది ఏమి లేదు. అప్పట్లో నా వేషం ముతక నెక్కరు, మాసిపోయివున్న ఆప్ షర్ట్, చెప్పులు మొఖం కానని కాళ్ళు. నాలో పెట్టుదల పెర్గింది. ఎట్టన్నజేసి ఓ పుస్తకం కొనాలని పడ్డది. ఒకనాడు బయట పరిచిన పుస్తకాలలో "అందమైన చిన్న పుస్తకం కన్పించింది. దాని పేరు 'కుక్కను వెంటబెట్టుకున్న మహిళ'. దాని ధర ఎంతంటే ఇరవై పైసలన్నడు.  వెంటనే జేబులోవున్న పావలా బిళ్ళ ఇస్తే ఆ పుస్తకం, ఐదు పైసలిచ్చిండు. ఆ పుస్తకం నేను కొంటాననుకోలేదు రెడ్డిగారు. దాన్ని రెండురోజులపాటు చదివిన ఎక్కలేదు. రెడ్డికి నా సత్తా ఏందో చూపాలని కొన్నాగాని దాన్ని చదివి అర్ధంచేసుకోగలనా లేనా అన్నది ఆలోచించలేదు. నా మిత్రుడు మండల్ రెడ్డి కృష్ణారెడ్డికి ఇస్తే బాగానేవుందిగదరా అన్నడు. వాడు 'మకరశ్రీ' అనే పేరుతో ఏవో కథలు రాస్తూండేవాడు. పోనియ్యిలే అని దాన్ని భద్రపరచుకొన్న. తర్వాత కొన్నాల్లకు 'జమీల్యా' అనే పుస్తకం కనిపించింది. దాని ధర పావలా, కావాలా అన్నడు. ఇవ్వండి అంటూ పావలా చేతిలో పెట్టిన. బ్లూకలర్లో ఉండి ఎంతో అందంగా వుందా పుస్తకం. దాన్ని చదవటం మొదలు పెట్టిన. వదలబుద్ది కాలేదు. అలా సోవియట్ పుస్తకాలతో నా అనుబంధం మొదలైంది. ఇంతలోనే పరీక్షలు మొదలైనయి. నేరుగా బడికి పోవటం ఇంటికొచ్చి చదువుకోవటంతోనే గడిచిపోయింది. హెచ్చెసి పాసయిన తర్వాత, ఏడాదిపాటు ఉద్యోగాన్వేషణలో గడిచిపోయింది. చివరకు తహశీలు ఆఫీసులో యల్.డి.సి గా జాయిన్ అయిన.

.

ఇప్పుడు యన్.జి.రెడ్డి తన బుక్ షాపును పోస్టాఫీసు వెనుక PWD ఆఫీసు కాంపౌండు నానుకొని వున్న చింత చెట్లక్రింద డబ్బాకొట్టుకు మార్చి, దానికి 'స్టార్ బుక్ హౌస్' అని పేరు పెట్టిండు. అతనికి సంతానం లేదు. భార్యాభర్తలు ఆ దుకాణంలోనే సాయంత్రందాక వుంటుండేది. షాపును పెద్దదిగా చేసిండు. సోవియట్ బుక్సు విజయవాడ విశాలాంధ్ర బుక్ హౌస్ నుండి తెప్పించేవాడు. నేను తీరికవున్నప్పుడల్లా సాయంత్రంపూట ఆ షాపుకు పోయి కూర్చుండేవాణ్ణి. తాసీలు ఆఫీసులో ఉద్యోగినని నన్ను గౌరవిస్తూ బెంచిపై కూర్చోబెట్టి "ఈపుస్తకం చూడండి సార్, కొత్తగా వచ్చింది.." అంటూ చూపించేవాడు. అలా పోయినపుడల్లా నాకో కొత్త నవలను కథల పుస్తకాన్ని పరిచయం చేస్తుండేది. అలా నేను రాళ్ళవంకీ, నలభై ఒకటవ వాడు, అన్నా కెరినినా, మనకాలం వీరుడు వంటి పుస్తకాలు ఆ షాపులో కొన్నాను. అవి చదివి ఎంతో ఆనందించేది. మృష్టాన్నభోజనం చేసినట్టుగా వుండేది.

.

మా ఆఫీసు మిత్రులు నేను ఈ పుస్తకాలు చదువుతుంటే "నువ్వు కమ్యూనిష్టునా..?" అని అంటుండిరి. "ఈ పనికిమాలిన పుస్తకాలు చదివితే ఏమొస్తది బై" అంటూ గేలి చేస్తుండిరి. వాల్ల మాటలు పట్టించుకోక నా మానాన నేనుంటుండేది. అలా సోవియట్ 'రాదుగ' ప్రచురణలతో నా అనుబంధం పెరిగిపోయింది. ఎప్పుడన్నా హైదరాబాదుకు పోతే సుల్తాన్ బజారులో వున్న విశాలాంధ్ర బుక్ హౌస్ కు పోయి సోవియట్ రాదుగ ప్రచురణల గూర్చి అడిగితే ఆ నెలలో వచ్చిన కొత్త పుస్తకాలను ముందరేసేవాల్లు. అలా నేను పసివాడి పగ, పెద్ద ప్రపంచంలో చిన్న పిల్లాడు, నొప్పి డాక్టరు, మిత్రుని హృదయం, ఉక్రేనియన్ జానపద గాధలు మొదలైన పుస్తకాలు కొనియుంటి.

.

ఇందులో కొన్ని పుస్తకాలు మిత్రులకు చదువమని ఇచ్చియుంటి. తీసుకున్నవాళ్ళు ఏండ్లు గతించినా తిరిగి ఇవ్వలేదు. అడిగి అడిగి విసిగిపోయిన. ఇక ఎవ్వరికి పుస్తకాలు ఇవ్వగూడదని నిర్ణయించుకున్న. కాని అప్పటికే చాలా పుస్తకాలు పోయినయి. కొన్ని పుస్తకాలను రెండు రెండు కాపీలు కొనడం జరిగింది. ఈ విషయం రాదుగ ప్రచురణలన్ని ఒక్క షెల్ఫు లో పెట్టాలన్ని యేర్పాటు చేసినపుడు తెలిసింది. విజయవాడ పోయినపుడు, అనంతపురం పోయినపుడు అక్కడి విశాలాంధ్ర బుక్ హౌస్ కు పోయి కొనియుంటి. కొన్న వాటిని వెంటనే చదువక రిటైర్ అయిన పిదప చదువాలని భద్రపరిచిన. నేను 1998లో రిటైర్ ఆయువుంది. 2005 వరకు అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని నావద్ద వున్న రాదుగ, ప్రగతి ప్రచురణల పుస్తకాలన్ని చదివిన. అందులో రెండవ ప్రపంచయుద్ధకాలంలో రాసినవి నాకెంతో నచ్చినయి.

.

ఆనువదించిన వాల్లలో వుప్పల లక్ష్మణరావు గారి అనువాదాలు ఎంతో హాయిగా చదివించాయి. జమీల్యా, తల్లి భూదేవి, తొలి ఉపాధ్యాయుడు మొదలైనవి. తదుపరి ఆర్వీఆర్ అనువాదాలు. అనువాదకులు తమ అభిప్రాయాలు వ్రాయటం రాదుగ ప్రచురణలలో అలవాటు లేదు. అయినా 'మనకాలం వీరుడు' నవలకు ఆర్వీఆర్ ముందుమాట వ్రాసిండు. రాచమల్లు రామచంద్రారెడ్డి ట్రాన్సులేషన్సు అంతగా కొరుకుడు పడేవి కావు. కొండేపూడి లక్ష్మీనారాయణ, గిడుతూరి సూర్యం, నిడమర్తి ఉ మారాజేశ్వరరావు గారు కొన్నిటిని అనువదించి యుండిరి.

.

మా మిత్రుడు రచయిత బోయ జంగయ్య రామన్నపేటలో యస్.టి.వో ఆఫీసులో పనిచేస్తూవుండె. ఒకసారి మాటల సందర్భంలో 'ఆర్వీఆర్' అనే సోవియట్ యూనియన్ పుస్తకాలను అనువాదం చేసిండు చూడు మాకాడనే జూనియర్ కాలేజిలో ప్రిన్సిపాలుగా పనిచేస్తుండని చెప్పిండు. దానితో వారిని కలుసుకోవాలని రామన్నపేటకు పోయివుంటి. వారు ట్రాన్సులేషను చేసిన పుస్తకాల వివరాలను చెబితే మిక్కిలి ఆనందించాడు. తాము పదేండ్లకు పైచిలుకు సోవియట్ యూనియన్లో వున్నట్లు చెప్పిండు. సోవియట్ రాదుగ ప్రచురణలు ఆగిపోవడంతో తిరిగి ఇండియాకు వచ్చినట్లు చెప్తూ రాగానే అప్పటి ముఖ్యమంత్రి  NTR గారిని కలిసి తన పరిస్థితి వివరిస్తే తన సెలవు పిరియడును రెగ్యులర్ చేసి ఇంకా ఒక సంవత్సరం మిగిలి వున్నందున ఇక్కడ జూనియర్ కాలేజిలో ప్రిన్సిపల్గా పోస్టింగు ఇచ్చినట్లు చెప్పిండు. సోవియట్ యూనియన్లో తన అనుభవాలను పుస్తకంగా తేబోతున్నానని చెప్పిండు.

.

రిటైరు అయిపోయిన తరువాత ఎటూ పొద్దుపోక నావద్ద వున్న సోవియట్ రాదుగ పుస్తకాలను మరల చదువుతూపోయిన. చదివినప్పుడల్లా నాకు కొత్త అందాలు కన్పించేయి. వ్రాసినవాళ్లలో చాలామంది తమ అనుభవాలనే నవలలుగా చిత్రీకరించారు. అట్లే నేవెందుకు నా అనుభవాలను వ్రాతలో పెట్టకూడదని భావించి వ్రాయటం మొదలు పెట్టిన.

ఎంత వ్రాసినా 10, 20 పేజీలకు మించటంలేదు. మరల ఓమారు రాదుగ ప్రచురణలను తిరగేస్తుంటే బాట దొరికింది. అలా నా మొదటి పుస్తకం "ఊరు వాడ బతుకు" వెలువడింది. ఇది నా డెబ్బైఏట వ్రాసియుంటి. అటు తర్వాత 'మా యాత్ర', 'కథలగూడు', 'బయటిగుడిసెలు' మరియు 'తారుమారు' వెలువడినయి. వీటన్నిటికి ప్రేరణ సోవియట్ రాదుగ ప్రచురించిన నవలలు, కథాసంపుటాలు మాత్రమే.

***




మంచంపైన దేవులపల్లి కృష్ణమూర్తి గారు, నేల మీద అనిల్ బత్తుల(నేను)



బాపు గారు గీసిన దేవులపల్లి కృష్ణమూరి గారి చిత్రం



దేవులపల్లి కృష్ణమూరి గారి సంతకం & ' స్టార్ బుక్ హౌస్ ' స్టాంప్




Tuesday 17 August 2021

Anil battula - The Journey with books

 నా పుస్తకాల ప్రయాణం గురించి ఇంగ్లీష్ వార్తా పత్రిక ' ద పయనీర్ ' లో...ఇంటర్వూ చేసి అందమైన ఆర్టికల్ రాసిన యామినీకృష్ణ బండ్లమూడికి, ఆర్టికిల్ లో నా గురించి మాట్లాడిన కవయిత్రి స్వాతికుమారికి, కథా రచయిత సుధాకర్ ఉణుదుర్తి గారికి.. ప్రచురించిన ద పయనీర్ పత్రిక టీంకి హృదయపూర్వక ధన్యవాదాలు.

- అనిల్ బత్తుల
Anil battula - The Journey with books
--------------------------------------
Article by Yamini krishana Bandlamudi
Published in ' The Pioneer ' english daily paper, 14 aug 2021.
A reader lives a thousand lives before he dies, said George Martin. Only passionate readers realise that. A voracious reader and a passionate translator Anil Battula, 40, from Hyderabad had the obvious experience of this as he had translated and published on his own different Russian children story books, tried retellings and an edition on the ‘World’s best movie stories’. Speaking to 'The Pioneer’, Anil shares his journey with books till date.
"I hail from Nizamabad, my family migrated to Nellore, that's how I had a whole lot of my childhood memories with ‘Guduru’. When I was 6, I used to follow ‘kaala yantram’, a regular cartoon column in ‘Andhra Jyothi’ daily in 1988 which I collected and bounded together. Considering it an offence, my father had one day torn all of them. For him, any thing apart from academics would spoil children. I still remember, I cried my heart out for missing the chance of joining those pieces back as he had thrown them all in the stinking drain. Out of great hurt and frustration, I developed a burning desire at that tender age to read lot of material apart from academics which had engrained in me to collect a whole lot of books. I strongly believe that it is the phase that impacts and influences one for the rest of their lives."
Anil had his first encounter with books in 4th standard when he was gifted a few story books by a neighbour. " I participated in and won several elocution competitions. My speeches comprised of great quotes and poetry by Sri Sri, I was attracted to poetry and editorials at a very young age. During my graduation in Hyderabad, I would watch at least 4 English movies in a week. Strangely, it all directed me to read English novels based on which those films were made. Back then old books were sold on the footpaths of Narayanaguda, Koti and Abids. I used to spend 25 percent of my monthly income to buy old poetry and stories since 2007. In the process, I happened to read huge volume of Russian stories, ‘Jameelya’ novel, suggested by popular poet Srikanth. It was at the point when I started collecting the translated versions of Soviet Union Russian stories and Ukraine folk tales and made them available with lot of efforts to all the readers on the https://sovietbooksintelugu.blogspot.com free of cost" says Anil.
Anil read translated versions of Russian short stories of Maxim Gorky, Russian folk stories, Aesop’s fables, Leo Tolstoy’s stories, children poetry by political writer Vladimir Mayakovsky and other reputed novelists and short story writers of the communist land that were majorly made available between 1950 and 1990 through 'Visalandhra’ and ‘Prajasakthi’ publishing houses. Later, it was extended to classics and ideological literature which had greatly influenced the youth.
"I contacted all my friends, acquaintances, relatives to collect the Old Russian literature and stories. Almost 600 books are with me now. I have translated and published ‘Russian janapada kathalu’, ‘Apoorva Russian janapada kathalu’, ‘bujji kodi petta’, ‘kashtaanka’ and ‘Amma cheppina kathalu’ on my own. I have also worked to bring out ‘Bapu bommala panchatantram’ in which I retold ‘Vishnusarma stories, was published by ‘Chandamama library’ of Eluru. I owe every thing to the artists who helped in making this possible. To date, I have translated 7 children story books, tried retelling few and published 6 on my own. Having resigned from his software job in Hyderabad, Anil shifted to his home town in Nizamabad, to write some script of some films he has watched." I feel reading is more entertaining than watching movies. Moreover, kids can easily learn their mother tongue through small stories. In 2021, I prepared and published stories of 25 world’s best children movies. Almost all the copies were sold out like hot cakes in a very short time and secured me name and fame. I am planning to bring out ‘Madhusala’, my own poetry in the near future" Anil tells us.
"I have known Anil since he started translating Russian stories. A passionate reader cum translator, he did put all his efforts into his works. My children loved his ‘Bujji kodi petta’ stories. Not only children, parents and teachers too are enjoy reading his translated stories especially the recent release ‘Pillala cinema kathalu’ which has interesting stories with impressive illustrated pictures. This children’s edition is gem of its kind and very rare/" says Swathi kumari B, a poet and translator, who teaches at Rishi Valley School’.
“ 'Soviet Bhumi' represented the magical world Russian folktales and beautifully illustrated many stories.The bygone era of Soviet translations holds a special significance for me. It is not just nostalgia, there is more to it. It is an inseparable part of the collective consciousness of a whole generation of our people. I heartily congratulate Anil Battula for his incredible initiative”, shared the famous writer Sudhakar Unudurti .
"The PDF of 300 Soviet books I collected till date including the translated ones are made available free of cost on www.sovietbooksintelugu.blogspot.com.‘Pillala cinema kathalu’ doesn’t have a reprint and a very few copies left as of now. Parents who genuinely need this volume can reach me out on 9676365115, concludes Anil Battula.
Note: కింది ఆర్టికల్ లో కవి కె. శ్రీకాంత్ చెప్పినట్టుగా రాసిన మాటలు చెప్పింది ఆయన కాదు. తప్పుగా ప్రచురించారు. ఆ మాటలు చెప్పింది కథా రచయిత సుధాకర్ ఉణుదుర్తి గారు.



Tuesday 9 February 2021

'రాదుగ' మళ్ళీ రాదుగా! by పి.వి.రావు (సీనియర్ జర్నలిస్ట్)

  'రాదుగ' మళ్ళీ రాదుగా!


ఈ పుస్తకాలు గుర్తున్నాయా?  ఒకసారి బాల్యంలోకి వెళ్ళిచూడండి. ఇవన్నీ మనలో చాలామంది చదివిన పుస్తకాలే! అపురూపంగా దాచుకున్న పుస్తకాలే! 'విశాలాంధ్ర సంచార పుస్తకాలయం' బస్సు మా మణుగూరు (ఖమ్మం జిల్లా భద్రాచలం దగ్గర)  వచ్చిందంటే నాలో చెప్పలేని ఆనందం. వందలాది పుస్తకాల్లో మనల్ని బాగా ఆకట్టుకున్న 'రాదుగ ప్రచురణాలయం' పుస్తకాలివి! అందమైన హార్డ్ బౌండుతో మనల్ని ఆకర్షించిన పుస్తకాలు. చేతుల్లోకి తీసుకుని తిరగేస్తుంటే ఆ నాణ్యతతో, అందమైన ఆ బొమ్మలతో అబ్బురపరచిన పుస్తకాలు. తడిమి చూస్తుంటే తన్మయత్నం కలిగించిన పుస్తకాలు. అన్నింటికీ మించి అతి తక్కువ ధరతో మనకు సొంతమైన అపురూప పుస్తకాలు. పుస్తకాల షెల్ఫులో ఈనాటికీ ప్రత్యేకంగా కనిపించే వన్నె తగ్గని పుస్తకాలు. షెల్ఫ్ లోకి ఎన్నెన్నో పుస్తకాలు వచ్చి పోతున్నప్పటికీ అందులో సుస్థిర స్థానం సంపాదించుకున్న అభిమాన పుస్తకాలు. ఇతరత్రా గ్రంథాలు కాలక్రమంలో త్వరితగతిన శిథిలమై పోతున్నా ఈ పుస్తకాలకు మాత్రం ఆ పరిస్థితి వచ్చినట్టు కనబడదు. పుస్తకాల తయారీలో పాటించిన ఉన్నత నాణ్యతా ప్రమాణాలకు ఇదొక నిదర్శనం.🙏




          పాతికేళ్ళకు పైబడిన జ్ఞాపకాలు. విశాలాంధ్ర బస్సు ఊళ్ళోకి వచ్చిందనగానే చెప్పలేనంత ఆనందం. బస్సు వెళ్ళిపోతుందో ఏమో అనే ఆత్రుత .  వ్యాన్ దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్ళి ఎన్నిరోజులు ఉంటుంది అని అడిగే వాడిని. " వారం పదిరోజులు ఇక్కడే ఉంటుంది బాబు "అని చెప్పేవారు. అప్పట్లో ఎక్కవగా డాక్టర్ శంకర్ రావు ఆసుపత్రి ముందు వ్యాన్ ను నిలిపి ఉంచేవారు.


 ఇంటికి పరుగెత్తుకెళ్ళి దాచుకున్న డబ్బులన్నీ జేబులో వేసుకొని, చిల్లర పైసలన్నీ జమ చేసుకొని బస్సులోకి దూరి పోవడం. పుస్తకాలన్నీ అణువణువునా శోధించి 'రాదుగ' పుస్తకాలనన్నింటినీ ఎంపిక చేసుకోవడం. కొన్ని పుస్తకాలు రూపాయికి లోపే దొరికితే ఇంకొన్ని పది పదిహేనుకి మించిన ధర ఉండేవి కావు. మొత్తంగా ఇరవై రూపాయలకు మించి ఏ పుస్తకమూ కొన్నట్టు గుర్తు లేదు. ఎస్.అలెక్సేయెవ్ రాసిన నాలుగు వందల నలభై పేజీల 'రష్యన్ చరిత్ర - కథలూ గాథలూ' కేవలం పన్నెండు రూపాయలకు. లియొ టాల్ స్టాయ్ రాసిన రెండు వందల అరవై నాలుగు పేజీల 'కోసక్కులు' ఎనిమిది రూపాయలు. ఎమ్.లేర్మొంతోవ్ రాసిన నూట తొంభై తొమ్మిది పేజీల 'మన కాలం వీరుడు' పది రూపాయలకే! ఇలా కొద్దిపాటి డబ్బుతో గంపెడన్ని పుస్తకాలు కొని మురిపెంగా ఇంటికి మోసుకుపోయిన రోజులు. కొన్ని పుస్తకాలను అర్థం చేసుకోగలిగే మానసిక పరిణతి అప్పటికి (ఇప్పటికి కూడా) లేకున్నా తక్కువలో వస్తున్నాయని కొని పెట్టుకున్న సందర్భాలెన్నో. ఆసక్తితో చదవడమే కాదు ఇంట్లోని పుస్తకాల షెల్ఫ్ కు ఆ పుస్తకాలన్నింటినీ ఒక అలంకరణగా భావించడమన్నదీ లేకపోలేదు.


విశాలాంధ్ర బుక్ హోస్ వ్యాన్ వచ్చిందంటే నాన్న కూడా కొన్ని డబ్బులు ఇచ్చేవారు, దాంతో పరుగో పరుగంటూ వ్యాన్ దగ్గరకు వెళ్ళి పుస్తకాలు వెతుక్కునే వాన్ని.


  'రాదుగ' బాలసాహిత్య పుస్తకాలతో పోటీ పడే పుస్తకాలు ఇప్పటికీ రావడం లేదంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. 'బుల్లి మట్టి యిల్లు, ఆకుపచ్చ ద్వీపం, పసివాడి పగ, అడవిలో ఇళ్ళు, కళాతపస్వి యెగోరి, నొప్పి డాక్టరు' మొదలైన పుస్తకాలను మళ్ళీ మళ్ళీ చదువుతూ  పొందిన ఆనందాలకు, అనిర్వచనీయ అనుభూతులకు కొదవేలేదు. ఆ పుస్తకాల మీది ఇష్టం వల్లో లేక ఆ రచనల్లోని కొత్తదనమో, అనువాదంలోని సమ్మోహనాత్మక శైలీ మహత్మ్యమో తెలియదుగానీ అవి చదువుతున్నప్పుడు కలిగిన అనుభూతులను వర్ణించడానికి మాటలు చాలవు. ఆయా సన్నివేశాలను కళ్ళ ముందే చూస్తున్నట్టు, అందులో వర్ణించబడిన ప్రాంతాలలో సంచరిస్తున్నట్టు, ఆ పుస్తకాల్లోని పాత్రలతో సహజీవనం చేస్తున్నట్టు ఒక అద్భుత ప్రపంచం మదిలో ఆవిష్కృతమయ్యేది. వి.బియాంకి, వి.దచ్ కేవిచ్, జి.యూదిన్, వి.పనోవ, ఎ.కుప్రీన్, వి.బగమొలొవ్, ఎ.బెల్యాయెవ్, అలెక్సేయ్ తోల్ స్తోయ్ మొదలైన రష్యన్ రచయితలతో పాటు తెలుగు అనువాదకులైన వుప్పల లక్ష్మణరావు, రాచమల్లు రామచంద్రారెడ్డి, ఆర్వియార్, నిడమర్తి ఉమారాజేశ్వర రావు, కొండేపూడి లక్ష్మీనారాయణ, నిడమర్తి మల్లికార్జున రావు మొదలైన వారి పేర్లు ఈనాటికీ మస్తిష్కంలోంచి తొలగిపోలేదు.


  రష్యా దేశంలో మాస్కో నగరంలో ముద్రించబడిన ఈ పుస్తకాలు ఖండాంతరాలు దాటి వచ్చి మనల్ని పలకరించాయి.  అప్పటి సోవియట్ యూనియన్ ప్రభుత్వం తన భావజాలాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేయాలనుకుంది. అందుకు పుస్తకాలనే ప్రచార సాధనాలుగా ఎంచుకుంది. రాదుగ ప్రచురణాలయాన్ని స్థాపించి దాని ద్వారా వివిధ భాషల్లో వందలాది పుస్తకాలను ప్రచురించి ఆయా దేశాల ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఇందుకుగాను వివిధ దేశాలకు, భాషలకు చెందిన అనేక మంది అనువాదకులను రష్యాకు రప్పించుకుని, ఉద్యోగాలు ఇచ్చి అనువాదాలు చేయించింది. అలా మన తెలుగు ప్రాంతం నుండి కూడా పలువురు రచయితలు అక్కడ అనువాదకులుగా పని చేశారు.


సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యాక రాదుగ ప్రచురణాలయం మూతబడింది. అంతకాలం పెద్దలను, పిల్లలను ఆకర్షించి, అలరించిన అందమైన పుస్తకాల ప్రచురణ అంతటితో ఆగిపోయింది. మా ఇంట్లో మొదట కొలువుతీరిన మ్యాగజైన్ "సోవియట్ ల్యాండ్" ఎంత బావుండేదో. చక్కని కలర్ బొమ్మలతో నాణ్యమైన పేపర్ తో ముచ్చటగొలిపే ఆ మ్యాగజైన్ కోసం ప్రతి నెల ఎదురు చూసేవాళ్ళం.

ఆ తర్వాత మన తెలుగు ప్రచురణాలయాలు కొన్ని ఆ పుస్తకాలను పునర్ముద్రించే ప్రయత్నం చేసినా 'రాదుగ' అందం రాలేదు


   'రాదుగ' అంటే రష్యన్ భాషలో ఇంద్రధనుస్సు అని అర్థం. అనేక దేశాల్లోని చిన్నారుల చేతుల్లో హరివిల్లులను ఆవిష్కరింపజేసిన 'రాదుగ' మళ్ళీ రాదుగా! ఒకవేళ రాగలిగితే లోకంలోని పిల్లలకు ప్రకృతి సృష్టించే ఆ ఇంద్రధనుస్సు అక్కర్లేదేమో!



పి.వి.రావు🙏

సీనియర్ జర్నలిస్ట్

సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్

 సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్   ప్రగతి ప్రచురణాలయం, మాస్కో, యూ.యస్.యస్.ఆర్, తెలుగు విభాగపు మాజీ అధిపతి ***...