Thursday 9 April 2015

నొప్పి డాక్టరు - ebook link

https://drive.google.com/file/d/0B07Gk0_NnBKicXgzN1ZyRkhoejg/view?usp=sharing



English Title: Docter Powderpill

Author: Kornie Chukovsky


                 
                        Thanks to Mahy [Artio] for poster design.




“నొప్పి డాక్టరు” గారిని వెతకండి  by  బాదర్ల స్వప్నిల్



ఒక చిత్రం పదివేల పదాలతో సమానం” – చైనా సామెత –  ఇది చెప్పడానికి మనకు చైనా వాళ్ళే కావాలా? మనకు తెలియదా? తెలుసు. అయినా మనం కొన్ని విషయాలను మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేసుకోవాలి. కొన్ని పుస్తకాలను మళ్ళీ మళ్ళీ చదువుకున్నట్లు. కొన్ని బొమ్మల్ని తిరిగి తిరిగి చూసుకున్నట్లు.  నేను పరిచయం చేయబోయే పుస్తకం ఒక తరం నోస్టాల్జియా కు సంబంధించినది. ఇది కేవలం కథల పుస్తకమే కాదు. ఒకప్పటి రష్యన్ రాదుగ బొమ్మల పుస్తకం.  తెలుగులో వచ్చిన రాదుగ పుస్తకాలను ఎన్ని సార్లు చూసుకున్నా తనివి తీరదు కదా. ఆ పుస్తకాల అట్టలే వేరు. ఆ పుస్తకాలలోని అక్షరాలే వేరు. మరీ ముఖ్యంగా వాటిల్లోని బొమ్మలే వేరు.
కొన్ని పుస్తకాలుంటాయి. పుస్తకాలతో కొన్ని అనుభవాలుంటాయి. అంతకుమించి ఆయా పుస్తకాలతో గొప్ప అనుబంధమూ ఉంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు చదివిన పుస్తకాలు బొమ్మలతో సహా జీవితాంతం గుర్తుండి పోతాయి. ఎక్కడ చేజార్చుకుంటామో  అని గుండెలకు పొదివిపట్టుకుని కాపాడుకుంటాము. అవి మన దగ్గర లేకున్నా అందులోని బొమ్మలను తలుచుకుని నోస్టాల్జియాలో పడతాము. అలాంటిదే  నూట ఎనభై పేజీల ఈ నొప్పిడాక్టరు పుస్తకం.  గ్యూ లోఫ్ టింగ్ రాసిన డా. డూలిటిల్ ని  ఆధారం చేసుకుని కోర్నేయ్ చుకోవ్ స్కి  రాసిన డా.పౌడర్ పిల్ అనే ఈ రష్యన్ పుస్తకాన్ని ఆర్వీఆర్ గారు  తెలుగులో చక్కగా అనువదించారు. “వి.దువీదొవ్” వేసిన బొమ్మలు ఈ పుస్తకానికి ప్రాణం.

ఈ పుస్తకంలో అడవిలో జంతువులకు వైద్యం చేసే ఒక డాక్టరు ఉంటాడు. ఆయన పేరు నొప్పి డాక్టరు. ఆయనతో పాటు  కికా అనే బాతు, అవ్వా అనే కుక్క, కరూడో అనే చిలుక, బుంబా  అనే గుడ్లగూబ కూడా నివసిస్తూ ఉంటాయి. అతడికి జంతువులూ, పక్షులు మాట్లాడుకునే భాష తెలుసు. అవి తమకేదన్నా జబ్బు చేసినప్పుడు, ఆపద వచ్చినప్పుడు నొప్పి డాక్టరు దగ్గరకి పరిగెడుతుంటాయి. వాటి జబ్బుల్ని ఆయన చిటికలో వైద్యం చేసి మాయం చేస్తుంటాడు. ఇంతలో ఆఫ్రికాలోని మర్కట రాజ్యంలో కోతులు కడుపునొప్పితో బాధ పడుతున్నాయని కబురు వస్తుంది. నొప్పి డాక్టరు గారు రాబిన్సన్ అనే తన స్నేహితుడి దగ్గర నుంచి ఓడని అరువు తీసుకుని ఆఫ్రికా ఖండానికి బయలుదేరతాడు. దారి మధ్యలో అనేక ఆటంకాలు. ఓడ మునిగిపోతుంది. సముద్రపు దొంగలు బందిస్తారు. చివరికి ఎలాగైతేనేం మర్కటరాజ్యానికి చేరుకుని కోతుల్ని కాపాడతారు. దానికి ప్రతిఫలంగా కోతులు నొప్పిడాక్టరు గారికి తోపుడు లాగుడు  అనే రెండు తలల వింత జీవిని బహుకరిస్తాయి.
అలాగే మరొక కథలో పెంటా అనే జాలరి కుర్రవాడి తండ్రిని సముద్రపు దొంగలు ఎత్తుకుపోతే అతడిని రక్షించి తండ్రీ కొడుకులను కలుపుతాడు. దొంగలు సముద్రంలో మునిగిపోతారు.
స్థూలంగా ఇందులోని రెండు కథలివే. ఈ రెండు కథల్లోనూ సాహసాలు చేసే డాక్టరు గారికి కికా, అవ్వా, కరూడో, బుంబా తదితర పక్షులు, జంతువులూ సహాయపడుతూ ఉంటాయి.
కథలను మించి ఈ పుస్తకంలో దువీదోవ్ వేసిన బొమ్మలు అమూల్యమైనవి.మనకు రాదుగ చిన్నపిల్లల  బొమ్మల పుస్తకాలు అసంఖ్యాకంగా వచ్చాయి. ప్రతిదీ దేనికదే ప్రత్యేకం.
మనం మన పిల్లలకి వాళ్ళ నోళ్ళు తిరగక పోయినా ఇంగ్లీషు రైమ్స్ బట్టీ వేయిస్తుంటాము. మెలికలు తిరిగే అక్షరాలను పదే పదే దిద్దుస్తుంటాము.  వాళ్ళు ఆడుకునే ఆటలు కూడా తెలివితేటలు, ఐక్యూ పెంచేవిగానో చూసుకుంటాము గాని అన్నిటికీ మూలమైన వాళ్ళ కల్పనా శక్తిని నిర్లక్ష్యం చేస్తుంటాము.  వాళ్ళ రంగు రంగుల ఊహా ప్రపంచాన్ని దూరం చేసి మన భయాలను వాళ్ళమీద నెడుతుంటాము. అదంతా వేరే సంగతి కాని పిల్లల ఊహా శక్తికి కథలెంత ముఖ్యమైనవో బొమ్మలు కూడా అంతే ముఖ్యమని మనం గుర్తించాలి. మనం బొమ్మల పుస్తకాలను ఇంకా నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నాము. .
ఇటీవల సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే నా మిత్రుడొకరు నా దగ్గర ఈ పుస్తకాన్ని తీసుకుని ఐదేళ్ళ వాళ్ళబ్బాయికి చూపించాడు. ఆ పిల్లవాడికి ఈ కథల్లో నొప్పి డాక్టరు గారికి జంతువుల భాష తెలిసి ఉండటం, ఇక బొమ్మల్లో మొసలి సోఫాలో కూర్చుని ఉండటం బాగా నచ్చేసింది. నొప్పి డాక్టరు ఆ బాలుడి జీవితంలో ఒక భాగమైపోయాడు.  నాకు బాగా తెలిసిన ఇద్దరు వృద్ధ దంపతులు ఈ నొప్పిడాక్టరు పుస్తకం చెరొక కాపీని భద్రంగా దాచుకుని ప్రతిరోజూ చూసుకుంటూ ఉండటం నన్ను ఆశ్చర్య పరిచింది.
చెప్పవచ్చేదేమంటే మనకిప్పుడు బొమ్మల పుస్తకాలు కావాలి. పిల్లల పుస్తకాల్లోనే కాదు, పెద్దల పుస్తకాల్లో కూడా బొమ్మలు కావాలి. బొమ్మలను గౌరవించడం మనం నేర్చుకోవాలి.  మనకు ఒకప్పుడు “చందమామ” వంటి మంచి పిల్లల మాస పత్రికలు ఉన్నట్లే, మంచి రాదుగ చిన్న పిల్లల పుస్తకాలు కూడా ఉన్నాయని చెప్పుకోవాలి. దురదృష్టమేమంటే అందులోని చాలా పుస్తకాలు ఇప్పుడు అలభ్యం. చూడాలంటే వాటిని భధ్రంగా దాచుకుని చూసుకునే డెబ్బయవ దశకం పాఠక తరాన్ని అడగాలి. లేకపోతే ఆదివారం అబిడ్స్, విజయవాడ పాత పుస్తకాల షాపులను దులపాలి. ఇటీవల కొందరు ఔత్సాహికులు పిల్లల బొమ్మల పుస్తకాల అవసరాన్ని గుర్తించి  పిల్లల పుస్తకాలు బొమ్మలతో సహా వేస్తున్నారు. తెలుగులో నిజంగా ఇదొక శుభపరిణామం.
ఇటీవల “మంచిపుస్తకం” వారు కొన్ని రాదుగ పిల్లల పుస్తకాలను పునర్ముద్రిస్తున్నారు. వారు కాని, ఇంకెవరైనా కాని ఈ నొప్పిడాక్టరు పుస్తకాన్ని ప్రచురిస్తే దీన్నొక జ్ఞాపకంగా గుర్తుంచుకున్న అప్పటి తరమే  కాక, ఇప్పటి పిల్లలూ  ఇటువంటి గొప్ప పుస్తకాన్ని చదివే అదృష్టం కలుగుతుంది.





సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్

 సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్   ప్రగతి ప్రచురణాలయం, మాస్కో, యూ.యస్.యస్.ఆర్, తెలుగు విభాగపు మాజీ అధిపతి ***...