Sunday 4 November 2018

Gogol "Over coat" book release - 4 Nov 2018

నికొలాయ్ గొగోల్ - ఓవర్ కోట్ :
అకాకి అకాకియెవిచ్ నూట డెబ్బైయారు సంవత్సరాలక్రితం గొగోల్ కలం నుంచి పుట్టాడు. జార్ చక్రవర్తుల భూస్వామ్య వ్యవస్థలోని అట్టడుగు సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు అతడొక ప్రతినిధి. అప్పుడలా పుట్టిన అకాకి అకాకియెవిచ్ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. అతడే పుష్కిన్ మజిలీ గుమాస్తా అయ్యాడు. అతడే చెహోవ్ సృష్టించిన గుల్లలో జీవించిన మనిషి. అక్కడ అలా పుట్టిన పాత్ర దేశదేశాలకు విస్తరించాడు. అతడే రావిశాస్త్రి సృష్టించిన అల్పజీవి.  అదిగదిగో అతడే అజంతా సృజించిన నిరుద్యోగి వెంకట్రావు. అకాకి అకాకియెవిచ్ ఇంకా పుడుతూనే ఉన్నాడు అనేక రూపాల్లో. అందుకనే కాబోలు దోస్తవస్కి "మేమంతా గొగోల్ ఓవర్ కోట్ నుంచి వచ్చినవాళ్ళమే" అన్నాడు.        

గొగోల్ రాసిన ఈ కథని తెలుగులో మొదటిసారిగా వుప్పల లక్ష్మణరావు "రష్యన్ రచయితల కథానికా సంకలనములు" కోసం మాస్కోలో అనువాదం చేసారు. అంతకుముందైనా ఆ తరవాతైనా అనేక గొగోల్ పుస్తకాలు తెలుగులోకి అనువాదం అయ్యాయి. గొగోల్ ఓవర్ కోట్ కథ ద్వారానే సుప్రసిద్ధుడు.

ఇన్నేళ్ళ తర్వాత మహత్తరమైన ఈ కథని తెలుగులోకి మళ్ళీ పునర్ముద్రణ చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు VMRG సురేష్. అనుకున్నదే తడవుగా స్వచ్చందంగా తనే పుస్తకాన్ని తీసుకువచ్చాడు.

ఈరోజు ఉదయం కూకట్ పల్లి "ఆలంబన" లో గొగోల్ అభిమానుల మధ్య పుస్తకం అవిష్కృతమైంది. సుప్రసిద్ధ కథకులు ఉణుదుర్తి సుధాకర్ గారు వుప్పల లక్ష్మణరావుగారితో తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఓవర్ కోట్ కథ గొప్పతనాన్ని, పాఠకుడి పక్కన కూర్చుని కథ చెప్పేలా ఉండే గొగోల్ రచనా శిల్పాన్ని వివరించారు.  మృతజీవులు, గవర్నమెంట్ ఇన్స్పెక్టర్ వంటి గొగోల్ పుస్తకాలను ప్రచురించిన పీకాక్ క్లాసిక్స్ సంపాదకులు గాంధి తన అనుభవాలను సాహిత్యాభిమానులతో పంచుకున్నారు. 

సామాజిక కార్యకర్త, రచయిత్రి నంబూరి పరిపూర్ణ, కథకులు దాసరి శిరీష, నిరంతర పధికుడు దాసరి అమరేంద్ర సాహితీవేత్త అంబటి సురేంద్రరాజు, సుప్రసిద్ధ కవి నాటక ప్రయోక్త దెంచనాల శ్రీనివాస్, అనువాదకులు కొల్లూరి సోమశంకర్, కవయిత్రి శివజ్యోతి, సాహిత్యాభిమాని పుస్తక ప్రేమికుడు కడుపు గంగాధరరావు వంటి సాహితీకారులు ఈ కార్యక్రమంలొ పాల్గొన్నారు. 

కేవలం సాహిత్యకారులేకాక ఆలంబన పిల్లలమధ్య ఈ పుస్తకం అవిష్కరించబడటం ఆశ్చర్యం, సంతోషం కలిగాయి. సహాయసహాకరాలందించిన దాసరి శిరీష గారికి, అలంబన బాలలకు ధన్యవాదాలు. 










సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్

 సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్   ప్రగతి ప్రచురణాలయం, మాస్కో, యూ.యస్.యస్.ఆర్, తెలుగు విభాగపు మాజీ అధిపతి ***...