Friday 20 July 2018

'రాదుగ' మళ్ళీ రాదుగా! by పెండెం జగదీశ్వర్

From Pendem Jagadeeshwar on January 14, 2017
'రాదుగ' మళ్ళీ రాదుగా!
ఈ పుస్తకాలు గుర్తున్నాయా? ఒకసారి బాల్యంలోకి వెళ్ళిచూడండి. ఇవన్నీ మనలో చాలామంది చదివిన పుస్తకాలే! అపురూపంగా దాచుకున్న పుస్తకాలే! 'విశాలాంధ్ర సంచార పుస్తకాలయం' బస్సు మన ఊరికి వచ్చినపుడు వందలాది పుస్తకాల్లో మనల్ని బాగా ఆకట్టుకున్న 'రాదుగ ప్రచురణాలయం' పుస్తకాలివి! అందమైన హార్డ్ బౌండుతో మనల్ని ఆకర్షించిన పుస్తకాలు. చేతుల్లోకి తీసుకుని తిరగేస్తుంటే ఆ నాణ్యతతో, అందమైన ఆ బొమ్మలతో అబ్బురపరచిన పుస్తకాలు. తడిమి చూస్తుంటే తన్మయత్నం కలిగించిన పుస్తకాలు. అన్నింటికీ మించి అతి తక్కువ ధరతో మనకు సొంతమైన అపురూప పుస్తకాలు. పుస్తకాల షెల్ఫులో ఈనాటికీ ప్రత్యేకంగా కనిపించే వన్నె తగ్గని పుస్తకాలు. షెల్ఫ్ లోకి ఎన్నెన్నో పుస్తకాలు వచ్చి పోతున్నప్పటికీ అందులో సుస్థిర స్థానం సంపాదించుకున్న అభిమాన పుస్తకాలు. ఇతరత్రా గ్రంథాలు కాలక్రమంలో త్వరితగతిన శిథిలమై పోతున్నా ఈ పుస్తకాలకు మాత్రం ఆ పరిస్థితి వచ్చినట్టు కనబడదు. పుస్తకాల తయారీలో పాటించిన ఉన్నత నాణ్యతా ప్రమాణాలకు ఇదొక నిదర్శనం.
పాతికేళ్ళకు పైబడిన జ్ఞాపకాలు. విశాలాంధ్ర బస్సు ఊళ్ళోకి వచ్చిందనగానే చెప్పలేనంత ఆనందం. బస్సు వెళ్ళిపోతుందో ఏమో అనే ఆత్రుతతో ఇంటికి పరుగెత్తుకెళ్ళి దాచుకున్న డబ్బులన్నీ జేబులో వేసుకొని, చిల్లర పైసలన్నీ జమ చేసుకొని బస్సులోకి దూరి పోవడం. పుస్తకాలన్నీ అణువణువునా శోధించి 'రాదుగ' పుస్తకాలనన్నింటినీ ఎంపిక చేసుకోవడం. కొన్ని పుస్తకాలు రూపాయికి లోపే దొరికితే ఇంకొన్ని పది పదిహేనుకి మించిన ధర ఉండేవి కావు. మొత్తంగా ఇరవై రూపాయలకు మించి ఏ పుస్తకమూ కొన్నట్టు గుర్తు లేదు. ఎస్.అలెక్సేయెవ్ రాసిన నాలుగు వందల నలభై పేజీల 'రష్యన్ చరిత్ర - కథలూ గాథలూ' కేవలం పన్నెండు రూపాయలకు. లియొ టాల్ స్టాయ్ రాసిన రెండు వందల అరవై నాలుగు పేజీల 'కోసక్కులు' ఎనిమిది రూపాయలు. ఎమ్.లేర్మొంతోవ్ రాసిన నూట తొంభై తొమ్మిది పేజీల 'మన కాలం వీరుడు' పది రూపాయలకే! ఇలా కొద్దిపాటి డబ్బుతో గంపెడన్ని పుస్తకాలు కొని మురిపెంగా ఇంటికి మోసుకుపోయిన రోజులు. కొన్ని పుస్తకాలను అర్థం చేసుకోగలిగే మానసిక పరిణతి అప్పటికి (ఇప్పటికి కూడా) లేకున్నా తక్కువలో వస్తున్నాయని కొని పెట్టుకున్న సందర్భాలెన్నో. ఆసక్తితో చదవడమే కాదు ఇంట్లోని పుస్తకాల షెల్ఫ్ కు ఆ పుస్తకాలన్నింటినీ ఒక అలంకరణగా భావించడమన్నదీ లేకపోలేదు.
'రాదుగ' బాలసాహిత్య పుస్తకాలతో పోటీ పడే పుస్తకాలు ఇప్పటికీ రావడం లేదంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. 'బుల్లి మట్టి యిల్లు, ఆకుపచ్చ ద్వీపం, పసివాడి పగ, అడవిలో ఇళ్ళు, కళాతపస్వి యెగోరి, నొప్పి డాక్టరు' మొదలైన పుస్తకాలను మళ్ళీ మళ్ళీ చదువుతూ పొందిన ఆనందాలకు, అనిర్వచనీయ అనుభూతులకు కొదవేలేదు. ఆ పుస్తకాల మీది ఇష్టం వల్లో లేక ఆ రచనల్లోని కొత్తదనమో, అనువాదంలోని సమ్మోహనాత్మక శైలీ మహత్మ్యమో తెలియదుగానీ అవి చదువుతున్నప్పుడు కలిగిన అనుభూతులను వర్ణించడానికి మాటలు చాలవు. ఆయా సన్నివేశాలను కళ్ళ ముందే చూస్తున్నట్టు, అందులో వర్ణించబడిన ప్రాంతాలలో సంచరిస్తున్నట్టు, ఆ పుస్తకాల్లోని పాత్రలతో సహజీవనం చేస్తున్నట్టు ఒక అద్భుత ప్రపంచం మదిలో ఆవిష్కృతమయ్యేది. వి.బియాంకి, వి.దచ్ కేవిచ్, జి.యూదిన్, వి.పనోవ, ఎ.కుప్రీన్, వి.బగమొలొవ్, ఎ.బెల్యాయెవ్, అలెక్సేయ్ తోల్ స్తోయ్ మొదలైన రష్యన్ రచయితలతో పాటు తెలుగు అనువాదకులైన వుప్పల లక్ష్మణరావు, రాచమల్లు రామచంద్రారెడ్డి, ఆర్వియార్, నిడమర్తి ఉమారాజేశ్వర రావు, కొండేపూడి లక్ష్మీనారాయణ, నిడమర్తి మల్లికార్జున రావు మొదలైన వారి పేర్లు ఈనాటికీ మస్తిష్కంలోంచి తొలగిపోలేదు.
రష్యా దేశంలో మాస్కో నగరంలో ముద్రించబడిన ఈ పుస్తకాలు ఖండాంతరాలు దాటి వచ్చి మనల్ని పలకరించాయి. అప్పటి సోవియట్ యూనియన్ ప్రభుత్వం తన భావజాలాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేయాలనుకుంది. అందుకు పుస్తకాలనే ప్రచార సాధనాలుగా ఎంచుకుంది. రాదుగ ప్రచురణాలయాన్ని స్థాపించి దాని ద్వారా వివిధ భాషల్లో వందలాది పుస్తకాలను ప్రచురించి ఆయా దేశాల ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఇందుకుగాను వివిధ దేశాలకు, భాషలకు చెందిన అనేక మంది అనువాదకులను రష్యాకు రప్పించుకుని, ఉద్యోగాలు ఇచ్చి అనువాదాలు చేయించింది. అలా మన తెలుగు ప్రాంతం నుండి కూడా పలువురు రచయితలు అక్కడ అనువాదకులుగా పని చేశారు.
బాల్యంతో పెనవేసుకున్న రాదుగ పుస్తకాలు అందరిలాగే నాకూ ఒక తీపి జ్ఞాపకమైతే రాదుగ ప్రచురణాలయంలో పది సంవత్సరాలపాటు అనువాదకుడిగా పనిచేసి, వందలాది పుస్తకాలను రూపొందించిన 'ఆర్వియార్' (రాళ్ళబండి వెంకటేశ్వర రావు) గారితో నా అనుబంధం మరో మధుర జ్ఞాపకం. మా ఊళ్ళోని డిగ్రీ కాలేజీలో నేను బి.ఏ ఆఖరి సంవత్సరం చదువుతున్న రోజుల్లో మా కాలేజీకి ప్రిన్స్ పాల్ గా వచ్చారాయన. అప్పటికే ఆయన అనువాదం చేసిన అనేక పిల్లల పుస్తకాలను ఆసాంతం చదివి ఉన్నాను. ఆయనను చూస్తుంటే ఒక మేరు పర్వతం మా ఊరికి వచ్చిందా అన్న సంభ్రమాశ్చర్యాలు కలిగేవి. ఆయన సాంగత్యంలో వాళ్ళింట్లో అనేక సాయంత్రాలు గడిపిన రోజులు మరుపురానివి. రాదుగ పుస్తకాల గురించి నేను అడుగుతూ ఆయన చెబుతూ అలా ఎడతెరిపిలేని సంభాషణలు జరుగుతుండేవి. ఇలా రాదుగ బాలసాహిత్య పుస్తకాలతోపాటు వాటి అనువాదకునితో కూడా నా జ్ఞాపకాలు మమేకమైపోయాయి.
సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యాక రాదుగ ప్రచురణాలయం మూతబడింది. అంతకాలం పెద్దలను, పిల్లలను ఆకర్షించి, అలరించిన అందమైన పుస్తకాల ప్రచురణ అంతటితో ఆగిపోయింది. ఆ తర్వాత మన తెలుగు ప్రచురణాలయాలు కొన్ని ఆ పుస్తకాలను పునర్ముద్రించే ప్రయత్నం చేసినా 'రాదుగ' అందం రాదుగాదే!
'రాదుగ' అంటే రష్యన్ భాషలో ఇంద్రధనుస్సు అని అర్థం. అనేక దేశాల్లోని చిన్నారుల చేతుల్లో హరివిల్లులను ఆవిష్కరింపజేసిన 'రాదుగ' మళ్ళీ రాదుగా! ఒకవేళ రాగలిగితే లోకంలోని పిల్లలకు ప్రకృతి సృష్టించే ఆ ఇంద్రధనుస్సు అక్కర్లేదేమో!
- పెండెం జగదీశ్వర[ బాలల కథారచయిత]


సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్

 సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్   ప్రగతి ప్రచురణాలయం, మాస్కో, యూ.యస్.యస్.ఆర్, తెలుగు విభాగపు మాజీ అధిపతి ***...