Thursday 24 August 2023

సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్

 సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు

- స్వేత్లానా ద్జేంత్

  ప్రగతి ప్రచురణాలయం, మాస్కో, యూ.యస్.యస్.ఆర్, తెలుగు విభాగపు మాజీ అధిపతి

***

ప్రగతి ప్రచురణాలయంలో (పూర్వం విదేశీ భాషా ప్రచురణాలయం) తెలుగు విభాగం 1956 డిసెంబర్లో ప్రారంభం అయింది. అప్పటికే నేను ప్రచురణాలయపు ఇంగ్లిష్ విభాగంలో పని చేస్తున్నాను. 1953 నుంచి హిందీ, ఉర్దూ, బెంగాలీ భాషల్లో పుస్తకాల ప్రచురణ మొదలైంది. తెలుగు గాని, తమిళం గాని నేర్చుకొమ్మని నన్నడిగినప్పుడు "ఆ భాష మాతృభాష అయినవారు ఇక్కడ ఎవరున్నారు" అని నేనడిగాను. నా ఎంపికకి కారణం ఇది.

డిసెంబర్ 1956లో మేం ముగ్గురం కొలచల సీతారామయ్య గారి స్నేహం చేసుకున్నాం. ఆయన రసాయన శాస్త్రంలో పేరున్న శాస్త్రవేత్త. అమెరికాలో పి.హెచ్.డి. చేసిన తర్వాత సోషలిజం నిర్మించడంలో పాల్గొనేందుకు ఆయన 1923లో సోవియట్ యూనియన్ కి వచ్చారు. 40 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చినప్పుడు మాతృభూమి ఆయనకి సాదరంగా స్వాగతం చెప్పింది. ఆయన మాకు ఆదివారాల్లో రెండు, మూడు గంటలు తెలుగు బోధించేవారు. మిగతా సమయంలో మేం స్వయంగా నేర్చుకొనేవాళ్లం. 20వ శతాబ్దం ప్రారంభంలో ప్రచురణ అయిన ఆర్డ్న్ 'తెలుగు వ్యాకరణం', శంకరనారాయణ 'తెలుగు ఇంగ్లిష్ నిఘంటువు' మా లైబ్రరీలో ఉండేవి. అప్పట్లో మాకు ఏ ఇతర తెలుగు పుస్తకాలు అందుబాటులో లేవు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ గురించి తెలియదు. ఒక్క నవల మాత్రం మాకు అందుబాటులో ఉండేది. దానిని ఉపయోగించుకున్నాం.

.

గిడుతూరి సూర్యం, జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి (విజయవాడలో అధ్యాపకుడు) 1957 డిసెంబర్(చాలా ఎక్కువ చలి ఉండే నెల)లో వచ్చారు. గిడుతూరి సూర్యం కవిత్వం బాగా అనువాదం చేయగలరు. సుతయేవ్ రచించిన "ఎవరు మ్యాన్ అన్నారు?" మేం ప్రచురించిన మొదటి తెలుగు పుస్తకం. తర్వాత, మరికొన్ని పిల్లలు పుస్తకాలని ప్రచురించాం. నాకు తెలిసినంతలో అవి ఆంధ్రప్రదేశ్ లో ఆదరణ పొందాయి. ఇద్దరు అనువాదకులకీ కూడా సాహిత్యం, రాజకీయాలు అలవాటు లేని కొత్త విషయాలు. రెండేళ్లలో ఇద్దరూ తిరిగి వెళ్లిపోయారు. 1958లో మా అనువాదకునిగా పని చేయడానికి వుప్పల లక్ష్మణరావు గారిని సీతారామయ్య గారు ఆహ్వానించారు. అప్పట్లో లక్ష్మణరావు జర్మనీలో ఉన్నారు. ఆయన దాదాపు 12 ఏళ్లు మాతో ఎంతో పని చేశారు. ఆయన మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ల రచనలే కాక ఎన్నో నవలల్నీ కథల్నీ అనువదించారు. అప్పట్లో మా తెలుగు పాఠకుల అభిరుచుల గురించి మాకు ఏమీ తెలియదు. ఈ కారణం వల్ల బహుశా కొన్ని ప్రచురణలు వారికి రుచించి ఉండకపోవచ్చును. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ తో మాకు సంబంధాలు, వ్యాపార భాగస్వామ్యం 1969ల నుంచి ఏర్పడినాయి. వుప్పల లక్ష్మణరావు మాతో 1970 వరకు పని చేశారు. ఈ 12 ఏళ్లలో అనువాదాలు చేయడంతో బాటు ఆయన మాకు తెలుగు నేర్చారు. తెలుగు సాహిత్యాన్ని గురించిన తన జ్ఞానాన్ని మాకు పంచి పెట్టారు. మాస్కోలో చదువుకొంటున్న తెలుగు విద్యార్థుల్ని, మాస్కో వచ్చే తెలుగు అతిధులని మాకు పరిచయం చేసేవారు. ఉగాది వంటి పండుగలు జరుపుకోవడానికి మమ్మల్ని పిలిచేవారు. మాస్కోలో చదువుకొంటున్న తెలుగు విద్యార్థులు మాకు చాలా సహాయపడే వారు, వారిలో ముఖ్యంగా చట్టి శ్రీనివాసరావు పేరును జ్ఞాపకం చేసుకొంటున్నాను. మాస్కోలో వుప్పల లక్ష్మణరావు గారి భార్య మిల్లీ సోలింగర్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం విషాదసంఘటన ఐనా ఆయన తిరిగి వెళ్లిపోకుండా 1970 దాకా మాతో పనిచేస్తూనే ఉన్నారు. భారతదేశానికి తిరిగి చేరాక ఆయన తన సృజనాత్మక కృషి కొనసాగించి 'మా మెల్లీ','బతుకు పుస్తకం', 'గెరిల్లా' లాంటి రచనలు చేశారు. స్థానిక సాహితీ సంస్థ (మనం మనం బరంపురం) కి అధ్యక్షులుగా ఉన్నారు. నేను ఆయనతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేదాన్ని. 1976 లో భారతదేశానికి వచ్చినప్పుడు బరంపురం వెళ్లి ఆయనని చూసి వచ్చాను.

.

1969లో నేను తొలిసారి భారతదేశానికి వచ్చినప్పుడు ప్రొద్దుటూరులో రారా (రాచమల్లు రామచంద్రారెడ్డి) గారిని కలుసుకున్నాను. ఆయన రచయిత, విమర్శకుడు, 'సంవేదన' పత్రిక ప్రచురణకర్త, సంపాదకుడు. రారా మాస్కో రావడానికి అంగీకరించారు. 1970లో మాస్కోలో వారికి స్వాగతం చెప్పాము. ఆయన 1974 వరకు మా ప్రచురణాలయంలో పని చేశారు. ఆయన మాకు తెలుగు కూడా నేర్పేవారు. అప్పటికి మాకు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ నుంచి చాలా తెలుగు పుస్తకాలు రాసాగాయి. తెలుగు రచయితల కథలని మేం రష్యన్లోకి అనువదించనారంభించాము. ఈ పనిలో కూడా మాకు మా అనువాదకుల సహాయం లభించేది. మాకు విశాలాంధ్ర దినపత్రిక కూడా 1963 నుంచి రావడంతో దానిని చదవసాగాము. ఆంధ్రప్రదేశ్లో సంఘటనల గురించి తెలుసుకొనే సదవకాశం మాకు లభించింది. 

.

విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చొరవ కారణంగా కొండేపూడి లక్ష్మీనారాయణ, నిడమర్తి ఉమారాజేశ్వరరావు మా అనువాదకులుగా పని చేయడానికి 1974లో మాస్కోకి వచ్చారు. ఇద్దరూ అనుభవం ఉన్న అనువాదకులే. కొండేపూడి లక్ష్మినారాయణ రచయితా, అనువాదకులు. జీవితంలో ఎక్కువ భాగాన్ని అనువాదాలు చేయడానికి ముందు ఆయనకి సోవియట్ భూమితో సహా వివిధ పత్రికలలో పనిచేసిన అనుభవం ఉన్నది. మాస్కోలో ఆయన మార్క్స్, లెనిన్, గోర్కీ, తుర్గెనీవ్ ల రచనలని అనువదించారు. ఆ రోజుల్లో 'రష్యన్ - తెలుగు నిఘంటువు' పనిని ప్రారంభించాను. కొండేపూడి ఎంతో చురుకుగా దీని సంపాదకుడిగా కృషి చేశారు. తరచు వారి ఇంటికి వెళ్లేవాళ్లం. ఆయన భార్య రాధ మమ్మల్ని అప్యాయంగా ఆహ్వానించి తెలుగు భోజనం పెట్టేవారు. ఆయన ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమె ఆయనకి చాలా సేవ చేసేవారు. లక్ష్మీనారాయణ 1975లో తిరిగి వెళ్లిపోయారు. కాని ఈ తర్వాత చివరిక్షణం దాకా పనిచేశారు. తమిళకవి సుబ్రహ్మణ్య భారతి, బ్రెక్ట్ ల రచనలు అనువదించారు. నేను కొన్నాళ్లపాటు ఆయనకీ, రాధ గారికి ఉత్తరాలు రాసేదాన్ని.

.

నిడమర్తి ఉమారాజేశ్వరరావు ప్రగతి ప్రచుణాలయంలో 12 ఏళ్లకి పైగా పనిచేశారు. ప్రచురణాలయం మూతపడి ఉండకపోతే నిస్సందేహంగా ఆయన మరికొంత కాలం పని చేసేవారు. ఆయన సుమారు 60 పుస్తకాలు అనువదించారు. నాతో బాటు 'రష్యన్ తెలుగు నిఘంటువు' నిర్మాణంలో పాలుపంచుకొని దానికి సంపాదకుడుగా కూడా ఉన్నారు. భారతదేశానికి తిరిగి వెళ్లాక ఆయన బెంగళూరులో స్థిరపడి వివిధ పత్రికలకి వ్యాసాలు రాస్తూ వచ్చారు. 2010లో మరణించాడు. 

.

ఉమారాజేశ్వరరావు తర్వాత కొన్నాళ్లకి ఆర్వీయార్ మాస్కో వచ్చారు. ఆయన పిల్లలు పుస్తకాలని, సృజనాత్మక సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించాడు. ఆయన అనువాదాలలో అలెక్సేయెవ్ రచన 'రష్యన్ చరిత్ర, కథలూ గాథలూ' (1887) బాగా అమ్ముడైంది. ఇది అక్టోబరు విప్లవ 70వ వార్షికోత్సవమూ, భారతదేశ 40వ స్వాతంత్రోత్సవాలని పురస్కరించుకొని జరిగిన భారత సోవియట్ సాంస్కృతికోత్సవ తరుణంలో ప్రచురణ అయింది. 1980లో 'ప్రగతి ప్రచురణాలయం' రెండుగా అంటే రాదుగ, ప్రగతి ప్రచురణ సంస్థలుగా విభజన అయింది. 'ప్రగతి ప్రచురణాలయం' రాజకీయ సామాజికశాస్త్ర గ్రంథాలను ప్రచురణ కొనసాగించింది. 'రాదుగా ప్రచురణాలయం' పిల్లల పుస్తకాలు, సృజనాత్మక సాహిత్య అనువాదాల ప్రచురణ చేసింది.  ఆర్వీయార్ రాదుగకి వెళ్లారు. మా గ్రూపు కూడా విభజన అయి ముగ్గురు రాదుగలోనూ పనిచేయసాగాం. ఉమారాజేశ్వరరావు 1991లో ప్రగతి ప్రచురణాలయం మూతపడేవరకు ఉన్నారు. రాదుగ మరి రెండు మూడు సంవత్సరాలు కొనసాగింది. మాస్కోలో ఉండి మా అనువాదకులందరగా చేసిన కృషి తెలుగు పాఠకుల మధ్య స్నేహ సంబంధాలు ఏర్పడడానికి నిలబడడానికి ఎంతగానో సహాయపడింది. తెలుగువారి జీవితం, సంప్రదాయాలు, పండుగలు, ఆహారపుటలవాట్ల గురించి మాకు తెలియజేస్తూ ఎన్నో విధాల వీరు మాకు ఉపాధ్యాయులుగా ఉన్నారు.

.

నాతోటి ఉద్యోగుల గురించి..

***

1964 కి పూర్వం సోవియట్ యూనియన్ లో తెలుగు అధ్యాపన లేదు. మాస్కో సెయింట్ పీటర్స్ బర్గ్ (1991కి పూర్వం దీనిపేరు లెనిన్ గ్రాడ్)లలో హిందీ, ఉర్దూ, బెంగాలీ భాషల అధ్యాపన అధ్యయనం చాలా కాలం నుంచి ఉన్నాయి. అందువల్ల ప్రగతి ప్రచురణాలయంలో నాతోటి ఉద్యోగులు తెలుగు స్వయంగా నేర్చుకొన్నారు. హైస్కూల్ చదువు పూర్తి చేసిన వారిని మేం ఆహ్వానించాం. వాళ్లు పని చేస్తూ తెలుగు నేర్చుకొన్నారు. సాధారణంగా, తెలుగు అక్షరాలు నేర్చుకోవడానికి వారికి ఒక నెల పట్టేది. అప్పుడు పని చేయడం ఆరంభించేవారు. అప్పటికి కంప్యూటర్లు లేవు కాబట్టి అనువాదకుల రాత ప్రతులకి కాపీలు రాసేవారు. సంపాదకుల పక్కన పని చేస్తూ ఈ కాపీని ప్రెస్ కి సిద్ధం చేసేవారు. ప్రూప్ కూడా సరి చేసేవారు. ఇవి అన్నీ ఏకాగ్రత, నిర్దిష్టత అవసరమైన పనులు. పని చేయడమే కాక వీరు యూనివర్సిటీల్లో చదువుకొనేవారు. తత్వశాస్త్రం, భూగోళ శాస్త్రం, సాహిత్యం పార్ట్ టైం అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థినులు వీరు. ఏలేరియా కోజ్లెన్ కో, నతాషా మిఖ్నేవిజ్, అన్నాసపొనోమరేవాలు ఒక్కొక్కరు 20 ఏళ్లకి పైగా మాతో పాటు పనిచేశారు. 1956లో సెయింట్ పీటర్స్ బర్గ్ యూనివర్సిటీ తొలి పట్టభద్రులు మాతో పని చేయడానికి వచ్చారు. తమారా కొవలోవా, తత్యానా చుగునోవా,

గర్మన్ యురాసోవ్ లు ఆచార్య నికితా గురెవ్ గారి విద్యార్థులు. తర్వాత ఆచార్య గురెవ్ శిష్యులు మరికొందరు మాతో పనిచేయడానికి వచ్చారు. ముందు ఓల్గా బరాన్నికోవా, ఆమీదట ఓల్గా స్మిస్నోవా వచ్చి చేరారు. వీరు రాదుగ, ప్రగతి ప్రచురణాలయాలలో అవి మూతపడే వరకు పనిచేశారు.  ఆంధ్రప్రదేశ్ కి వ్యాపారయాత్ర చేసిన మా సహోద్యోగులు స్వేత్లానా ద్జేనిత్, ఓల్గా బలాన్నికోవా, నతాషా మిఖ్నేవిచ్, అన్నాపొనొమరేవా, తమారా కొల్యొవా, ఓల్గా సిస్నోవా. వీరు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు, విజయవాడ బ్రాంచిలని సందర్శించారు. అక్కడ ప్రచురణ అవుతున్న పుస్తకాలతోనూ వారి ఉద్యోగులతోనూ పరిచయం చేసుకున్నారు. ప్రగతి, రాదుగ ప్రచురణాలయాలు మూతపడిన తర్వాత నా తోటి ఉద్యోగులు తెలుగుతో సంబంధం లేని వివిధ రంగాలలో పని చేస్తున్నారు. ప్రచురణ సంస్థలలో అనుభవం వారికి కొత్త చోట్లల్లో జయప్రదంగా పని చేయడానికి సహాయపడింది. మా అనువాదకులందరూ తమ ప్రధాన బాధ్యతతో పాటు నిఘంటువుల నిర్మాణంలో కూడా చురుకుగా పాల్గొన్నారు. న్వెల్లానా ద్జెనిత్, నికితా గురోవ్, బోర్యా పెత్రోనిచేవాలు కలిసి కూర్చిన తెలుగు - రష్యన్ నిఘంటువుకి (1972లో ప్రచురణ) వుప్పల లక్ష్మణరావు సంపాదకులుగా ఉన్నారు. స్వెత్లానా కూర్చిన రష్యన్ - తెలుగు నిఘంటువుకి (1988 ప్రచురణ) ఉమారాజేశ్వరరావు సంపాదకులుగా ఉన్నారు. ఆరియార్, ఓల్గా బరాన్నికోవాలు కలిసి తెలుగు - రష్యన్, రష్యన్ - తెలుగు సంభాషణ పుస్తకాన్ని సిద్ధం చేశారు. ఇది 1988లో ప్రచురణ అయ్యింది. వారి పనిని మాకు సహాయపడడంగా అభివర్ణించడం అసమంజసంగా ఉంటుంది. వారి కృషి లేకుండా ఈ నిఘంటువులు, పుస్తకాల ప్రచురణ సాధ్యపడేదికాదు.

.

వుప్పల లక్ష్మణరావు, కొండేపూడి లక్ష్మీనారాయణ, రా.రా, ఉమారాజ్, ఇటీవల ఆర్వియార్ గార్ల మరణ వార్తల్ని విని ఎంతో విషాదాన్ని అనుభవించాను. వీరు నా జీవితంలో భాగం. వీరందర్నీ నేను జీవించినంతకాలం జ్ఞాపకం పెట్టుకుంటాను. మాస్కోలో మా అనువాదకుల జీవితం, కృషికి సంబంధించిన మరొక పార్వాన్ని కూడా నేను ఇక్కడ చెప్పడం ఉచితంగా ఉంటుంది. వారి పని ఇరు ప్రాంతాల ప్రజల మధ్య స్నేహ, సహకారాన్ని పెంపొందించడంలో ప్రత్యక్షంగా సహాయపడడమే కాదు. వారు తమ కుటుంబాలతో రష్యాకి వచ్చారు. వారి పిల్లలు ముందు ఇక్కడ స్కూల్ విద్యార్థులు. తర్వాత మాస్కో విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. అక్కడ తెలివైన వృత్తి నిపుణులుగా ఎదిగారు. ఉదాహరణకి ఉమారాజేశ్వరరావు గారి అబ్బాయి మల్లికార్జునరావు రసాయన శాస్త్రంలో పి.హెచ్.డి పొందారు. రారా గారి కొడుకు మధు వైద్యశాస్త్ర పట్టభద్రుడు. ఆర్వీయార్ కొడుకు రాహుల్ వ్యవసాయ శాస్త్ర నిపుణుడయ్యాడు. వారి రష్యన్ భాషా పరిజ్ఞానం తమ రంగాలలో పని చేయడానికి ఉపయోగపడడమే కాక రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారాన్ని నిల్పడానికి కూడా ఉపయోగపడుతున్నది. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ సంపాదకులు తుమ్మల వెంకట్రామయ్య గారితో, మేనేజర్ మాన్యం గారితో సమావేశాలను ఆత్మీయంగా తలుచుకొంటాను. దురదృష్టవశాత్తూ వీరిరువురు కాలం చేశారు. 1976లో నేను ఆంధ్రప్రదేశ్ కి వెళ్లినప్పుడు ఆ ప్రాంతంతోనూ, సాహిత్యంతోనూ నా పరిచయం పెంచుకోడానికి పి.పి.సి.జోషి ఎంతగానో సాయం చేశారు. అప్పుడు మేం విశాఖపట్నం బ్రాంచి ప్రారంభానికి హాజరయ్యాం. ఇప్పటికి ఇంకా ఎక్కువ బ్రాంచిలుండి ఉంటాయని విశ్వసిస్తున్నాను. 60వ వార్షికోత్సవ సందర్భంగా విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, దానితో సంబంధమున్న వారందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను

.

 తాజాకలం - 2012

అన్నాపొనోమరేవా రాసిన విషయాలు

లండన్ ఇంపీరియల్ కాలేజీలో రష్యన్ అనువాదంలో లెక్చరర్, మాస్కో - లండన్

**

ప్రగతి ప్రచురణాలయంలో 1979లో చేరిన పిన్న వయస్సు వ్యక్తిగా నా సీనియర్ రాసిన కథనానికి కొన్ని వివరాలు జోడించదలచాను. ప్రగతి, రాదుగ ప్రచురణాలయాల తెలుగు విభాగాలలో పని చేసిన ఎవరమూ అనుభవాలనూ, భారతీయ సహోద్యోగుల స్నేహాన్నీ మరచిపోలేం. ఇప్పటికీ పరస్పర సంబంధాలను నిలుపుకుంటున్నాము. ఉదాహరణకి 2010 ఫిబ్రవరిలో హైదరాబాదుకి ఒక కాన్ఫరెన్స్ కు వెళ్లిన సందర్భంగా ఆర్వీయార్ గారింట్లో అతిధిగా ఉండి, ఉమారాజేశ్వరరావు గారితో ఫోన్లో మాట్లాడి ఎంతో ఆనందాన్ని అనుభవించాను. వర్తమాన కాలంలో కూడా రష్యన్ సాహిత్యం పట్ల ఎంతో ఆసక్తి ఉన్నట్లు ఈ ఇద్దరు అనువాదకులూ చెప్పారు. నేనూ నా సహచరులూ పాత్రధారులైన గొప్ప సాంస్కృతిక ప్రయోగం - మరొక సారి అనతి కాలంలో జరుగుతుందని ఆశిద్దాం. అనువాదంలోనూ, భిన్న సంస్కృతుల సంయోగంలోనూ నాకిది గొప్ప అప్రెంటిస్ షిప్ గా భావిస్తాను. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ 60వ వార్షికోత్సవం జయప్రదం కావాలని ఆకాంక్షిస్తున్నాను.

***

THANKS TO N. VENUGOPAL garu for providing this valuable document on Soviet Telugu translation history.










 


నన్ను రచయితగా మార్చిన సోవియట్ రాదుగా ప్రచురణలు - దేవులపల్లి కృష్ణమూర్తి

 ఈ క్రింది జ్ఞాపకంను దేవులపల్లి కృష్ణమూర్తి గారు నాకు నకిరెకెల్ లో వారి ఇంటికి వెళ్లినప్పుడు చెప్పారు. ఈ జ్ఞాపకం తప్పకుండా రాయండి సార్, అని పదేపదే గుర్తుచేసి రాయించాను. తరువాత దీన్ని నమస్తే తెలంగాణాకు పంపాను. వాళ్ళు10 మే 2015  ఆదివారం పుస్తకంలో ముద్రించారు. 

ఈ గొప్ప వ్యాసం రాసిన దేవులపల్లి కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు.

- అనిల్ బత్తుల

^^^


నన్ను రచయితగా మార్చిన సోవియట్ రాదుగా ప్రచురణలు

- దేవులపల్లి కృష్ణమూర్తి

***

నా పన్నెండవ ఏట సూర్యాపేటలో ఏడవ తరగతిలో జాయిన్ అయిన. మిడిల్ స్కూలుకు పోవాలంటే గాంధీపార్క్ ముందునుండే పోవాల్సి వుండేది. గాంధీపార్కు ముందు వున్న పెద్ద పెద్ద వేపచెట్ల క్రింద జనగామ, హైద్రాబాదుకు పోయే గవర్నమెంటు బస్సులు, అట్లే జగ్గయ్యపేట, మిర్యాలగూడకు పోయే బొగ్గు బస్సులు నిలబడి వుండేయి. ఆ చెట్లనీడనే ప్రయాణికులు నిలబడి ఉండేది. అక్కడే యన్.జి.రెడ్డి అనే అతను బస్త చింపులు పరచి యక్షగానాలు, బుర్రకథలు, సినిమా పాటలు, పంచాంగాలు, పెద్దబాలశిక్ష, సోవియట్ ల్యాండ్ తో పాటు కమ్యూనిస్టు పుస్తకాలు కూర్చొని అమ్ముతుండేవాడు. వచ్చిపోయే ప్రయాణికులు వాటిని తిరగేస్తూ నచ్చితే కొనుక్కుంటూ వుండేది. నేను వస్తూపోతూ కొద్దిసేపు నిలబడి ఆ పుస్తకాలను చూస్తూ ఉండేది.

.

నా ఏడవ తరగతి అయిపోయినది. హైస్కూలుకు పోవడానికి కూడా అదే దారి. ఆణాలు పోయి నయాపైసలు వచ్చినయి. మేము ఇల్లు మారి బొడ్డురాయి బజారుకొచ్చినం. మా ఇంటి ముందు పబ్లిక్ లైబ్రరీ వుండేది. రోజూ సాయంత్రం ఏడు గంటలకు వాచ్ మెన్ చంద్రయ్య లైబ్రరి ముందు వరండాలో చాపలు పరిచి ఆరోజు దినపత్రికలు, వారపత్రికలు, చందమామ, బాల, బాలమిత్ర, నవ్వులు పువ్వులు, కినిమా మొదలైన పత్రికలు పెట్టేశాడు. సాయంత్రం బడినుండి రాగానే వాటిని తిరగేయటం నాకెంతో ఇష్టం. ముఖ్యంగా బాల, చందమామ, బాలమిత్ర మరియు కినిమా పత్రికలు ఇష్టంగా చదువుతుంటి. నా ఈడు పిల్లలు వీటిని చదవడానికి పోటిపడుతుండేది. స్కూలు పుస్తకాలే కాక ఇతర పుస్తకాలు చదవటం అలా మొదలైంది.

.

నేను టెంత్ వచ్చేవరకు బొగ్గు బస్సులు తగ్గి సర్కారి బస్సులు వచ్చినయి. యన్.జి.రెడ్డి పుస్తకాల షాపు అట్లనే చెట్లకింద నడుస్తుంది. కొత్త కొత్త పుస్తకాలు వచ్చి చేరినయి. పిల్లల బొమ్మల పుస్తకాలు వాటిపై రంగు రంగు బొమ్మలతో ముద్దులొలుకుతూ వుండేయి, వాటి ధర ఎక్కవలో ఎక్కువగా ఇరవై పైసలు, పావలా ఉండేది. వాటిని ముట్టుకోబోతే "నువు కొనేదా పెట్టేదా వాటిని ముట్టుకోకు" అని కసిరించేవాడు. దానితో వాటిని రోజూ చూస్తూ వుండిపోయేవాణ్ణి. రెడ్డిగారు అలా కసిరి కొట్టడంలో పెద్దగా విచారించేది ఏమి లేదు. అప్పట్లో నా వేషం ముతక నెక్కరు, మాసిపోయివున్న ఆప్ షర్ట్, చెప్పులు మొఖం కానని కాళ్ళు. నాలో పెట్టుదల పెర్గింది. ఎట్టన్నజేసి ఓ పుస్తకం కొనాలని పడ్డది. ఒకనాడు బయట పరిచిన పుస్తకాలలో "అందమైన చిన్న పుస్తకం కన్పించింది. దాని పేరు 'కుక్కను వెంటబెట్టుకున్న మహిళ'. దాని ధర ఎంతంటే ఇరవై పైసలన్నడు.  వెంటనే జేబులోవున్న పావలా బిళ్ళ ఇస్తే ఆ పుస్తకం, ఐదు పైసలిచ్చిండు. ఆ పుస్తకం నేను కొంటాననుకోలేదు రెడ్డిగారు. దాన్ని రెండురోజులపాటు చదివిన ఎక్కలేదు. రెడ్డికి నా సత్తా ఏందో చూపాలని కొన్నాగాని దాన్ని చదివి అర్ధంచేసుకోగలనా లేనా అన్నది ఆలోచించలేదు. నా మిత్రుడు మండల్ రెడ్డి కృష్ణారెడ్డికి ఇస్తే బాగానేవుందిగదరా అన్నడు. వాడు 'మకరశ్రీ' అనే పేరుతో ఏవో కథలు రాస్తూండేవాడు. పోనియ్యిలే అని దాన్ని భద్రపరచుకొన్న. తర్వాత కొన్నాల్లకు 'జమీల్యా' అనే పుస్తకం కనిపించింది. దాని ధర పావలా, కావాలా అన్నడు. ఇవ్వండి అంటూ పావలా చేతిలో పెట్టిన. బ్లూకలర్లో ఉండి ఎంతో అందంగా వుందా పుస్తకం. దాన్ని చదవటం మొదలు పెట్టిన. వదలబుద్ది కాలేదు. అలా సోవియట్ పుస్తకాలతో నా అనుబంధం మొదలైంది. ఇంతలోనే పరీక్షలు మొదలైనయి. నేరుగా బడికి పోవటం ఇంటికొచ్చి చదువుకోవటంతోనే గడిచిపోయింది. హెచ్చెసి పాసయిన తర్వాత, ఏడాదిపాటు ఉద్యోగాన్వేషణలో గడిచిపోయింది. చివరకు తహశీలు ఆఫీసులో యల్.డి.సి గా జాయిన్ అయిన.

.

ఇప్పుడు యన్.జి.రెడ్డి తన బుక్ షాపును పోస్టాఫీసు వెనుక PWD ఆఫీసు కాంపౌండు నానుకొని వున్న చింత చెట్లక్రింద డబ్బాకొట్టుకు మార్చి, దానికి 'స్టార్ బుక్ హౌస్' అని పేరు పెట్టిండు. అతనికి సంతానం లేదు. భార్యాభర్తలు ఆ దుకాణంలోనే సాయంత్రందాక వుంటుండేది. షాపును పెద్దదిగా చేసిండు. సోవియట్ బుక్సు విజయవాడ విశాలాంధ్ర బుక్ హౌస్ నుండి తెప్పించేవాడు. నేను తీరికవున్నప్పుడల్లా సాయంత్రంపూట ఆ షాపుకు పోయి కూర్చుండేవాణ్ణి. తాసీలు ఆఫీసులో ఉద్యోగినని నన్ను గౌరవిస్తూ బెంచిపై కూర్చోబెట్టి "ఈపుస్తకం చూడండి సార్, కొత్తగా వచ్చింది.." అంటూ చూపించేవాడు. అలా పోయినపుడల్లా నాకో కొత్త నవలను కథల పుస్తకాన్ని పరిచయం చేస్తుండేది. అలా నేను రాళ్ళవంకీ, నలభై ఒకటవ వాడు, అన్నా కెరినినా, మనకాలం వీరుడు వంటి పుస్తకాలు ఆ షాపులో కొన్నాను. అవి చదివి ఎంతో ఆనందించేది. మృష్టాన్నభోజనం చేసినట్టుగా వుండేది.

.

మా ఆఫీసు మిత్రులు నేను ఈ పుస్తకాలు చదువుతుంటే "నువ్వు కమ్యూనిష్టునా..?" అని అంటుండిరి. "ఈ పనికిమాలిన పుస్తకాలు చదివితే ఏమొస్తది బై" అంటూ గేలి చేస్తుండిరి. వాల్ల మాటలు పట్టించుకోక నా మానాన నేనుంటుండేది. అలా సోవియట్ 'రాదుగ' ప్రచురణలతో నా అనుబంధం పెరిగిపోయింది. ఎప్పుడన్నా హైదరాబాదుకు పోతే సుల్తాన్ బజారులో వున్న విశాలాంధ్ర బుక్ హౌస్ కు పోయి సోవియట్ రాదుగ ప్రచురణల గూర్చి అడిగితే ఆ నెలలో వచ్చిన కొత్త పుస్తకాలను ముందరేసేవాల్లు. అలా నేను పసివాడి పగ, పెద్ద ప్రపంచంలో చిన్న పిల్లాడు, నొప్పి డాక్టరు, మిత్రుని హృదయం, ఉక్రేనియన్ జానపద గాధలు మొదలైన పుస్తకాలు కొనియుంటి.

.

ఇందులో కొన్ని పుస్తకాలు మిత్రులకు చదువమని ఇచ్చియుంటి. తీసుకున్నవాళ్ళు ఏండ్లు గతించినా తిరిగి ఇవ్వలేదు. అడిగి అడిగి విసిగిపోయిన. ఇక ఎవ్వరికి పుస్తకాలు ఇవ్వగూడదని నిర్ణయించుకున్న. కాని అప్పటికే చాలా పుస్తకాలు పోయినయి. కొన్ని పుస్తకాలను రెండు రెండు కాపీలు కొనడం జరిగింది. ఈ విషయం రాదుగ ప్రచురణలన్ని ఒక్క షెల్ఫు లో పెట్టాలన్ని యేర్పాటు చేసినపుడు తెలిసింది. విజయవాడ పోయినపుడు, అనంతపురం పోయినపుడు అక్కడి విశాలాంధ్ర బుక్ హౌస్ కు పోయి కొనియుంటి. కొన్న వాటిని వెంటనే చదువక రిటైర్ అయిన పిదప చదువాలని భద్రపరిచిన. నేను 1998లో రిటైర్ ఆయువుంది. 2005 వరకు అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని నావద్ద వున్న రాదుగ, ప్రగతి ప్రచురణల పుస్తకాలన్ని చదివిన. అందులో రెండవ ప్రపంచయుద్ధకాలంలో రాసినవి నాకెంతో నచ్చినయి.

.

ఆనువదించిన వాల్లలో వుప్పల లక్ష్మణరావు గారి అనువాదాలు ఎంతో హాయిగా చదివించాయి. జమీల్యా, తల్లి భూదేవి, తొలి ఉపాధ్యాయుడు మొదలైనవి. తదుపరి ఆర్వీఆర్ అనువాదాలు. అనువాదకులు తమ అభిప్రాయాలు వ్రాయటం రాదుగ ప్రచురణలలో అలవాటు లేదు. అయినా 'మనకాలం వీరుడు' నవలకు ఆర్వీఆర్ ముందుమాట వ్రాసిండు. రాచమల్లు రామచంద్రారెడ్డి ట్రాన్సులేషన్సు అంతగా కొరుకుడు పడేవి కావు. కొండేపూడి లక్ష్మీనారాయణ, గిడుతూరి సూర్యం, నిడమర్తి ఉ మారాజేశ్వరరావు గారు కొన్నిటిని అనువదించి యుండిరి.

.

మా మిత్రుడు రచయిత బోయ జంగయ్య రామన్నపేటలో యస్.టి.వో ఆఫీసులో పనిచేస్తూవుండె. ఒకసారి మాటల సందర్భంలో 'ఆర్వీఆర్' అనే సోవియట్ యూనియన్ పుస్తకాలను అనువాదం చేసిండు చూడు మాకాడనే జూనియర్ కాలేజిలో ప్రిన్సిపాలుగా పనిచేస్తుండని చెప్పిండు. దానితో వారిని కలుసుకోవాలని రామన్నపేటకు పోయివుంటి. వారు ట్రాన్సులేషను చేసిన పుస్తకాల వివరాలను చెబితే మిక్కిలి ఆనందించాడు. తాము పదేండ్లకు పైచిలుకు సోవియట్ యూనియన్లో వున్నట్లు చెప్పిండు. సోవియట్ రాదుగ ప్రచురణలు ఆగిపోవడంతో తిరిగి ఇండియాకు వచ్చినట్లు చెప్తూ రాగానే అప్పటి ముఖ్యమంత్రి  NTR గారిని కలిసి తన పరిస్థితి వివరిస్తే తన సెలవు పిరియడును రెగ్యులర్ చేసి ఇంకా ఒక సంవత్సరం మిగిలి వున్నందున ఇక్కడ జూనియర్ కాలేజిలో ప్రిన్సిపల్గా పోస్టింగు ఇచ్చినట్లు చెప్పిండు. సోవియట్ యూనియన్లో తన అనుభవాలను పుస్తకంగా తేబోతున్నానని చెప్పిండు.

.

రిటైరు అయిపోయిన తరువాత ఎటూ పొద్దుపోక నావద్ద వున్న సోవియట్ రాదుగ పుస్తకాలను మరల చదువుతూపోయిన. చదివినప్పుడల్లా నాకు కొత్త అందాలు కన్పించేయి. వ్రాసినవాళ్లలో చాలామంది తమ అనుభవాలనే నవలలుగా చిత్రీకరించారు. అట్లే నేవెందుకు నా అనుభవాలను వ్రాతలో పెట్టకూడదని భావించి వ్రాయటం మొదలు పెట్టిన.

ఎంత వ్రాసినా 10, 20 పేజీలకు మించటంలేదు. మరల ఓమారు రాదుగ ప్రచురణలను తిరగేస్తుంటే బాట దొరికింది. అలా నా మొదటి పుస్తకం "ఊరు వాడ బతుకు" వెలువడింది. ఇది నా డెబ్బైఏట వ్రాసియుంటి. అటు తర్వాత 'మా యాత్ర', 'కథలగూడు', 'బయటిగుడిసెలు' మరియు 'తారుమారు' వెలువడినయి. వీటన్నిటికి ప్రేరణ సోవియట్ రాదుగ ప్రచురించిన నవలలు, కథాసంపుటాలు మాత్రమే.

***




మంచంపైన దేవులపల్లి కృష్ణమూర్తి గారు, నేల మీద అనిల్ బత్తుల(నేను)



బాపు గారు గీసిన దేవులపల్లి కృష్ణమూరి గారి చిత్రం



దేవులపల్లి కృష్ణమూరి గారి సంతకం & ' స్టార్ బుక్ హౌస్ ' స్టాంప్




సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్

 సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్   ప్రగతి ప్రచురణాలయం, మాస్కో, యూ.యస్.యస్.ఆర్, తెలుగు విభాగపు మాజీ అధిపతి ***...