Monday, 8 September 2014

నేను - నాన్న - సోవియట్‌ పుస్తకాలు by ఎస్పీ జగదీష్

Date: 5th Sep 2014
COURTESY: Jagadees gari blog: hhttp://saradaa.blogspot.in/2014/09/blog-post.html?spref=fb
నేను - నాన్న - సోవియట్‌ పుస్తకాలు


సోవియట్‌ పుస్తకాల గురించి గుర్తు చేసుకోవడమంటే బాల్యాన్ని తట్టిలేపడమే. ఎన్నో అందమైన జ్ఞాపకాలు, అన్నింటినీ మించి, ఎంతో విజ్ఞానం - వినోదం - ఆహ్లాదం. ఇప్పటి తరానికి పెద్దగా తెలియక పోవచ్చు గాని, పాత తరంలో పుస్తకాలతో ఏ మాత్రం పరిచయం ఉన్నవారికైనా రష్యా సాహిత్యంతో సాన్నిహిత్యం ఉండే తీరుతుంది. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రచ్చన్న యుద్దం మొదలైంది. అమెరికా, రష్యాల మధ్య ఆధిపత్య పోరులో భారత్‌ ఎవరివైపు మొగ్గు చూపాలో నిర్ణయించుకోవలసిన పరిస్థితిలో అప్పటి ప్రధాని నెహ్రూ, రష్యాతో మైత్రి చేసుకున్నాను. నవ భారత్‌ను నిర్మించడానికి వీలుగా రష్యా మనకు పొరుగుదేశంగాను, అప్పట్లో కమ్యూనిజం వ్యాప్తి ఎక్కువగా ఉన్న కారణంగాను, ఆ దేశంలో స్నేహ బంధం కొనసాగింది. అదిగో... అప్పుడే రష్యన్లు మాయ చేసారు. ఇక్కడి వారిలో తమ భావజాలాన్ని వ్యాప్తి చేసే పుస్తకాలతో పాటు, బాల సాహిత్యాన్ని కూడా పరిచయం చేసారు. అలా వచ్చినవే తెలుగులో రష్యన్‌ పుస్తకాలు. అవన్నీ అద్భుతమైన రంగుల్లో ముద్రించబడి, సాంకేతికంగా గాని, సాహిత్యపరంగా గాని, అత్యున్నత స్థాయిలో ఉండేవి.

        నాకు ఆరేళ్ల వయసులో అనుకుంటా - మా నాన్న గారు - మొట్టమొదటి రష్యన్‌  పుస్తకాన్ని పరిచయం చేసారు. ఇప్పటికీ నాకు బాగా గుర్తు.''మాయ గుర్రం - మేటి గుర్రం''. ఆ బొమ్మలతోనే మంత్ర ముగ్దుణ్ని అయిపోయేను. ఆ బొమ్మలలో ఉన్న కథ కోసం ప్రతీ అక్షరాన్ని కూడబలుక్కునే వాడిని. నాన్న సాయం చేసేవారు. ఆ పుస్తకంలో ఉన్న ప్రతి అక్షరమూ నాకు గుర్తే. ఎంతలా ఆ పుస్తకం నచ్చేసిందంటే, ఇప్పటికీ నా పెర్సనల్‌ లైబ్రరీలో ఆ పుస్తకం పదిలంగా ఉంది. నా రెండవ తరగతిలో నేను క్లాస్‌ ఫస్ట్‌ వచ్చినపుడు నాకు వచ్చిన బహుమతి''ఉన్నారు ఇలాంటి అబ్బాయిలు''. ఎంత అందమైన పుస్తకం అది... నా తమ్ముడికేమో ''వర్థిల్లాలి సబ్బు నీళ్ళు'' వచ్చింది. దాన్ని చూసి అందరం ఏడిపించే వాళ్ళం. వీడెప్పుడూ శుభ్రంగా ఉండడు. అందుకే వీడికి ఇలాంటి పుస్తకం బహుమతిగా వచ్చింది అని.నాన్నారి చిన్నతనంలో కథతో పాటుగా ఎన్ని నీతులు నేర్చుకున్నామని? నొప్పి డాక్టరు కథని ఎన్నిసార్లు చదివామో, ముసలి వర్వారాను అన్నే సార్లు తిట్టుకొనే వాళ్ళం - జంతువుల్ని ఇబ్బంది పెడుతున్నందుకు. రంగు రంగుల చేపలతో పాటు అక్వేరియంలో విహరించేవాళ్ళం. ఆకుపచ్చని ద్వీపం, మొసలి కాజేసిన సూర్యుడు, మత్స్య మిత్రుడి మంత్ర మహిమ వంటి ఎన్నో పుస్తకాల్లో మునిగి తేలేవాళ్ళం. వెర్రి వెంగళాయ ఇవానుష్క అంటే మాకు చాలా ఇష్టం. ఎప్పటికైనా తన లాగా జార్‌ చక్రవర్తి కూతురు - అందాల భరిణెలాంటి అమ్మాయిని మాయ గుర్రం ఎక్కి వెళ్ళి పెళ్ళాడకపోతామా అని ఆశ.

        కొంచెం పెద్దయ్యాక ''భూమి ఇలా ఉందని ఎలా కనిపెట్టారు'' చదువుతూ, భూ ప్రపంచం చివరి అంచుల దాకా వెళ్ళి వచ్చేసాను. ''టెలిస్కోప్‌ చెప్పిన కథలు''లో అయితే సూర్యుడి దగ్గర నుండి ప్లూటో వరకు ప్రయాణం కొనసాగింది.  ప్రాచీన ప్రపంచ చరిత్రలో కొన్ని వేల సంవత్సరాల చరిత్రను బొమ్మల్లో చూడడం ఎవరు మరిచిపోగలరు? మానవుడే మహాశక్తి సంపన్నుడు'' లో కొన్ని లక్షల సంవత్సరాలుగా మానవుడు ఎలా పరిణామం చెంది, ఇప్పటి స్థితికి చేరుకొన్నాడో అనే విషయాన్ని ఎంత ఆసక్తి కరంగా చదివానో, ''ఖగోళ శాస్త్రం- వినోదం, విజ్ఞానం''లో కాల్పనిక కథల్నీ అంతే ఆసక్తికరంగా గుక్కతిప్పుకోకుండా చదివాను. కాల్పనిక కథలంటే గుర్తుకు వచ్చింది - ఇకతియాండర్‌, గులాబీ మేఘాలు, ప్రతిబింబాలు ఈ పుస్తకాలన్నీ ఎన్ని సార్లు చదివానో ఊహా ప్రపంచంలో విహరించానో, వెనక్కి తిరిగి చూసుకుంటే నా బాల్యమంతా రష్యన్‌ పుస్తకాలతోనే గడిచిపోయింది  - నిండిపోయింది. ప్రపంచ చరిత్ర నుండి అణు విజ్ఞానం వరకు, చిన్న పిల్లల కథల నుండి సైన్స్‌ ఫిక్షన్‌ వరకు ఇలా ప్రతి అంశం మీదా సోవియట్‌లో ప్రచురితమైన ఇంచుమించు ప్రతి ఒక్క పుస్తకాన్ని చదివాను. అన్నీ అని చెప్పలేను కాని - చాలా వరకు అని చెప్పగలను.

        సోవియట్‌ పుస్తకాల గురించి చెప్పేటపుడు తప్పనిసరిగా గుర్తు చేసుకోవలసిన వ్యక్తి ఒకరున్నారు - మా నాన్న గారు. ఆయనకు కూడా పుస్తకాలంటే ఎడతెగని అభిమానం - కాదు ఇంకా ఎక్కువే - పిచ్చి అంటారే  - అలాంటిదే. నేను కావాలన్న ప్రతి పుస్తకాన్ని నాకు తెచ్చిచ్చేవారు - ఎందుకు అని అడిగేవారు కాదు. విశాలాంధ్ర బస్‌లో నేను రెగ్యులర్‌ కస్టమర్‌ని. నాన్న గారు విజయవాడ వెళ్ళినప్పుడల్లా ఆయన కోసం ఎదురు చూసేవాళ్లం - ఎంత రాత్రయినా సరే. ఎందుకంటే ఆయనతో పాటుగా ఎన్నో సోవియట్‌ పుస్తకాలు తీసుకొచ్చేవాళ్ళు. అవి చూస్తే కాని నిద్రపోయేవాళ్ళం కాదు. ఆయన తెచ్చే పుస్తకాలు ముందు ఎవరు చదువుతారో అని మా అన్నదమ్ముల మధ్య పోటీగా ఉండేది. అవన్నీ చదివి వాటిలో  ఏముందో నాన్నకి చెప్పాలి. అదీ ఒప్పందం. ఎక్కడైనా ఎగ్జిబిషన్‌లో విశాలాంధ్ర స్టాల్‌ కనబడితే - వెంటనే అక్కడ హాజరు. కొత్తగా వచ్చినవన్నీ ఏరుకొనేవాడిని. ఏనాడూ కూడా నాన్న గారు బిల్‌ ఎంత అయింది అని చూడలేదు. అటువంటి నాన్న దొరకడం నిజంగా నా అదృష్టం. ఇప్పటికీ నేను కొత్త పుస్తకం  కొనగానే ఆయనకు చూపించడం నా అలవాటు. పేపర్లలో సమీక్షలు చదివి, ఈ పుస్తకం ఇంతా తెప్పించలేదా - ఇదింకా చదవలేదా అని నన్ను వెంబడిస్తూనే ఉంటారు.

       మళ్ళీ ఇన్నాళ్ళకు, నాకు తెలిసిన కొన్ని వేల మందిలో మరలా నాన్నగారి లాంటి పుస్తకాల ప్రేమికుణ్ణి చూసాను - బత్తుల అనిల్‌ రూపంలో. బ్లాగులో  దొరికాడు. వెంటనే ఫోన్‌ కలిపాను. కొద్దిసేపు మాట్లాడగానే తెలిసింది - పుస్తకాల పిచ్చి - చివరి దశలో ఉంది. నేను చదువుతున్నాను - తను ప్రేమిస్తున్నాడు - అంతే తేడా. ఎంతో ఆర్తి ఉంటే గాని, ఇటువంటి ప్రయత్నం సాధ్యం కాదు. నేను ఊహించిన దాని కంటే ఎంతో అద్భుతంగా పుస్తకాలని సేకరిస్తున్నాడు - అందరికీ పంచుతున్నాడు. వెంటనే మాట ఇచ్చాను. నా దగ్గర  ఉన్న వాటిలో నుండి కొన్నింటిని స్కాన్‌ చేసిస్తాను అని మాటిచ్చాను. ఆ  మాత్రం మాటకి తను నాకిచ్చిన బహుమతి ఏమిటో తెలుసా? మా నాన్న గారు ఆయన చిన్నతనంలో పోగొట్టుకున్న ఏడు రంగుల పువ్వు - ఇంగ్లీష్‌ వెర్షన్‌. ఆయన ఆ పుస్తకం గురించి, దానిలో కథ గురించి నాతో ఎన్నో సార్లు చెప్పారు. అంతకు మించి ఎన్నో సార్లు గుర్తు చేసుకున్నారు. ఇప్పుడా పుస్తకం తెలుగు వెర్షన్‌ దొరకలేదు. కాని అనిల్‌ గారి ద్వారా ఇంగ్లీష్‌ వెర్షన్‌  దొరికింది. ఆ పుస్తకాన్ని మా  నాన్న గారికి కానుకగా ఇచ్చాను. ఆయన కళ్ళలో ఎంతో ఆనందం. అనిల్‌కి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? అనిల్‌ ఒకటే అన్నారు -  మీరు నా రుణం తీర్చుకోవాలనుకుంటే ఆ పుస్తకాన్ని తెలుగులో మీరే అనువాదం చేయండి - అని. పెద్దబాధ్యతే.. కాని ఇప్పుడు అదే పనిలో ఉన్నాను. త్వరలోనే  పూర్తి చేస్తాను.

        మళ్ళీ బాల్యంలోకి వెళ్ళి, జ్ఞాపకాల దొంతరల్ని బూజు దులిపి, పుస్తకాలతో నా తీయని చెలిమిని గుర్తు చేసుకొనేలా చేసిన సోదరుడు అనిల్‌కి మరలా హృదయపూర్వక ధన్యవాదాలు. 

అనిల్ బ్లాగ్ ని సందర్శించడం మరచిపోకండి... http://sovietbooksintelugu.blogspot.in

Gogol "Over coat" book release - 4 Nov 2018

నికొలాయ్ గొగోల్ - ఓవర్ కోట్ : అకాకి అకాకియెవిచ్ నూట డెబ్బైయారు సంవత్సరాలక్రితం గొగోల్ కలం నుంచి పుట్టాడు. జార్ చక్రవర్తుల భూస్వామ్య వ్యవస్థ...