Monday 8 September 2014

సోవియెట్ ప్రచురణల నాస్టాల్జియా by దాసరి శిరీష

This article collected by Aparna Thota.

సోవియెట్ ప్రచురణల గురించి మా అమ్మ దాసరి శిరీష నాస్టాల్జియా....ఇదిగో Anil Battulaనీకోసమే...  

కమ్యూనిస్టులనగానే చాలామంది ప్రజలకి గుర్తుకొచ్చేది....ఎర్ర జెండాలూ, కార్మిక-కర్షక పోరాటాలూ...సమస్యలని మీటింగుల ద్వారా ఆవేశంగా వివరించే ప్రయత్నాలూ. పాలకులు ఏం చేసినా కిమ్మనకుండా ఉదార హృదయంతో గుండెదిటవు చేసుకునే మంచిప్రజలు కమ్యూనిస్టులని మాత్రం వ్యంగ్యంగా మెచ్చుకుంటూ ఛలోక్తులు విసురుతుంటారు. కానీ అంతకన్నా పాత నేపధ్యాల జోలికి ఎవరికీ పోరు. వారు సృష్టించిన సాహితీలోకాలు...అందులో చిన్నారిప్రపంచాలూ ఎవరికీ సరిగ్గా తెలియవు!
అసలు విషయానికొద్దాం. మంచి విలువలున్న స్ఫూర్తిదాయకమైన సాహిత్యాన్ని ప్రజలకి సన్నిహితంగా లాక్కురావడానికి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ లు చేసిణ/చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. వామపక్షాలు సాహిత్యాన్ని ఓ ఉద్యమంలా నడిపి స్త్రీలనీ, ప్రజలనీ సంఘటితపరచిన రోజులు పాతతరం వాళ్ళెవరూ మర్చిపోరు. ఆ చరిత్రలు చెప్పగలిగే నేతలు శాశ్వతంగా సెలవు తీసుకున్నారు.

మనం సొవియెట్ “రాదుగ ప్రచురణ”ల దగ్గరకెళ్దాం. ‘అ, ఆ లంటే ఏమిటో’ అనే సందిగ్ధంలో బాల్యావస్థలు పడుతున్నప్పుడు “పాపా , ఇవిగో” అంటూ ఎప్పటికప్పుడు బొమ్మల పుస్తకాలు ఇచ్చే నాన్నగారు....’తొందరగా అ, ఆ లు నేర్చుకుని చదివెయ్యి’, అన్నారేమో! అనిపిస్తుంది. నిజంగా బోల్డంత స్పీడ్ గా అ, ఆ లూ...గుణింతాలూ నేర్చేసుకుని ఈ పుస్తకాల మీద పడ్డాం. ( ఈ లోపల పేపర్లో హెడ్డింగులు అమ్మ చదివిస్తూ గొప్ప ప్రాక్టీసుని ఇచ్చింది.) ఇవన్నీ చదువుతూ...తిరగేస్తూ అసలు చదువుల్లోకి సరదాగా అడుగెట్టాం. రంగు రంగుల దుస్తులు ధరించిన కుందేళ్ళూ...మేకతల్లులూ...పిల్లలూ...పొగరుమోతు పిల్లులూ...ఎలకలూ...వారి వారి ఇళ్ళూ...ఈతిబాధలూ....అబ్బో ఎందుకులెండి, ఆ మనోహర ప్రపంచాన్ని మనోనేత్రం తో ఎంత ఆసక్తిగా ఆనందంగా వీక్షించేవాళ్ళమో! పక్షులన్నీ తలమీద కిరీటాలతో జాతి ప్రతినిధుల్లా దర్జాలు ఒలకబోసేవి. ఆ కథలు ఎంత గమ్మత్తుగా అర్థవంతంగా ఉండేవి?!! అలా చదువుతూ...చదువుతూ.. చాలా చిన్న వయస్సులో సాహితీ ప్రపంచంలోకి యాత్ర సాగించాము. పెద్దవాళ్ళంతా ప్రేమ్ చంద్...గోర్కీ...టాల్ స్టాయ్....శరత్ అంటూ గంభీరమైన చర్చలు చేస్తుంటే మేమెంత తొందరగా పెద్దవాళ్ళమైపోయి వీళ్ళలాగా మాటలమూటలు కట్టేస్తామో! అని మహా ఆత్రంగా ఉండేది.

అందుకని బోల్డంత సమయాన్ని పుస్తకాలకి వెచ్చించి యుక్తవయస్సు వచ్చేసరికి ‘మేం బోల్డన్ని పుస్తకాలు చదివాం’ అని ధీమాగా తోటివాళ్ళముందు ప్రకటించేవాళ్ళం. ఆ దివ్యమైన రోజుల్లో “రాదుగ ప్రచురణలు” సాహితీ రాగాలను మాతో పాడించాయి.

మా రోజుల్లో అంటూ చాదస్తంగా పిల్లలకి సుద్దులు చెప్పే ప్రయత్నం మేం చెయ్యం. ఏదీ... ఈ పిల్లలకు అటువంటి విచిత్రాలేవి? పంచరంగుల ప్రపంచాలేవి? మేము పడుతూలేస్తూనే బంగారు బాల్యాన్ని చవిచూసాం. ఆటలూ..పాటలూ...కథలూ...హాయిగా అనుభవించాం. సోవియెట్ ప్రచురణల పుణ్యమాని కథాలోకాల్లోకి షికార్లు చేశాం. కొత్తసాహితీ ప్రపంచపు దార్లు కనిపెట్టాం. రచయితలమయ్యాం. కళాకారులయ్యాం. బొమ్మలేసాం...గంతులేసాం... జీవితాన్ని ఆస్వాదించాం. ఆ పుస్తకాలన్నీ మేం మనిషిగా ఎదగడం నేర్పాయి. ప్రేమగా ఉన్నతమైన విలువలు బోధించాయి. ఎంత గొప్పదీ జీవితం!అంటూ వికాసాన్ని నేర్పాయి. మర్చిపోలేం...పోగొట్టుకోలేం...ఆమంచికాలాన్ని! తర్వాత ఈ వారసత్వాన్ని మా పిల్లలకి అందించాం.

ఆ సాహితీనిధులని అన్వేషించి తవ్వి ప్రపంచానికి పంచడానికి కొంతమంది యుగకర్తలు అవతరించారు. ఈ మహత్తర కార్యాన్ని మనోజ్ఞంగా ప్రదర్శిస్తున్న అనిల్ బత్తులగారిని...వారి నేస్తాలని...అంతులేని కృతజ్ఞతలతో సన్మానిస్తూ....లెక్కలేనన్ని అభివాదాలు చేస్తూ......

తీపిజ్ఞాపకలతో,
దాసరి శిరీష 

సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్

 సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్   ప్రగతి ప్రచురణాలయం, మాస్కో, యూ.యస్.యస్.ఆర్, తెలుగు విభాగపు మాజీ అధిపతి ***...