Friday 28 August 2015

Soviet children literature book exhibition -Vijayawada

Manchi Pustakam is organising a two-day sale of Soviet Children's literature reprinted by it in Vijayawada.
Dates: Aug 28th and 29th from 12 to 8 pm.

Venue: Pragati Offset showroom, Brindavan Colony, Vijayawada (Road Opp to D V Manor, which is the road leading to A 1 Convention Centre.



photo courtesy:  Chenna Kesava Reddy Madduri


Tuesday 18 August 2015

నొప్పి డాక్టరు by వ్యాసకర్త: మద్దిరాల శ్రీనివాసులు, టీచర్, త్రిపురాంతకం

link: http://pustakam.net/?p=18754



వ్యాసకర్త: మద్దిరాల శ్రీనివాసులు, టీచర్,
త్రిపురాంతకం, సెల్: 9010619066
**********
పిల్లలకు సరదాగా, జాలీగా పుస్తక పఠనంపై ఆసక్తి, నైతిక విలువలు పెంపొందించే ఉద్దేశంతో ముద్రింపబడిన పుస్తకం ఇది. సహజంగా డాక్టరు గారి లాగే పక్షి, జంతు ప్రేమికులైన పిల్లలకు ఈ పుస్తకం ఆసక్తిగానే వుంటుందని నేను భావిస్తున్నాను. అంతే కాకుండా ” ఖుషి” టివి లాంటి చానల్స్ లో వచ్చే కార్టూన్ సినిమాలను వదలకుండా చూస్తున్న నేటి బాలల కోసం, ఒక కార్టూన్ సినిమాను చూసిన ఫీలింగ్ కలిగేలా పుస్తక రూపంలో అందించడం బాగుంది. వినోదంతో పాటు జంతువులకు, పక్షులకు సంబంధించిన విజ్ఞానం కూడా వారికి అందిస్తుందీ పుస్తకం. పుస్తకం పేరు, లోపలి భాష, జంతువుల, పక్షుల చేష్టలు పిల్లలను చాలా బాగా ఆకట్టుకుంటాయి ఇందులో. పిల్లల మెదడును ఆలోచింపజేస్తుంది. ఇతరులను గౌరవించడం , మంచిగా మాట్లాడే విధానం, అందరినీ కలుపుకుపోవడం, జంతువులను ప్రేమించడం లాంటి నైతిక విలువలు కూడా నేర్చుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే టి.వి.లకు అతుక్కుపోతూ, చదవడంపై
ఆసక్తి లేని పిల్లలున్న కాలమిది. అలాంటి పిల్లలను సైతం పుస్తక పఠనం వైపు మళ్ళించగల ఒక మంచి టానిక్ ఈ “నొప్పిడాక్టర్” పుస్తకం.
హాయ్ ! పిల్లలూ. మీకోసం ఓ మంచి పుస్తకమర్రా !ఏంటి పుస్తకం పేరా? విచిత్రంగా వుంది కదూ! నాక్కూడానూ. అందుకే వెంటనే చదివేశాను. భలే తమాషాగా వుంది. చాలా సరదాగా కూడా వుంది. చదువుతుంటే, ఖుషి టి.వి.లో కార్టూన్ సినిమా చూసినంత ఉల్లాసమేసింది. ఊ…..నిజం. కాస్త రుచి
చూపించమంటారా….?! సరే అయితే….
నొప్పి డాక్టరు గారితో వాళ్ళ అక్క “వర్వారా”, ఇద్దరు పిల్లలు తాన్యా, వాన్యా వుంటారు. డాక్టరు గారు జంతు, పక్షి ప్రేమికుడు. ఎంతటి జంతు ప్రేమికుడంటే, తన ఇంట్లో ఎప్పుడూ అల్మారాలో ఉడుత, గదిలో కుందేళ్ళు, చెక్క అరలో కాకి, సోఫాలో ముళ్ళపంది ఇలా ఆయన చుట్టూ ఎప్పుడూ తిరుగుతుంటాయి. పైగా డాక్టర్ గారు జాలి గుండె కలవారు. అందుకే ప్రకృతి కంటే కూడా డాక్టరు గారి ఇల్లే వాటికి స్వర్గంలా అనిపించేది. అతని దగ్గరకు వచ్చే రోగులంతా నొప్పి,..నొప్పి… అంటూ వస్తుంటారు. వారికి వచ్చిన ఎలాంటి నొప్పినైనా సరే! క్షణాల్లో తన వైద్యంతో మాయం చేస్తారు. అందుకే అందరూ “నొప్పి డాక్టరు ” అని పిలవసాగారు. ఈయన దగ్గరికి వైద్యం కోసం వచ్చి డాక్టరు గారి ఇంట్లో వాతావరణం చూసి, ముగ్ధులైపోయి అక్కడ సెటిలైపోయినవారే వాన్యా, తాన్యా లు. అంతటి ఆకర్షణీయ వాతావరణం అక్కడ ఉంటుంది. ఆయన అందరిపై చూపించే ప్రేమ అలాంటిది మరి.
ఇందులో ప్రాణుల పేర్లు కూడా చాలా విచిత్రంగా , తమాషాగా వుంటాయి. బాతు పేరు “కికా”, పంది పిల్ల పేరు “గుర్రు గుర్రు”, చిలుక పేరు “కరుడొ”,
గుడ్లగూబ పేరు “బుంబా….ఇలా. అంతే కాదర్రోయ్! ఇందులో జంతువులు, పక్షులు మాట్లాడతాయి కూడా ! ఆ…. వాటి భాష కూడా భలే తమాషాగా వుంది. ఏంటి? నమ్మడం లేదా? అయితే ఓ చిన్న సంభాషణ చూడండి.
ఒక రోజు ఒక గుర్రం, “లామా, వనోయ్, ఫిఫి, కుకు” అంటూ మన డాక్టరు గారి దగ్గరకు వస్తుంది. అంటే….”నాకు కళ్ళు పోటుగా వున్నాయి. కళ్ళజోడు ఇవ్వండి” అని అర్థమట. వెంటనే మన డాక్టరు గారు, “కపూకీ, కపూమాకీ” అంటాడు. అంటే, “దయచేసి కూర్చోండి” అని అట. ఏంటీ! ఇదేం భాషా? అనుకుంటున్నారు కదూ! అదేమరి, జంతు భాష అంటే. వాళ్ళకు అర్థమయ్యిందిలెండి. అందుకే డాక్టరు గారు అలా అనగానే అది కూర్చుంది. ఇంకేముంది, కళ్ళకు అద్దాలు పెట్టేశారు మరి. ఫీజు లేదు, బిల్లూ లేదు. ఉచితమేనర్రా! ఊ….. చూశారా! మన డాక్టరు గారిది జాలిగుండె అని తెలిసిందిగా. వెంటనే దానికి కళ్ళ నొప్పి ఇట్టే మాయమయింది. వారెవ్వా…! నొప్పి డాక్టరా …మజాకానా…!. ఇక వెంటనే ఆ గుర్రం “చాకా” అంటూ తోక ఆడించుకుంటూ, జాలీగా కళ్ళద్దాలతో వీథిలోకి వెళ్ళిపోయింది. “ఓ! “చాకా” అంటేనా? ధన్యవాదాలు అనట.
ఇలా గుర్రం వలన విషయం తెలుసుకున్న కళ్ళ నొప్పులున్న ఆవులూ, కుక్కలూ, పిల్లులూ, ఆఖరికి ముసలి కాకులు కూడా మన డాక్టరు గారి దగ్గరికి
వస్తున్నాయి. వాటన్నిటికీ కూడా కళ్ళజోళ్ళను ఫ్రీగా తగిలించేవారు. ఈ విధంగా ఊళ్ళో మనుషులతో పాటు అడవిలోని జంతువులూ, పక్షులు, నీళ్ళలోని
తాబేళ్ళు, ఆకాశంలోని కొంగలూ, గ్రద్దలూ నొప్పులున్న ప్రతి ప్రాణీ ధైర్యంగా డాక్టరు గారి దగ్గరికి వైద్యానికి వచ్చేవి. కొద్ది కాలంలోనే మన నొప్పిడాక్టరు గారికి అందరూ అభిమానులైపోయారు.
ఇంకో రోజు మెడనొప్పి అంటూ, ఒక కోతి వస్తుంది దాని పేరు “కిచకిచ”. దానికి వైద్యం చేస్తారు. అది అక్కడే వుండి పోతుంది. ఒకనాడు దాని యజమాని
వస్తాడు. అతను రాగానే మన టామీ, “గుర్..గుర్…” మంటుంది. అంటే “పారిపో! లేకుంటే కరిచేస్తాను,” అని అర్థమట. బ్రతుకుజీవుడా! అనుకుంటూ
పారిపోతాడతను. నొప్పి డాక్టరైనా నొప్పులే కాదర్రోయ్! రెక్క తెగిన సీతాకోక చిలుక వస్తే, దానికి ఎర్ర చుక్కలతో మెరిసిపోతున్న సిల్కు గుడ్డతో రెక్క కుట్టి , నిప్పుకు దూరంగా వుండమంటూ జాగ్రత్తలు చెప్పి మరీ పంపిస్తారు. సూపర్ కదా! ఇందులో మరో విచిత్ర జంతువు కూడా వుందర్రోయ్. దాని పేరు “తోపుడు లాగుడు”. ఆ… ఏంటి? నవ్వు వస్తోందా? అవును, జంతువుల పేర్ల లాగే ఈ కథల్లో డైలాగులు కూడా ఇంకా చాలా …భలే భలే సరదాగా వున్నాయ్.
“కరాబుకి, మరాబుకి, బూ” అంటే “మీకు సాయం చేయకుండా ఎలా వుంటాం?”
“ఆబుజో, మబుజో, బాక్” అంటే “మేము మిమ్మల్ని వదిలిపెట్టం, మీ నమ్మిన నేస్తాలుగా ఉండిపోతాం”
“కిసాఫా, మాక్” అనగా “ఇది నొప్పి డాక్టర్ గారి ఇల్లేనా?” అనట. భలే వున్నాయి కదా!
అంతేనా? ఇలా జంతువులు, డాక్టరు గారు కలిసి కోతులకు వైద్యం చేయడానికని, సముద్రంలో ఓడపై ఆఫ్రికా కూడా వెళ్తారు. మరి ఈ ప్రయాణంలో డాక్టరు గారికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అప్పుడు మన డాక్టరు గారికి జంతువులు సాయం చేస్తాయి. ఇలా ఎంతో సరదాగా సాగే, “మర్కట రాజ్యానికి యాత్ర,”, పింటూ, సముద్రపు దొంగలు” అనే రెండు కథలు సరదా సరదా బొమ్మలతో ఇందులో చాలా బాగా వున్నాయి . ఏంటి? రుచి చూపిస్తూ ఉంటేనే మనసు ఊరించి పోతోందా!? అయితే, ఇంకేం ? చదివేయండి మరి ఈ పుస్తకాన్ని. మీకు బోలెడన్ని విషయాలు తెలుస్తాయి. చాలా ఎంజాయ్ చేస్తారు.
ఎంతో సరదాగా , జాలీగా విజ్ఞానంతో కూడిన ఈ పుస్తకం రష్యా భాషలో “కొర్నేయ్ చుకోవ్ స్కీ” అనే రచయిత వ్రాయగా 1986 లో ప్రథమంగా ముద్రింపబడింది. దీనిని “ఆర్వియార్ ” అనే రచయిత తెలుగులో అనువదించగా, వి.దువిదేవ్ గారితో చక్కని బొమ్మలు వేయించి, పిల్లల ప్రేమికులు, బాలలసాహిత్య ప్రచురణ కర్తలు అయిన దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్ వారు చక్కటి అందమైన బైండింగ్ తో పిల్లలు చదివేందుకు వీలైన అచ్చుతో ఇదిగో ఇటీవలనే జులై 2015 లోనే ఇలా ఇండియాలో మన ముందుకు తెచ్చారు.
180 పేజీలతో హైదరాబాద్ లోని చరిత ఇంప్రెషన్స్ వారు ముద్రించిన ఈ బుక్ చాలా ఇంప్రెసివ్ గా వున్నది. దీని ఖరీదు రూ|| 200-00 లు. కాస్త
ఖరీదనిపించినా, దీన్ని చదివిన పిల్లలు పొందే ఆనందం, విజ్ఞానాల ముందు ధర దిగదుడుపే.
ప్రతులు దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్, తెన్నేరు, కృష్ణా జిల్లా, పిన్: 521260 అను చిరునామాలోనూ; సెల్: 9989051200, email:
mdevineni@gmail.com ద్వారానూ పొందవచ్చును.
మరో చిరునామా: మంచి పుస్తకం, 12-13-439, వీథి నెం:1, తార్నాక, సికింద్రాబాద్, పిన్:500017, సెల్: 9490746614, email: info@manchipustakam.in, website: www.manchipustakam.in

“నొప్పి డాక్టరు” గారిని వెతకండి by వ్యాసకర్త: బాదర్ల స్వప్నిల్

link: http://pustakam.net/?p=15881

వ్యాసకర్త: బాదర్ల స్వప్నిల్
”ఒక చిత్రం పదివేల పదాలతో సమానం” – చైనా సామెత –  ఇది చెప్పడానికి మనకు చైనా వాళ్ళే కావాలా? మనకు తెలియదా? తెలుసు. అయినా మనం కొన్ని విషయాలను మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేసుకోవాలి. కొన్ని పుస్తకాలను మళ్ళీ మళ్ళీ చదువుకున్నట్లు. కొన్ని బొమ్మల్ని తిరిగి తిరిగి చూసుకున్నట్లు.  నేను పరిచయం చేయబోయే పుస్తకం ఒక తరం నోస్టాల్జియా కు సంబంధించినది. ఇది కేవలం కథల పుస్తకమే కాదు. ఒకప్పటి రష్యన్ రాదుగ బొమ్మల పుస్తకం.  తెలుగులో వచ్చిన రాదుగ పుస్తకాలను ఎన్ని సార్లు చూసుకున్నా తనివి తీరదు కదా. ఆ పుస్తకాల అట్టలే వేరు. ఆ పుస్తకాలలోని అక్షరాలే వేరు. మరీ ముఖ్యంగా వాటిల్లోని బొమ్మలే వేరు.
కొన్ని పుస్తకాలుంటాయి. పుస్తకాలతో కొన్ని అనుభవాలుంటాయి. అంతకుమించి ఆయా పుస్తకాలతో గొప్ప అనుబంధమూ ఉంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు చదివిన పుస్తకాలు బొమ్మలతో సహా జీవితాంతం గుర్తుండి పోతాయి. ఎక్కడ చేజార్చుకుంటామో  అని గుండెలకు పొదివిపట్టుకుని కాపాడుకుంటాము. అవి మన దగ్గర లేకున్నా అందులోని బొమ్మలను తలుచుకుని నోస్టాల్జియాలో పడతాము. అలాంటిదే  నూట ఎనభై పేజీల ఈ నొప్పిడాక్టరు పుస్తకం.  గ్యూ లోఫ్ టింగ్ రాసిన డా. డూలిటిల్ ని  ఆధారం చేసుకుని కోర్నేయ్ చుకోవ్ స్కి  రాసిన డా.పౌడర్ పిల్ అనే ఈ రష్యన్ పుస్తకాన్ని ఆర్వీఆర్ గారు  తెలుగులో చక్కగా అనువదించారు. “వి.దువీదొవ్” వేసిన బొమ్మలు ఈ పుస్తకానికి ప్రాణం.

ఈ పుస్తకంలో అడవిలో జంతువులకు వైద్యం చేసే ఒక డాక్టరు ఉంటాడు. ఆయన పేరు నొప్పి డాక్టరు. ఆయనతో పాటు  కికా అనే బాతు, అవ్వా అనే కుక్క, కరూడో అనే చిలుక, బుంబా  అనే గుడ్లగూబ కూడా నివసిస్తూ ఉంటాయి. అతడికి జంతువులూ, పక్షులు మాట్లాడుకునే భాష తెలుసు. అవి తమకేదన్నా జబ్బు చేసినప్పుడు, ఆపద వచ్చినప్పుడు నొప్పి డాక్టరు దగ్గరకి పరిగెడుతుంటాయి. వాటి జబ్బుల్ని ఆయన చిటికలో వైద్యం చేసి మాయం చేస్తుంటాడు. ఇంతలో ఆఫ్రికాలోని మర్కట రాజ్యంలో కోతులు కడుపునొప్పితో బాధ పడుతున్నాయని కబురు వస్తుంది. నొప్పి డాక్టరు గారు రాబిన్సన్ అనే తన స్నేహితుడి దగ్గర నుంచి ఓడని అరువు తీసుకుని ఆఫ్రికా ఖండానికి బయలుదేరతాడు. దారి మధ్యలో అనేక ఆటంకాలు. ఓడ మునిగిపోతుంది. సముద్రపు దొంగలు బందిస్తారు. చివరికి ఎలాగైతేనేం మర్కటరాజ్యానికి చేరుకుని కోతుల్ని కాపాడతారు. దానికి ప్రతిఫలంగా కోతులు నొప్పిడాక్టరు గారికి తోపుడు లాగుడు  అనే రెండు తలల వింత జీవిని బహుకరిస్తాయి.
అలాగే మరొక కథలో పెంటా అనే జాలరి కుర్రవాడి తండ్రిని సముద్రపు దొంగలు ఎత్తుకుపోతే అతడిని రక్షించి తండ్రీ కొడుకులను కలుపుతాడు. దొంగలు సముద్రంలో మునిగిపోతారు.
స్థూలంగా ఇందులోని రెండు కథలివే. ఈ రెండు కథల్లోనూ సాహసాలు చేసే డాక్టరు గారికి కికా, అవ్వా, కరూడో, బుంబా తదితర పక్షులు, జంతువులూ సహాయపడుతూ ఉంటాయి.
కథలను మించి ఈ పుస్తకంలో దువీదోవ్ వేసిన బొమ్మలు అమూల్యమైనవి.మనకు రాదుగ చిన్నపిల్లల  బొమ్మల పుస్తకాలు అసంఖ్యాకంగా వచ్చాయి. ప్రతిదీ దేనికదే ప్రత్యేకం.
మనం మన పిల్లలకి వాళ్ళ నోళ్ళు తిరగక పోయినా ఇంగ్లీషు రైమ్స్ బట్టీ వేయిస్తుంటాము. మెలికలు తిరిగే అక్షరాలను పదే పదే దిద్దుస్తుంటాము.  వాళ్ళు ఆడుకునే ఆటలు కూడా తెలివితేటలు, ఐక్యూ పెంచేవిగానో చూసుకుంటాము గాని అన్నిటికీ మూలమైన వాళ్ళ కల్పనా శక్తిని నిర్లక్ష్యం చేస్తుంటాము.  వాళ్ళ రంగు రంగుల ఊహా ప్రపంచాన్ని దూరం చేసి మన భయాలను వాళ్ళమీద నెడుతుంటాము. అదంతా వేరే సంగతి కాని పిల్లల ఊహా శక్తికి కథలెంత ముఖ్యమైనవో బొమ్మలు కూడా అంతే ముఖ్యమని మనం గుర్తించాలి. మనం బొమ్మల పుస్తకాలను ఇంకా నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నాము. .
ఇటీవల సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే నా మిత్రుడొకరు నా దగ్గర ఈ పుస్తకాన్ని తీసుకుని ఐదేళ్ళ వాళ్ళబ్బాయికి చూపించాడు. ఆ పిల్లవాడికి ఈ కథల్లో నొప్పి డాక్టరు గారికి జంతువుల భాష తెలిసి ఉండటం, ఇక బొమ్మల్లో మొసలి సోఫాలో కూర్చుని ఉండటం బాగా నచ్చేసింది. నొప్పి డాక్టరు ఆ బాలుడి జీవితంలో ఒక భాగమైపోయాడు.  నాకు బాగా తెలిసిన ఇద్దరు వృద్ధ దంపతులు ఈ నొప్పిడాక్టరు పుస్తకం చెరొక కాపీని భద్రంగా దాచుకుని ప్రతిరోజూ చూసుకుంటూ ఉండటం నన్ను ఆశ్చర్య పరిచింది.
చెప్పవచ్చేదేమంటే మనకిప్పుడు బొమ్మల పుస్తకాలు కావాలి. పిల్లల పుస్తకాల్లోనే కాదు, పెద్దల పుస్తకాల్లో కూడా బొమ్మలు కావాలి. బొమ్మలను గౌరవించడం మనం నేర్చుకోవాలి.  మనకు ఒకప్పుడు “చందమామ” వంటి మంచి పిల్లల మాస పత్రికలు ఉన్నట్లే, మంచి రాదుగ చిన్న పిల్లల పుస్తకాలు కూడా ఉన్నాయని చెప్పుకోవాలి. దురదృష్టమేమంటే అందులోని చాలా పుస్తకాలు ఇప్పుడు అలభ్యం. చూడాలంటే వాటిని భధ్రంగా దాచుకుని చూసుకునే డెబ్బయవ దశకం పాఠక తరాన్ని అడగాలి. లేకపోతే ఆదివారం అబిడ్స్, విజయవాడ పాత పుస్తకాల షాపులను దులపాలి. ఇటీవల కొందరు ఔత్సాహికులు పిల్లల బొమ్మల పుస్తకాల అవసరాన్ని గుర్తించి  పిల్లల పుస్తకాలు బొమ్మలతో సహా వేస్తున్నారు. తెలుగులో నిజంగా ఇదొక శుభపరిణామం.
ఇటీవల “మంచిపుస్తకం” వారు కొన్ని రాదుగ పిల్లల పుస్తకాలను పునర్ముద్రిస్తున్నారు. వారు కాని, ఇంకెవరైనా కాని ఈ నొప్పిడాక్టరు పుస్తకాన్ని ప్రచురిస్తే దీన్నొక జ్ఞాపకంగా గుర్తుంచుకున్న అప్పటి తరమే  కాక, ఇప్పటి పిల్లలూ  ఇటువంటి గొప్ప పుస్తకాన్ని చదివే అదృష్టం కలుగుతుంది.


Saturday 8 August 2015

"నొప్పి డాక్టరు" Book release photos - 8 aug 2015

"నొప్పి డాక్టరు" Book release photos @ NBT auditorium, Andhra Mahila sabha, Hyderabad- 8 Aug 2015, 10:30 am to 12:30 pm.







సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్

 సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్   ప్రగతి ప్రచురణాలయం, మాస్కో, యూ.యస్.యస్.ఆర్, తెలుగు విభాగపు మాజీ అధిపతి ***...