Monday 7 November 2016

హృదయ సంస్కారం - సోవియట్‌ సాహిత్యం

 Sunday Editorial, Navatelangana, 06 October 2016 by Gudipati Venkat
హృదయ సంస్కారం - సోవియట్‌ సాహిత్యం
--------------------------------------------------
అనువాద రచనల్లో సోవియట్‌ సాహిత్యమంత విస్తారంగా మరే దేశ సాహిత్యమూ తెలుగువారిని ప్రభావితం చేయలేదు. ఇది జీవితాన్ని ప్రేమించే లక్షణాన్నిచ్చింది. మనుషుల్ని దయతో చూడటం అలవరిచింది. అణచివేతపై ధిక్కారాన్ని ప్రకటించే శక్తిని ఇచ్చింది. ఆత్మగౌరవంతో జీవించే స్పృహను కల్పించింది. స్త్రీ పురుష సంబంధాల్ని సరయిన రీతిలో అర్థం చేసుకోడం నేర్పింది. పరిస్థితుల ప్రాబల్యం మనుషుల్ని ఒక తీవ్రత నుంచి మరో తీవ్రతలోకి ఎలా నడిపిస్తుందో తెలియజెప్పింది. పతితుల, బాధాసర్పద్రష్టుల పట్ల మానవీయంగా వ్యవహరించే మేలిమి గుణాన్ని సంతరింపజేసింది. అన్నిటికీ మించి హృదయ సంస్కారాన్ని ప్రోది చేసింది.
1990 వరకు సోవియట్‌ సాహిత్యం తెలుగు సాహితీ ప్రపంచాన్ని, పాఠకలోకాన్ని ఒక ఊపు ఊపింది. ఒక పుస్తకం చదివాక మరో పుస్తకం చదవాలనే ఉత్సాహాన్ని ఇచ్చింది. పిల్లల కోసం వచ్చే సోవియట్‌ పుస్తకాల్ని పెద్దలు కూడా పరమ ఇష్టంగా చదివిన రోజులవి. చిన్నకథలో ఎన్నో పెద్ద సంగతుల్ని సునాయసంగా బోధపరిచే సుగుణం వాటిలో ఇమిడి వుండేది.
ఏదో నేర్చుకోడం కోసమో, విజ్ఞానం కోసమో చదవం. ఇష్టంతో చదువుతాం. ఆనందం కోసం చదువుతాం. అయితే ఆ చదువు తెలియకుండానే మన సంస్కారంలో భాగమవుతుంది. పుస్తకాల్లో నిక్షిప్తమైన భావాలు మనసున ముద్రించుకుపోతాయి. ఆలోచనల దశనీ దిశనీ తెలియకనే వాటికనుగుణంగా నడిపిస్తాయి. సోవియట్‌ సాహిత్యం సరిగ్గా ఇదే పనిచేసింది. సులభమైన శైలిలో ఉండటం వల్ల సోవియట్‌ సాహిత్యాన్ని చదివేవాళ్ళం. ఈ క్రమాన మనుషుల్ని అర్థం చేసుకోడం తెలిసింది. శ్రమజీవుల్నీ, వారి శ్రమనీ గౌరవంగా చూడటమనేది యాదృచ్ఛికంగానే అలవడింది.
పదుగురి నెత్తి గొట్టి పైకి ఎగబాకడమే విజయంగా భావించే ధోరణుల్ని ఇప్పటి 'వ్యక్తిత్వవికాసం' పుస్తకాలు చెబుతున్నాయి. కానీ అప్పట్లో మనమే కాదు, మన చుట్టూ ఉన్నవారు హాయిగా ఉండాలని కోరుకునే లక్షణం సోవియట్‌ సాహిత్యం వల్ల అబ్బింది. డబ్బుని బట్టి, హోదాల్ని బట్టి మనుషుల్ని చూసే ధోరణి ఇవాళ వుంది.
దీనికి భిన్నంగా మనుషుల్ని మనుషులుగా చూసే స్వభావాన్ని సోవియట్‌ సాహిత్యం అలవరిచింది. టాల్‌స్టారు సాహిత్యమంతా చెప్పింది ఇదే కదా! ఆయన రాసిన కథలు, నవలలు, వ్యాసాలు మానవీయ గుణాన్ని పెంపొందిస్తాయి. పిచ్చివాని జ్ఞాపకాలు (కథలు), అన్నా కెరినీనా, యుద్ధం-శాంతి నవలలు చదివినా, జీవితం-మతం గురించి రాసిన వ్యాసాలు చదివినా జీవితంపైన, మానవ ప్రపంచంపైన తెలియని మమత కలుగుతుంది.
శతాబ్దాలుగా వివక్ష, అణచివేతల కారణంగా అణగారిపోతున్న మహిళల పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలో సోవియట్‌ సాహిత్యం చెప్పకనే చెప్పింది. గోర్కీ 'అమ్మ', అలెగ్జాండర్‌ కుప్రిన్‌ 'రాళ్ళవంకీ', చింగీజ్‌ ఐత్‌మావ్‌ 'జమీల్యా' వంటి రచనలు చదివితే ఆడవాళ్ళపై అపార గౌరవం కలుగుతుంది. ప్రేమ భావనని సున్నితంగా అభివ్యక్తీకరించిన ఈ రచయితల సంవిధానం నుంచి తెలుగు రచయితలు ఎంతో నేర్చుకోవాలి. నిజానికి సోవియట్‌ రచయితల ప్రభావం తెలుగు సాహిత్యకారులపై అనేకవిధాలుగా వుంది. మన సాహిత్యంలో సోషలిస్టు వాస్తవికతకు పట్టం గట్టడానికి మూలం సోవియట్‌ సాహిత్య ప్రభావమే. సోవియట్‌ పుస్తకాల ప్రభావంతోనే ఎందరో కమ్యూనిస్టులయ్యారనే మాట వాస్తవం.
మన సమాజంలో మత ఛాందసవాదం, మతోన్మాదం గురించి 1990 తర్వాతనే ఎక్కువగా మాట్లాడుతున్నాం. లౌకికవాదం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకుంటున్నాం. నాడు దేవుణ్ణి నమ్మినా, పూజలు చేసినా వ్యక్తిగతానికే పరిమితం. మతమౌఢ్యానికి తావు లేకుండా వ్యవహరించే నైజం ఉండేది. ఎప్పుడయితే సోవియట్‌ రష్యా కుప్పకూలిందో, ఆ సాహిత్య వ్యాప్తి తగ్గుముఖం పట్టడం ప్రారంభించిందో అప్పట్నించి సమాజంలోనూ క్షీణ విలువలు పైచేయి సాధించాయి. అందువల్లనే మతోన్మాదం పెచ్చరిల్లింది. మైనారిటీల మీద వివక్ష పెరిగింది.
సమాజాన్ని సరైన దిశలో నడిపించే ఉత్తమ సాహిత్యం తన ప్రాభవాన్ని కోల్పోతే వాటిల్లే విపరిణామాలని తెలుగు సమాజం అనుభవిస్తోంది. ఈ కోణంలోంచి చూసినప్పుడు సోవియట్‌ సాహిత్యం మనకు దూరం కావడం వల్ల జరిగిన నష్టం ఏమిటో బోధపడుతుంది.
సోవియట్‌ సాహిత్యం చదివే క్రమాన రాజకీయాలకు అతీతంగా సాహిత్యం ఉంటుందనే భావనలకు చోటు లేదు. సామ్రాజ్యవాదాన్ని కరాఖండీగా వ్యతిరేకించే భావజాలం బలీయంగా ఉండేది. కవులు, రచయితల్లోనే కాదు సమాజంలోనే అమెరికా వల్ల సంభవించే ఉపద్రవం పట్ల వ్యతిరేకత ప్రబలి ఉండేది. అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించే చైతన్యం ప్రదీప్తమై అలరారుతుండేది. ఇందుకు భిన్నంగా అమెరికాలోని 'స్వేచ్ఛాజీవనం' గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ప్రపంచీకరణ సౌలభ్యాల గురించి మురిసిపోతున్నారు. లేదంటే తమ చుట్టూరా కనిపించే వివక్ష, అణచివేతలపై లోపాయికారీగా మౌనం వహిస్తున్నారు.
ఇప్పటి పరిణామాల సంగతి ఎలా ఉన్నా, ఒకానొక దశలో అక్టోబర్‌ విప్లవ నేపథ్యంలో వచ్చిన సోవియట్‌ సాహిత్య ప్రభావం అనేక పార్శ్వాలలో అల్లుకుపోయింది. కుటుంబ జీవనంలో విలువలకు పెద్దపీట వేసింది. ఆడపిల్లల్ని చదివించడం, ఇంటా బయటా ఆడవారిని సమానంగా చూడటం నేర్పింది. ప్రజలకోసం పోరాడే వారికి అండగా నిలిచే చైతన్యాన్ని ఇచ్చింది. ఎందరినో పోరాటమార్గంలోకి నడిపించింది. సాహిత్యం హృదయ సంస్కారానికి దోహదం చేయాలనే లక్ష్యాన్ని సాకారం చేసింది. అందుకే సోవియట్‌ సాహిత్య అధ్యయనం ఈ తరానికీ తప్పనిసరి.

సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్

 సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్   ప్రగతి ప్రచురణాలయం, మాస్కో, యూ.యస్.యస్.ఆర్, తెలుగు విభాగపు మాజీ అధిపతి ***...