Monday, 7 November 2016

ఉద్వేగానికి లోనయ్యా...

ఉద్వేగానికి లోనయ్యా...
--------------------------

సోవియట్‌ యూనియన్‌ మనుగడలో ఉన్న కాలంలో ఎన్నో అద్భుతమైన పుస్తకాలు మన తెలుగు నేలను ముంచెత్తాయి. అక్టోబరు విప్లవం గురించి, దాని నేపథ్యంలో వచ్చిన సాహిత్యం, సైన్స్‌, చరిత్ర, తత్వశాస్త్రం, కళలు ఒకటేమిటి.. అనేక అంశాల మీద వెలువడిన పుస్తకాలు మన తెలుగు నేలను పునీతం చేశాయి. అవన్నీ అప్పటి తరానికి మార్గదర్శకాలుగా పనిచేశాయి. అయితే ఇప్పటి తరానికి సోవియట్‌ పుస్తకాల గురించి చాలా తక్కువ మాత్రమే తెలుసు.
పాత తరంవారు దాదాపు వాటి గురించి మరిచిపోయిన క్రమంలో మళ్లీ ఆ పుస్తకాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నంలో మునిగి తేలుతున్నాడు ఓ యువకుడు. అతగాడ్ని చూస్తే ఈ పిలగాడేనా ఇంతపని చేస్తున్నది అనిపించక మానదు. అనిల్‌ బత్తుల అనే ఈ కుర్రోడికి ఇప్పుడు సోవియట్‌ పుస్తకాల గురించి ప్రచారం చేయడమే పని. అందుకు వాహికగా ఫేస్‌బుక్‌ను వాడుకుంటున్నాడు. పాత సోవియట్‌ సాహిత్యాన్ని పిడిఎఫ్‌ రూపంలోకి మార్చి ఫేస్‌బుక్‌లో ఉంచుతున్నాడు. తెలిసిన వారందరికీ మెయిల్‌ చేస్తున్నాడు. ఇంకాస్త ముందుకు వెళ్లి డబ్బు ఖర్చుపెట్టి జిరాక్స్‌ తీయించి స్పైరల్‌ బైండింగ్‌ చేసి ఇస్తున్నాడు.
ఇతగాడి వ్యవహారం తెలిసి 'సోపతి' ఫోన్‌ చేసింది. ఏం బిడ్డా మస్తుగ చేస్తున్నవ్‌గదా నీ కృషి గురించి నాలుగు మాటలు చెప్పు అంది. ''ప్రపంచాన్ని మార్చివేసిన గొప్ప విప్లవం అక్టోబరు విప్లవం.. ఆ విప్లవం మార్క్సిజాన్ని మొదటిసారిగా ఆచరణాత్మకమైనదని ఎలుగెత్తి చాటింది. ఆ విప్లవ భావజాలంతో వచ్చిన అనేక పుస్తకాలు మన తెలుగులోకీ అనువదించబడ్డాయి. వాటిని చదివి ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఈ సాహిత్యం మన తెలుగు జీవితాలపై ఎట్లాంటి ప్రభావం చూపిందో చెప్పడానికి ఒక్క తెలంగాణ సాయుధపోరాటం చాలు. మహీధర, దాశరథి, శ్రీశ్రీ వంటి ఎందరో మహా కవులు, రచయితలు ఈ పుస్తకాల ప్రభావానికి లోనయినవారే. ఇక నేనెంత? ఇప్పుడు ఈ పుస్తకాలను దాదాపు అందరూ మరిచిపోయారు. మళ్లీ ఒక్కసారి ఈ జ్ఞాన భాండాగారాలను జనంలోకి తీసుకెళ్ళాలనిపించింది. ఇది డిజిటల్‌ యుగం. అందుకే ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియాను ఉపయోగించుకుని ఈ పుస్తకాలను త్వరగా ఎక్కువ మందికి రీచ్‌ అయ్యేలా చూస్తున్నా''నని చెప్పుకొచ్చాడు.
యువతలో పది శాతమన్నా ఇట్లా ఆలోచిస్తే దేశం ఎట్లా మారిపోతుందో!
(అనిల్‌ బత్తుల సోవియట్‌ సాహిత్యం కోసం ఒక బ్లాగ్‌ నడుపుతున్నాడు. దానిపేరు...
sovietbooksintelugu.blogspot.in)
Sunday sopathi, 06 October 2016

వారి అనువాద ప్రజ్ఞ చిరస్మరణీయం

వారి అనువాద ప్రజ్ఞ చిరస్మరణీయం by - కె.పి.అశోక్‌కుమార్‌
----------------------------------------------------------------
[Nava telangana -6 nov 2016]
అక్టోబర్‌ విప్లవం శత వసంతోత్సవాల ఆరంభం గురించి ప్రస్తావించుకోగానే మొదట గుర్తుకొచ్చేది సోవియట్‌ సాహిత్యమే. 'ప్రగతి', 'రాదుగ' ప్రచురణాలయాల నుంచి వెలువడిన అనువాదాల పరంపర తెలుగు సమాజంపై, సాహిత్యంపై చూపిన ప్రభావం అపారమైంది. ఇవాళ సోవియట్‌ రష్యా అంతర్థానమై ఉండొచ్చు. కానీ ఆ అనువాదపు వెలుగుల ప్రభావం ఏదో రూపాన తెలుగు నేలపై నిలిచే వుంది. అనువాదాన్ని ఒక తపస్సుగా నిర్వహించిన ఆయా సృజనశీలుర మహత్తర కృషి అపూర్వమైంది.
ఆ పుస్తకాలు అందుబాటులో లేకపోవచ్చు. వాటిని తిరిగి ముద్రించి వ్యాప్తి చేసే అవకాశాలు వున్నాయి. కనుకనే నాడు సోవియట్‌ సాహిత్యాన్ని, ఇతరేతర రచనల్ని తెలుగులోకి అనువదించిన వారి కృషి స్మరించుకోదగింది.
క్రొవ్విడి లింగరాజు చేసిన గోర్కీ 'అమ్మ' అనువాదం అత్యంత ఉత్తేజపూరిత రచన. ఇక వుప్పల లక్ష్మణరావు, కొండేపూడి లక్ష్మీనారాయణ, రాచమల్లు రామచంద్రారెడ్డి, ఆర్వియార్‌, నిడమర్తి ఉమా రాజేశ్వరరావు, కేశవగోపాల్‌, కొడవటిగంటి కుటుంబరావు, మహీధర, డాక్టర్‌ పరుచూరి రాజారాం వంటి అనేకులు చేసిన అనువాదాలు పాఠకప్రపంచం మీద వేసిన ముద్ర విశేషమైంది.
సోవియట్‌ సాహిత్యాన్ని అనువాదం చేసిన వారిలో వుప్పల లక్ష్మణరావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈయన మాస్కోకు మొదటిసారి 1956లో వెళ్ళారు. అక్కడ లెనిన్‌గ్రాడ్‌లో జరిగిన ఒక సమావేశంలో ఉత్తర భారత భాషా, సంస్కృతుల అధ్యయనానికే సోవియట్‌ విజ్ఞాన పరిషత్‌ పరిమితం కావడాన్ని ప్రశ్నించారు. దక్షిణాది ప్రాంత చరిత్ర, భాష, సంస్కృతుల ఔన్నత్యాన్ని వివరంగా చెప్పారు. తెలుగు భాష ప్రాశస్త్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
దీని ప్రభావం తర్వాత కాలంలో పనిచేసింది. 1967లో మాస్కోలో 'ప్రగతి' ప్రచురణాలయంలోనూ, మాస్కో రేడియోలోనూ తెలుగు భాషను ప్రవేశపెట్టారు. అనువాదాలు చేయించడం, పుస్తకాలు ప్రచురించడం, తెలుగు కార్యక్రమాల ప్రసారాలు వేగం పుంజుకున్నాయి. వుప్పల లక్ష్మణరావు పదమూడేళ్ళు మాస్కోలో ఉన్నారు. మార్క్సిజం, లెనినిజానికి సంబంధించిన సిద్ధాంత గ్రంథాలను చక్కటి తెలుగులోకి అనువదించారు. అలాగే గోర్కీ, గోగోల్‌, టాల్‌స్టారు, చింగీజ్‌ ఐత్‌మాతోవ్‌ లాంటి ప్రసిద్ధ సోవియట్‌ రచయితల రచనల్ని సరళ సుందరమైన రీతిలో తెలుగు చేశారు.
ఈ క్రమాన పట్టుబట్టి రష్యన్‌ భాషను నేర్చుకొని తెలుగు-రష్యన్‌ నిఘంటువును రూపొందించారు. సోవియట్‌ రచనల్ని తెలుగు చేసిన అనువాదకుల్లో వుప్పల లక్ష్మణరావు కృషి ప్రత్యేకమైంది. మనలో చాలామంది ఇష్టపడే జమీల్యా నవలను రసరమ్యరీతిన అనువాదం చేసింది వుప్పల లక్ష్మణరావు గారే. మిహయిల్‌ షోలోకోవ్‌ కథల అనువాదం కూడా వారిదే. ఇక 'నొప్పి డాక్టరు'ను ఆర్వియార్‌ అనువాదం చేశారు.
'యుద్ధం స్త్రీ ప్రకృతికి విరుద్ధం' అనే పుస్తకాన్ని నిడమర్తి ఉమారాజేశ్వరరావు అనువదించారు. అలెక్సీయేవిచ్‌ స్వెత్లానా రచన ఇది. ఈమెకు గత ఏడాది నోబెల్‌ సాహిత్య పురస్కారం లభించింది. ఈ పుస్తకాన్ని 1988లో 'ప్రగతి' ప్రచురణాలయం ముద్రించింది. 1941-45 మధ్యన జరిగిన యుద్ధంలో పాల్గొన్న స్త్రీల పోరాట అనుభవాల్ని, సంవేదనల్ని వ్యక్తం చేసిన గ్రంథమిది. మంగోలుల మహానేత జెంఘిజ్‌ఖాన్‌ గురించి వి.యాన్‌. రాసిన నవలకు ఆర్వియార్‌ చేసిన అనువాదం బావుంది. జెంఘిజ్‌ఖాన్‌ గురించి సమగ్ర అవగాహనని కల్పించే అద్భుత రచన ఇది.
ఇవాన్‌ తుర్గేనెవ్‌ రచించిన 'తండ్రులు కొడుకులు' 330 పేజీలకి పైన ఉన్న నవల.
కొండేపూడి లక్ష్మీనారాయణ అనువాదం చేశారు. చదవడం మొదలుపెట్టాక చివరి పేజీవరకు తన వెంట లాక్కువెళ్ళగలిగే లక్షణం ఉన్న నవల. గోర్కీ వ్యాసాలు, లేఖలు, ఇంటర్వ్యూలతో కూడిన 'స్వర్ణపిశాచి నగరం' అనే పుస్తకాన్ని కూడా లక్ష్మీనారాయణ అందమైన తెలుగులోకి తీసుకొచ్చారు.
నికార్సయిన బంగారం మాత్రమే కాలపు గీటురాయి మీద నిలుస్తుందంటారు. ఈవిధంగా నిలిచే వెలిగే మహారచయిత టాల్‌స్టారు. యుద్ధమూ-శాంతీ, కోసక్కులు, అన్నా కరేనినా, పునరుత్థానం వంటి అద్భుత రచనలు చేసిన టాల్‌స్టారు కలం నుంచి జాలువారిన మరో మహాద్భుత రచన 'విషాద సంగీతం'. దీనికి ఆర్వియార్‌ చేసిన అనువాదం చదివి అబ్బురపడతాం. ఇది కూడా మూడు వందల పేజీలకు పైగా ఉన్న పుస్తకం. విషాద సంగీతంతో పాటు విందునాట్యం తర్వాత మరికొన్ని గొప్ప కథలున్నాయి. ఈ పుస్తకం చదవడమే గొప్ప అనుభవం. శతాధిక గ్రంథకర్తగా పేరొందిన ఆర్వియార్‌ పేరిట ఒక అనువాద పురస్కారాన్ని 'విశాలాంధ్ర' ఏర్పాటు చేస్తే బావుంటుంది.
అన్నా కరేనినా తర్వాత చాలా బాగా నచ్చిన పుస్తకం 'విషాద సంగీతం'. ''టాల్‌స్టారుకి సొంత, విశిష్ట వైలక్షణ్యం వుంది. మరెవ్వరూ మానవ అంతరంగపు లోతుల్లోకి యింత గాఢంగా చొచ్చుకు పోలేదు. యింత విస్తారంగా విశ్లేషించలేదు'' అని సోవియట్‌ సాహిత్య విమర్శకుడు ద్మిత్రీ పీసరెవ్‌ అంటారు. ఇది అక్షరాలా నిజం. అందువల్లనే రష్యన్‌ సాహిత్యంలో టాల్‌స్టారు అత్యధికులకు ప్రీతిపాత్రుడైన రచయిత.
ఆర్మీనియన్‌ కథల సంకలనం 'కొండగాలీ కొత్త జీవితం' మరో ఆకర్షణీయమైన పొత్తం. నిడమర్తి ఉమా రాజేశ్వరరావు, కేశవగోపాల్‌ అనువాదమిది. 1979లో వచ్చిన ఈ సంకలనంలోని కథలు ఇప్పటికీ ఎంతో తాజాగా కనిపిస్తాయి. మానవుల భావోద్వేగాల్ని సృజించడంలో ఆయా రచయితలు చూపిన ప్రజ్ఞ అనూహ్యమైంది. కథలు రచించేవారు మరల మరల చదవదగ్గ మంచి పుస్తకమిది.
రష్యన్‌ సాహిత్యంలో చెప్పుకోదగ్గ మరో మంచి నవల 'మన కాలం వీరుడు'. లేర్మంతోవ్‌ రచించిన ఈ నవలకి ఆర్వియార్‌ చేసిన అనువాదం రసరమ్యమైంది. వాస్తవికతకు దర్పణం పట్టే గొప్ప నవలగా అభివర్ణిస్తారు ఆర్వియార్‌. అంతేగాక రష్యన్‌ సాహిత్యంలో తొలి గొప్ప మనో విశ్లేషణాత్మక నవల కావడం విశేషం. సకల యూరోపియన్‌ భాషల్లోకి అనువాదమైన ఈ నవల ప్రపంచ సాహిత్యంలోనే ఉత్తమ కళాఖండంగా పేరొందింది.
సోవియట్‌ సాహిత్య అనువాదాల్లో వచనానికే అధిక ప్రాధాన్యం. కవిత్వ అనువాదాలు చాలా అరుదు. ఆ అరుదైన వాటిలో ఆణిముత్యం మయకోవ్‌స్కీ రచించిన 'లెనిన్‌' కావ్యానికి శ్రీశ్రీ చేసిన అనువాదం. దీనిని 1924లో మయకోవ్‌స్కీ రచించారు. రష్యన్‌ విప్లవంపై వచ్చిన అరుదైన ఆధునిక కావ్యం ఇది. ఈ కావ్యాన్ని చదువుతుంటే ఓ మహౌద్వేగానికి లోనవుతాం. అంతటి శక్తి, వైశిష్ట్యం ఈ కావ్యానికి వుంది. ఈ అనువాదం శ్రీశ్రీ ప్రతిభను మరోసారి లోకానికి చాటింది. ఇలాంటి కావ్యాల్ని అప్పుడప్పుడు చదవాలి. ముఖ్యంగా కవిత్వం రాసేవారు పఠించదగ్గ గొప్ప కావ్యమిది.
దోస్త్‌యేవస్కీ రచించిన 'నేరము-శిక్ష', 'పేదజనం శ్వేతరాత్రులు' వంటి పుస్తకాల్లోని సృజనశక్తి అనుపమానమైంది. తల్లీ భూదేవి, గులాబీ మేఘాలు, తొలి ఉపాధ్యాయుడు, మానవుడే మహాశక్తి సంపన్నుడు వంటి రచనల ప్రాశస్త్యం చెప్పనలవి కానిది. అలాగే బాలసాహిత్యం ఎంతో ఉత్తేజపూరితంగా ఉండేది. ఈవిధంగా సోవియట్‌ సాహిత్యంలోని ప్రతి పుస్తకం పాఠకుల్ని ఉద్దీపింపజేస్తుంది.
పెట్టుబడిదారీ అర్థశాస్త్రం పుస్తకాన్ని రాచమల్లు రామచంద్రారెడ్డి అనువదించారు. ఆర్థికశాస్త్రానికి సంబంధించి వారు సృజించిన పరిభాష రాజకీయ, ఆర్థిక శాస్త్ర గ్రంథాల అనువాదానికి ఒక ఒరవడి పెట్టింది. కాగా, నిత్యజీవితంలో భౌతికశాస్త్రం రెండు భాగాలను కొడవటిగంటి కుటుంబరావు అనువదించారు. దాదాపు ఆరు వందల పేజీల గ్రంథమిది. అలాగే మానవ శరీర నిర్మాణ శాస్త్రం, శరీర ధర్మశాస్త్రం అనే గ్రంథాన్ని డాక్టర్‌ పరుచూరి రాజారాం అనువదించారు. ఇది ప్రతి ఇంటా ఉండాల్సిన పుస్తకం. ఇందులోని భాష కూడా సులభగ్రాహ్యంగా ఉంటుంది.
సాహిత్యమే గాక విద్యా, వైద్య, శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన పుస్తకాలు ఎన్నో రష్యన్‌ భాషలోంచి అనువాదమై తెలుగు నేలపై విజ్ఞానకాంతుల్ని ప్రసరింపజేశాయి. ఇందుకు దోహదం చేసిన అనువాదకుల్ని సదా స్మరించుకోడం మన బాధ్యత.
సోవియట్‌ సాహిత్యం చదవడం వల్ల మన భాష కూడా మెరుగవుతుంది. తెలుగు భాషలోని అందచందాల్ని రమణీయమైన రీతిలో వాడుకున్నారు అనువాదకులు. అందువల్లనే సాహిత్యరంగంలో, మీడియాలో పనిచేస్తున్నవారు సోవియట్‌ సాహిత్యాన్ని ప్రత్యేకించి చదవాలి. అనువాదంలో సరళ సుందరమైన శైలిని సంతరించుకోడానికి కూడా సోవియట్‌ సాహిత్యం చదవడం ఉపకరిస్తుంది. ఒకతరం తెలుగువారు సమాదరించిన సోవియట్‌ సాహిత్యాన్ని చదవడం ఈతరం తెలుగు పాఠకులకు చక్కని అనుభవం.హృదయ సంస్కారం - సోవియట్‌ సాహిత్యం

 Sunday Editorial, Navatelangana, 06 October 2016 by Gudipati Venkat
హృదయ సంస్కారం - సోవియట్‌ సాహిత్యం
--------------------------------------------------
అనువాద రచనల్లో సోవియట్‌ సాహిత్యమంత విస్తారంగా మరే దేశ సాహిత్యమూ తెలుగువారిని ప్రభావితం చేయలేదు. ఇది జీవితాన్ని ప్రేమించే లక్షణాన్నిచ్చింది. మనుషుల్ని దయతో చూడటం అలవరిచింది. అణచివేతపై ధిక్కారాన్ని ప్రకటించే శక్తిని ఇచ్చింది. ఆత్మగౌరవంతో జీవించే స్పృహను కల్పించింది. స్త్రీ పురుష సంబంధాల్ని సరయిన రీతిలో అర్థం చేసుకోడం నేర్పింది. పరిస్థితుల ప్రాబల్యం మనుషుల్ని ఒక తీవ్రత నుంచి మరో తీవ్రతలోకి ఎలా నడిపిస్తుందో తెలియజెప్పింది. పతితుల, బాధాసర్పద్రష్టుల పట్ల మానవీయంగా వ్యవహరించే మేలిమి గుణాన్ని సంతరింపజేసింది. అన్నిటికీ మించి హృదయ సంస్కారాన్ని ప్రోది చేసింది.
1990 వరకు సోవియట్‌ సాహిత్యం తెలుగు సాహితీ ప్రపంచాన్ని, పాఠకలోకాన్ని ఒక ఊపు ఊపింది. ఒక పుస్తకం చదివాక మరో పుస్తకం చదవాలనే ఉత్సాహాన్ని ఇచ్చింది. పిల్లల కోసం వచ్చే సోవియట్‌ పుస్తకాల్ని పెద్దలు కూడా పరమ ఇష్టంగా చదివిన రోజులవి. చిన్నకథలో ఎన్నో పెద్ద సంగతుల్ని సునాయసంగా బోధపరిచే సుగుణం వాటిలో ఇమిడి వుండేది.
ఏదో నేర్చుకోడం కోసమో, విజ్ఞానం కోసమో చదవం. ఇష్టంతో చదువుతాం. ఆనందం కోసం చదువుతాం. అయితే ఆ చదువు తెలియకుండానే మన సంస్కారంలో భాగమవుతుంది. పుస్తకాల్లో నిక్షిప్తమైన భావాలు మనసున ముద్రించుకుపోతాయి. ఆలోచనల దశనీ దిశనీ తెలియకనే వాటికనుగుణంగా నడిపిస్తాయి. సోవియట్‌ సాహిత్యం సరిగ్గా ఇదే పనిచేసింది. సులభమైన శైలిలో ఉండటం వల్ల సోవియట్‌ సాహిత్యాన్ని చదివేవాళ్ళం. ఈ క్రమాన మనుషుల్ని అర్థం చేసుకోడం తెలిసింది. శ్రమజీవుల్నీ, వారి శ్రమనీ గౌరవంగా చూడటమనేది యాదృచ్ఛికంగానే అలవడింది.
పదుగురి నెత్తి గొట్టి పైకి ఎగబాకడమే విజయంగా భావించే ధోరణుల్ని ఇప్పటి 'వ్యక్తిత్వవికాసం' పుస్తకాలు చెబుతున్నాయి. కానీ అప్పట్లో మనమే కాదు, మన చుట్టూ ఉన్నవారు హాయిగా ఉండాలని కోరుకునే లక్షణం సోవియట్‌ సాహిత్యం వల్ల అబ్బింది. డబ్బుని బట్టి, హోదాల్ని బట్టి మనుషుల్ని చూసే ధోరణి ఇవాళ వుంది.
దీనికి భిన్నంగా మనుషుల్ని మనుషులుగా చూసే స్వభావాన్ని సోవియట్‌ సాహిత్యం అలవరిచింది. టాల్‌స్టారు సాహిత్యమంతా చెప్పింది ఇదే కదా! ఆయన రాసిన కథలు, నవలలు, వ్యాసాలు మానవీయ గుణాన్ని పెంపొందిస్తాయి. పిచ్చివాని జ్ఞాపకాలు (కథలు), అన్నా కెరినీనా, యుద్ధం-శాంతి నవలలు చదివినా, జీవితం-మతం గురించి రాసిన వ్యాసాలు చదివినా జీవితంపైన, మానవ ప్రపంచంపైన తెలియని మమత కలుగుతుంది.
శతాబ్దాలుగా వివక్ష, అణచివేతల కారణంగా అణగారిపోతున్న మహిళల పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలో సోవియట్‌ సాహిత్యం చెప్పకనే చెప్పింది. గోర్కీ 'అమ్మ', అలెగ్జాండర్‌ కుప్రిన్‌ 'రాళ్ళవంకీ', చింగీజ్‌ ఐత్‌మావ్‌ 'జమీల్యా' వంటి రచనలు చదివితే ఆడవాళ్ళపై అపార గౌరవం కలుగుతుంది. ప్రేమ భావనని సున్నితంగా అభివ్యక్తీకరించిన ఈ రచయితల సంవిధానం నుంచి తెలుగు రచయితలు ఎంతో నేర్చుకోవాలి. నిజానికి సోవియట్‌ రచయితల ప్రభావం తెలుగు సాహిత్యకారులపై అనేకవిధాలుగా వుంది. మన సాహిత్యంలో సోషలిస్టు వాస్తవికతకు పట్టం గట్టడానికి మూలం సోవియట్‌ సాహిత్య ప్రభావమే. సోవియట్‌ పుస్తకాల ప్రభావంతోనే ఎందరో కమ్యూనిస్టులయ్యారనే మాట వాస్తవం.
మన సమాజంలో మత ఛాందసవాదం, మతోన్మాదం గురించి 1990 తర్వాతనే ఎక్కువగా మాట్లాడుతున్నాం. లౌకికవాదం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకుంటున్నాం. నాడు దేవుణ్ణి నమ్మినా, పూజలు చేసినా వ్యక్తిగతానికే పరిమితం. మతమౌఢ్యానికి తావు లేకుండా వ్యవహరించే నైజం ఉండేది. ఎప్పుడయితే సోవియట్‌ రష్యా కుప్పకూలిందో, ఆ సాహిత్య వ్యాప్తి తగ్గుముఖం పట్టడం ప్రారంభించిందో అప్పట్నించి సమాజంలోనూ క్షీణ విలువలు పైచేయి సాధించాయి. అందువల్లనే మతోన్మాదం పెచ్చరిల్లింది. మైనారిటీల మీద వివక్ష పెరిగింది.
సమాజాన్ని సరైన దిశలో నడిపించే ఉత్తమ సాహిత్యం తన ప్రాభవాన్ని కోల్పోతే వాటిల్లే విపరిణామాలని తెలుగు సమాజం అనుభవిస్తోంది. ఈ కోణంలోంచి చూసినప్పుడు సోవియట్‌ సాహిత్యం మనకు దూరం కావడం వల్ల జరిగిన నష్టం ఏమిటో బోధపడుతుంది.
సోవియట్‌ సాహిత్యం చదివే క్రమాన రాజకీయాలకు అతీతంగా సాహిత్యం ఉంటుందనే భావనలకు చోటు లేదు. సామ్రాజ్యవాదాన్ని కరాఖండీగా వ్యతిరేకించే భావజాలం బలీయంగా ఉండేది. కవులు, రచయితల్లోనే కాదు సమాజంలోనే అమెరికా వల్ల సంభవించే ఉపద్రవం పట్ల వ్యతిరేకత ప్రబలి ఉండేది. అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించే చైతన్యం ప్రదీప్తమై అలరారుతుండేది. ఇందుకు భిన్నంగా అమెరికాలోని 'స్వేచ్ఛాజీవనం' గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ప్రపంచీకరణ సౌలభ్యాల గురించి మురిసిపోతున్నారు. లేదంటే తమ చుట్టూరా కనిపించే వివక్ష, అణచివేతలపై లోపాయికారీగా మౌనం వహిస్తున్నారు.
ఇప్పటి పరిణామాల సంగతి ఎలా ఉన్నా, ఒకానొక దశలో అక్టోబర్‌ విప్లవ నేపథ్యంలో వచ్చిన సోవియట్‌ సాహిత్య ప్రభావం అనేక పార్శ్వాలలో అల్లుకుపోయింది. కుటుంబ జీవనంలో విలువలకు పెద్దపీట వేసింది. ఆడపిల్లల్ని చదివించడం, ఇంటా బయటా ఆడవారిని సమానంగా చూడటం నేర్పింది. ప్రజలకోసం పోరాడే వారికి అండగా నిలిచే చైతన్యాన్ని ఇచ్చింది. ఎందరినో పోరాటమార్గంలోకి నడిపించింది. సాహిత్యం హృదయ సంస్కారానికి దోహదం చేయాలనే లక్ష్యాన్ని సాకారం చేసింది. అందుకే సోవియట్‌ సాహిత్య అధ్యయనం ఈ తరానికీ తప్పనిసరి.

Gogol "Over coat" book release - 4 Nov 2018

నికొలాయ్ గొగోల్ - ఓవర్ కోట్ : అకాకి అకాకియెవిచ్ నూట డెబ్బైయారు సంవత్సరాలక్రితం గొగోల్ కలం నుంచి పుట్టాడు. జార్ చక్రవర్తుల భూస్వామ్య వ్యవస్థ...